Haleem: ఒక కప్పు హలీమ్ తింటే ఆ పూట భోజనం అవసరం లేదు, ఎంతో శక్తి, ఆరోగ్యం కూడా
హలీమ్ ను తినడం కోసమే రంజాన్ మాసం కోసం వేచి చూసే ఆహారప్రియులు ఎంతో మంది.
అరేబియా ఎడారుల మీదుగా హైదరాబాద్ చేరింది హలీమ్. హలీమ్ రాక వెనుక ఎన్నో కథలు ఉన్నాయి. ఆ కథల సంగతి పక్కన పెడితే ఆ వంటకం ఆరోగ్యానికి చేసే మేలు గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హలీమ్‌ను చూసి కొవ్వు పట్టే ఆహారమని, తింటే ఇంకా బరువు పెరిగిపోతామని చాలా మంది భయపడిపోతారు. సీజనల్ కూరగాయలు, సీజనల్ పండ్లలాగే హలీమ్‌ను సీజనల్‌గా ఆహారంగా తింటే చాలా మంచిది. ఒక కప్పు హలీమ్ తింటే ఒకపూట పోషకాహారంతో కూడిన సంపూర్ణమైన భోజనాన్ని తిన్నట్టే లెక్క.
సింగిల్ డిష్ మీల్
మనం మధ్యహ్నం అయ్యేసరికి అన్నం, పప్పు, కూర, చారు, పెరుగు, చపాతీలు... ఇలా నాలుగైదు రకాల ఆహార పదార్థాలను తింటాం. అవన్నీ తింటేనే అన్ని రకాల పోషకాలు మన శరీరానికి అందుతాయి. వాటి బదులు హలీమ్ ఒక్క కప్పు తింటే చాలు ఆ ఆహారాల్లో ఉన్న పోషకాలన్నీ లభిస్తాయి. రంజాన్ మాసంలో పన్నెండు గంటల పాటూ నీరు తాగకుండా, ఏమీ తినకుండా ఉండే ముస్లిం సోదరులకు హలీమ్ రోజంతా శక్తినందించే ఔషధం. అందుకే ఇఫ్తార్ విందులో కచ్చితంగా హలీమ్‌ను తింటారు. బరువు తగ్గేవారికి కూడా ఇది మంచి ఎంపిక. దీన్ని తిన్నాక త్వరగా ఆకలి వేయదు. కాబట్టి ఏవి పడితే అవి పొట్టలో వేయకుండా కంట్రోల్ ఉంటాం. అలా కూడా శరీరంలో కొవ్వు చేరకుండా కాపాడుకోవచ్చు.
సంతానోత్పత్తికీ...
హలీమ్ స్త్రీలు, పురుషులూ ఇద్దరిలోనూ సంతానోత్పత్తి శక్తిని పెంచుతుంది. అందుకే దీన్ని అప్పట్లో అరేబియా దేశాల్లో ఔషధంలా భావించి తినేవారు. ఒక మనిషికి రోజుకు కావాల్సిన కెలోరీలో 30 శాతం ఒక కప్పు హలీమ్ తినడం ద్వారా పొందవచ్చు. హలీమ్ లో తాజా మాంసం, పప్పు ధాన్యాలు, నెయ్యి, డ్రైఫ్రూట్స్, మసాలాలు, యాలకులు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టులు, పచ్చిమిర్చి గోధుమ రవ్వ వంటివి వాడతారు. అవన్నీ శరీరానికి అపారమైన శక్తినిచ్చేవే.
వందగ్రాములు హలీమ్‌లో...
కేలరీలు - 157
ప్రోటీన్ - 9.7గ్రాములు
ఫ్యాట్ - 6.86 గ్రాములు
కార్బోహైడ్రేట్లు - 15.2 గ్రాములు
ఇనుము - 4.27 మిల్లీ గ్రాములు
కాల్షియం - 41 మిల్లీ గ్రాములు
విటమిన్ సి - 3.1 మిల్లీ గ్రాములు
విటమిన్ ఎ - 31 మైక్రో గ్రాములు
డైటరీ ఫైబర్ - 6.2 గ్రాములు
సోడియం - 121 మిల్లీగ్రాములు
సుగర్స్ - 1.06గ్రాములు
అక్కడ అల్పాహారం...
ఇక్కడ మనం కేవలం రంజాన్ మాసంలోనే దీన్ని తింటూ ఉంటాం. హలీమ్ అందుబాటులో అధికంగా ఉండేది కూడా ఈ నెలలోనే. కానీ ఇరాక్ లో మాత్రం ఇది సాధారణ వంటకం. దీన్ని అల్పాహారంగా అక్కడ ఉదయం పూట తింటారు. దీన్ని తిని బయటికి వెళితే శరారానికి పుష్కలంగా శక్తి అందుతుందని వారి నమ్మకం.
Also read: కొందరి మహిళల్లో గర్భాశయంలో గడ్డలు ఎందుకు ఏర్పడతాయి? ముందుగా అడ్డుకోలేమా?