(Source: ECI/ABP News/ABP Majha)
Sleep Walking: స్లీప్ వాకింగ్‌కు కారణాలివే, ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం పొంచి ఉన్నట్టే
చాలా మందికి నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. కానీ అది ఎందుకు వస్తుందో ఎవరికీ తెలియదు.
స్లీప్ వాకింగ్... సమస్య చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ అలసత్వం వహిస్తే ఆ సమస్యే చాలా ప్రమాదకరంగా మారుతుంది.స్లీప్ వాకింగ్ అంతర్లీనంగా కొన్ని ఆరోగ్య సమస్యలను సూచిస్తుందని కొన్ని అధ్యయనాలు తెలియజేశాయి. కొందరిలో ఈ పరిస్థితి అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, రెస్ట్ లెస్ లెగ్స్ సిండ్రోమ్ అనే సమస్యల వల్ల కూడా కలగవచ్చు. వీటిని చికిత్స చేస్తే స్లీప్ వాకింగ్ మానేసే అవకాశం ఉంది. ఈ రెండే కాకుండా మరికొన్ని కారణాల వల్ల కూడా నిద్రలో నడిచే అవకాశం ఉందని చెబుతున్నారు వైద్యులు.
1. జన్యుపరంగా కుటుంబచరిత్రలో ఉండడం వల్ల కూడా కొందరిలో నిద్రలో నడిచే అలవాటు వస్తుందని అధ్యయనాలు స్పష్టంగా చెబుతున్నాయి. తల్లిదండ్రులకు ఈ అలవాటు ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం 61 శాతం ఎక్కువ. తల్లిదండ్రులకు ఈ సమస్య లేకపోయినా 22 శాతం మంది పిల్లలు స్లీప్ వాకింగ్ చేస్తున్నట్టు గుర్తించారు పరిశోధకులు.
2. నిద్రలేమి వల్ల కూడా స్లీప్ వాకింగ్ సమస్య మొదలవుతుంది. రెండు రోజులు సరిగా నిద్రపోకుండా మూడో రోజు గాఢనిద్రలోకి జారుకున్నా కూడా ఇలా జరుగుతుంది.
3. కొన్ని రకాల మందుల ప్రభావం కూడా ఉంటుంది. ఆ మందులు ప్రజలకు ఒకరకమైన నిద్రలోకి జారుకునేలా చేస్తాయి. ఈ పరిస్థితి నిద్రలో నడిచే అవకాశాన్ని పెంచుతుంది.
4. సాయంత్రం పూట ఆల్కహాల్ తాగడం వల్ల ఒక వ్యక్తి నిద్ర దశల్లో అస్థిరత ఏర్పడుతుంది. ఇది స్లీప్ వాకింగ్ ప్రమాదాన్ని పెంచుతుంది.
5. మెదడుకు గాయం తగలడం, మెదడు వాపు వంటివి నిద్రలో నడిచేందుకు ట్రిగ్గర్ చేసే అంశాలు.
6. పిల్లల్లో తీవ్ర జ్వరం కలిగినప్పుడు వారు స్లీప్ వాకింగ్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు బయటపడింది. రాత్రిపూటే అధికంగా ఇలా జరుగుతుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
1. స్లీవ్ వాకింగ్ అలవాటున్న వారు తమ అలవాటుకు తగ్గట్టే ఇల్లును సర్దుకోవాలి.పదునైన వస్తువులు, చాకులు, మేకులు వంటివి నడిచే దారిలో లేకుండా ఎత్తయిన ప్రదేశాల్లో దాచేయాలి.
2. కిటికీలు, తలుపులు గెడలు వేసి ఉంచుకోవాలి. లేకుంటే నిద్రలో బయటికి నడిచి వెళ్లిపోవచ్చు.
3. ముఖ్యంగా మేడ మీద, బాల్కనీలలో నిద్రించడం మానేయాలి.
4. మీరు నిద్రించిన గది తలుపుల గెడలు వేసుకుంటే ఆ గది నుంచి బయటికి వెళ్లే ఛాన్సు ఉండదు.
చికిత్స
రోగి వయస్సు, ఎంత తరచుగా సమస్య కలుగుతోంది అన్న అంశాలపై చికిత్స ఆధారపడి ఉంటుంది. స్లీప్ వాకింగ్ ను సాధారణ సమస్యగా వదిలేయకుండా, ఎందుకో కలుగుతుందో తెలుసుకుని చికిత్స తీసుకోవడం అన్ని విధాలా మంచిది. స్లీప్ వాకింగ్ వల్ల వారికే కాదు, ఆ ఇంట్లో ఉన్నవారికి కూడా సమస్యలు కలుగవచ్చు.
Also read: పీరియడ్స్ సక్రమంగా రావాలా? ఈ పానీయాలు ప్రయత్నించండి
Also read: ఒక కప్పు హలీమ్ తింటే ఆ పూట భోజనం అవసరం లేదు, ఎంతో శక్తి, ఆరోగ్యం కూడా