Laddoo Recipe: నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా పెసరపప్పుతో కమ్మని లడ్డూలు
లడ్డూలంటే ఇష్టం లేనిది ఎవరికి? ఈసారి పెసరపప్పుతో లడ్డూ చేసుకుంటే ఆ టేస్టే వేరు.
వేసవిలో పెసరపప్పుతో చేసిన వంటలు తినడం చాలా అవసరం. ఇవి శరీరానికి చలువ చేస్తాయి. పెసరపప్పును కనీసం వారానికి రెండు మూడు సార్లయినా తినమని సిఫారసు చేస్తారు పోషకాహార నిపుణులు. ఇందులో కాల్షియం, మెగ్నిషియం, సోడియం, పొటాషియం వంటి అత్యవసర పోషకాలు ఉంటాయి. పెసరపప్పు తినడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయటపడొచ్చు. అంతేకాదు బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది. పిల్లలకు పెసరపప్పు అన్నం రెండు మూడు రోజులకోసారి పెడితే వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. డయేరియా సమస్య నుంచి బయటపడేయగల శక్తివంతమైనది పెసర పప్పు. చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించే శక్తి పెసరపప్పులో ఉంది. రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో ముందుటుంది.
కావాల్సిన పదార్థాలు
పెసరపప్పు - ఒక కప్పు
నెయ్యి - పావు కప్పు
జీడి పప్పులు - గుప్పెడు
బాదం పలుకులు - పది
యాలకుల పొడి - అర టీస్పూను
పంచదార పొడి - అరకప్పు
తయారీ ఇలా
1. స్టవ్ మీద కళాయి పెట్టి పెసరపప్పు వేయించాలి. మరీ నల్లగా మారేవరకు కాకుండా, కాస్త రంగు మారేవరకు వేయించాలి.
2. పప్పును మిక్సీలో వేసి పొడి కొట్టాలి. ఉండల్లేకుండా చేతితో నలుపుకోవాలి.
3. స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి. ఆ నేతిలో పెసరపప్పు పొడి వేయాలి.
4. పదినిమిషాల పాటూ వేయిస్తే కాస్త బ్రౌన్ రంగులోకి మారుతుంది.
5. ఆ పొడిని తీసి ఒక బౌల్ లో వేసుకోవాలి. అందులో పంచదార పొడి, యాలకుల పొడి వేయాలి.
6. జీడిపప్పు, బాదంపప్పులను సన్నగా తరిగి వాడిని కూడా మిశ్రమంలో కలిపేయాలి.
7. చేతికి నెయ్యి కాస్త రాసుకుని లడ్డూల్లా మెత్తగా ఒత్తుకోవాలి. పెసరపప్పు తినడం చాలా బలం కూడా.
View this post on Instagram
Also read: గాఢమైన నిద్ర కావాలా? రాత్రి ఈ పానీయాలను తాగితే సరి
Also read: తెలివైన వారే ఇందులో ఎన్ని ముఖాలు ఉన్నాయో చెప్పగలరు, కొంచెం కష్టమే కానీ అసాధ్యం కాదు