Plastic: షాకింగ్, రక్తంలోనూ చేరిపోయిన ప్లాస్టిక్ , నిరూపించిన కొత్త పరిశోధన
ప్లాస్టిక్ వినియోగం మానవాళికి ఎప్పుడైనా ముప్పు తెచ్చి పెట్టే వ్యవహారమే. ఈ విషయాన్ని ఎన్నో సార్లు పర్యావరణవేత్తలు చెబుతూనే ఉన్నారు.
ప్లాస్టిక్ వాడకం చాలా అధికమైపోయింది. ఎక్కడా చూసినా ప్లాస్టిక్ ఉత్పత్తులే. మన వాటర్ బాటిళ్ల దగ్గర నుంచి టిఫిన్ బాక్సుల వరకు పాస్టిక్ తో చేసినవే. చివరికి ఈ ప్లాస్టిక్ మన రక్తంలో కూడా చేరిపోయింది. మానవరక్తంలో ప్లాస్టిక్‌ల ఉనికి తెలుసుకోవడానికి నిర్వహించిన అధ్యయనంలో దాదాపు 80 శాతం మంది రక్తంలో మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నట్టు తేలింది. ఈ అధ్యయనాన్ని నెదర్లాండ్స్ లోని వ్రిజే యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించారు. వారు ఈ పరిశోధన కోసం 22 మంది వద్ద నుంచి రక్తాన్ని సేకరించారు. ఆ రక్తాన్ని పరిశీలించిగా దాదాపు 17 మంది రక్తం మైక్రోప్లాస్టిక్ ఉనికి బయటపడింది. దీన్ని బట్టి చూస్తే ప్రపంచ జనాభాలో చాలా మంది రక్తంలో ఈ ప్లాస్టిక్ కణాలు ఉండే అవకాశం ఉంది.
ఏ ప్లాస్టిక్?
పరిశోధకులు విడుదల చేసిన నివేదిక ప్రకారం పాలిధిలీన్ టెరెఫ్తెలేట్ అని ప్లాస్టిక్ సగం మంది రక్తంలో ఉంది. ఈ ప్లాస్టిక్ ను వాటర్ బాటిల్స్, జ్యూస్‌లు, కూల్ డ్రింకుల బాటిళ్ల తయారీలో వినియోగిస్తారు. కొంతమంది రక్తంలో పాలీస్టైరీన్ ఉంది. దీన్ని ఆహారం ఉత్పత్తుల ప్యాకేజింగ్ వాడతారు. అలాగే మరికొంతమందిలో ప్లాస్టిక్ క్యారియర్ బ్యాగుల్లో వాడే పాలిథిలిన్ ఉంది. దీన్ని బట్టి చూస్తే ప్లాస్టిక్ కణాలు మన నోటి ద్వారానే శరీరం లోపలికి చేరినట్టు అర్థమవుతోంది. ఈ పరిశోధన ఫలితాలను చూసి శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయారు. మరింత లోతుగా ఈ అధ్యయనాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు.
ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ డిక్ వెథాక్ మాట్లాడుతూ ‘ఇది కచ్చితంగా ఆందోళన చెందాల్సిన విషయం. అందుకే ఈ పరిశోధనను విస్తరించాలని భావిస్తున్నాం’ అని చెప్పారు. ప్లాస్టిక్ బాటిల్స్ నీళ్లు తాగించడం, ఆహారాన్ని తినిపించడం వల్ల పిల్లల్లో మలంలో కూడా 10 రెట్లు అధికంగా మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నాయని గతంలో కొన్ని అధ్యయనాల్లో తేలింది. పిల్లలు రోజుకు మిలియన్ల మైక్రోప్లాస్టిక్ కణాలను మింగేస్తున్నట్టు ఒక అంచనా.
ప్రమాదకరం
ప్లాస్టిక్ వల్ల కలిగే కాలుష్యం మనుషులు, జంతువులు, మొక్కలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఆహారం, నీరు, గాలి ద్వారా కూడా ప్లాస్టిక్ మానవుల శరీరంలో చేరుతోంది. ఈ మైక్రోప్లాస్టిక్‌లు మానవ కణాలను దెబ్బతీస్తాయి. అంతేకాదు ఎర్ర రక్త కణాల సామర్ధ్యాన్ని తగ్గిస్తాయి. 2040 నాటికి ప్లాస్టిక్ ఉత్పత్తులు రెట్టింపు కాబోతున్నాయి.
Also read: త్వరలో మగవారికీ గర్భనిరోధక మాత్రలు, అవి వస్తే ఆడవారి కష్టాలు తీరినట్టే