Pollution: ఏటా 90 లక్షల మందిని చంపేస్తున్న కాలుష్యం, టాప్‌లో ఉన్న దేశం అదే
కరోనాను మించి మహమ్మారి కాలుష్యం. ఇదే ఏటా 90 లక్షల మందిని చంపేస్తోంది.
ఎంతో మంది మరణానికి కారణమైన కరోనా వైరస్‌ను మహమ్మారి అని పిలిస్తే, అంతకుమించి మారణహొమం సృష్టిస్తున్న కాలుష్యాన్ని మరేమని పిలవాలి? కరోనా, క్యాన్సర్, గుండె జబ్బులు... వంటి రోగాల బారిన పడి మరణించిన వారి కంటే, ఏటా కాలుష్యం బారిన మరణిస్తున్న వారి సంఖ్యే అధికం. ప్రపంచవ్యాప్తంగా ఏటా 90 లక్షల మంది కాలుష్య కారణంగా మరణిస్తున్నట్టు కొత్త అధ్యయనం తెలిపింది. అందులోనూ అన్ని దేశాలతో పోలిస్తే చైనాలోనే కాలుష్య మరణాలు అధికంగా ఉన్నట్టు తెలిసింది. ఇక అత్యధిక జనాభా కలిగిన రెండో దేశమైన ఇండియా కాలుష్య కారణంగా మరణిస్తున్న వారి జాబితాలోనూ రెండో స్థానంలో నిలిచింది.
అధ్యయనం చేసిందెవరు?
ఈ అధ్యయనం తాలూకు వివరాలు ‘ద లాన్సెట్ ప్లానెటరీ హెల్త్’ అనే జర్నల్ లో ప్రచురించారు. దాని ప్రకారం ఈ అధ్యయనాన్ని కరోనా రాక ముందు నిర్వహించారు. దీన్ని అమెరికాకు చెందిన గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ సంస్థ వారి డేటాబేస్, సియాటిల్‌లోని ఇన్ స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యూయేషన్ నుంచి తీసుకున్న లెక్కల ఆధారంగా రూపొందించారు. ప్రపంచంలోనే అది పెద్ద జనాభా కలిగిన దేశాలైన చైనా, ఇండియా కాలుష్య మరణాలలో కూడా మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. చైనాలో ఏటా 24 లక్షల మంది కాలుష్య కారణంగా మరణిస్తుంటే, భారత్‌లో 22 లక్షల మంది అనారోగ్యాల బారిన పడి మరణిస్తున్నారు.
నివారించదగ్గ మరణాలే
జార్ట్ వాషింగ్టన్ యూనివర్సిటీ డీన్ లిన్ గోల్డ్‌మన్ మాట్లాడుతూ ‘ఈ మరణాలన్నీ నివారించదగ్గ మరణాలే. ఇవన్నీ అనవసర మరణాలు’ అని అన్నారు. కాలుష్యాన్ని తగ్గించుకుంటే ఎన్నో ప్రాణాలు నిలిచేవని అభిప్రాయపడ్డారు. ఈ మరణాలలో చాలా మంది డెత్ సర్టిఫికెట్లలో కాలుష్యం కారణంగా మరణించినట్టు ఉండదని, గుండె జబ్బు, స్ట్రోక్, ఊపిరితిత్తుల క్యాన్సర్, మధుమేహం వంటి కారణాలు ఉంటాయని అన్నారు. కానీ అవన్నీ వారికి వచ్చింది కేవలం కాలుష్యం వల్లేనని తెలిపారామె. కాలుష్యంతో సంబంధం కలిగి ఉన్న జబ్బుల వల్లే అధిక శాతం మరణిస్తున్నారని చెప్పారు. ‘కాలుష్యం నేరుగా ఎవరి గొంతు నొక్కి చంపేయదు, దాని కారణంగా వారి ప్రధాన అవయవాలు దెబ్బ తిని చావు ముంచుకొస్తుంది’ అని వివరించారు.
గతంతో పోలిస్తే..
ఇదే అధ్యయనం గతంలో 2000లో కూడా జరిగింది. అప్పుడు పారిశ్రామిక వాయు కాలుష్యం కారణంగా 29 లక్షల మందిని మరణించినట్టు తేలింది. 2015 నాటికి ఆ సంఖ్య 42 లక్షలకు, 2019 నాటికి 45 లక్షలకు చేరుకుందని అధ్యయనాలు చెబుతున్నాయి. 2019లో కేవలం వాయు కాలుష్యం కారణంగానే 67 లక్షల మంది మరణించినట్టు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.