Alcohol Allergy: ఆల్కహాల్ అలెర్జీ ఉన్నవారిలో గుండెపోటు వచ్చే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువ
ఆల్కహాల్ అలెర్జీ ఉన్నవారు ఆ పానీయం తాగినప్పుడు చాలా ఇబ్బంది పడతారు. కొన్ని ప్రమాదకర సమస్యల బారిన పడే అవకాశం ఉంది.
వారంలో ఐదు రోజులు కష్టపడ్డాక, వారాంతంలో అంటే శని, ఆదివారాల్లో ఎక్కువమంది ఎంజాయ్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఆల్కహాల్ తాగే అలవాటు ఉన్నవారు అయితే స్నేహితులతో అదే పనిలో ఉంటారు. ఆల్కహాల్ తాగిన తర్వాత వికారంగా, అసౌకర్యంగా అనిపిస్తే మీకు ఆల్కహాల్ అలెర్జీ ఉందని అర్థం. అయినా కూడా ఆపకుండా ఆల్కహాల్ అలవాటును కొనసాగిస్తే అది ప్రాణాంతక సమస్యలకు కారణం అవుతుంది. ఇలా మద్యం తాగాక వికారంగా, అసౌకర్యంగా అనిపించే వారిలో గుండెపోటు లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువ అని పరిశోధనలు చెబుతున్నాయి.
ప్రతి 12 మంది పెద్దలలో ఒకరికి ఇలా ఆల్కహాల్ అలెర్జీ ఉన్నట్టు తెలుస్తోంది. కానీ ఆ విషయం వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. దీనివల్ల ఆల్కహాల్ అలవాటును కొనసాగిస్తూ అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. స్థిరంగా మద్యపానం అలవాటును కొనసాగించే వారిలో రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా అధికమే.
ఈ లక్షణాలు ఉంటే
ఆల్కహాల్ ఎలర్జీ ఉన్నవారిలో అది తాగాక కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. అవి ఏంటంటే....
1. వికారంగా అనిపించడం
2. వాంతులు అవ్వడం
3. తలనొప్పి అధికంగా రావడం
4. గుండె కొట్టుకునే వేగం పెరగడం
5. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడం
6. ఆస్తమా ఎక్కువ కావడం
7. రక్తపోటు పడిపోవడం
8. మూర్చ రావడం
9. ఒంటిపై దద్దుర్లు రావడం
పైన చెప్పినవన్నీ ఆల్కహాల్ అలెర్జీ లక్షణాలు. మీరు మద్యం తాగాక ఇలాంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడటం అవసరం. మద్యం తాగాక వ్యక్తి ఎర్రగా మారితే అతనికి ఆల్కహాల్ అలెర్జీ ఎక్కువగా ఉందని అర్థం. ఇలా ఎర్రగా మారడానికి కారణం రోగనిరోధక వ్యవస్థలో హిస్టామిన్లు విడుదలవ్వడం. అప్పుడు రక్తనాళాలు విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడే నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీని కారణంగా మనిషి ఇలా ఎర్రగా మారిపోతాడు. ఆల్కహాల్ అలెర్జీ మీకు ఉందనిపిస్తే దాన్ని మానేయడం బెటర్.
ఆల్కహాల్ వల్ల నష్టాలు
ఆల్కహాల్ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య నష్టాలు ఉన్నాయి. ఆల్కహాల్ శరీరంలో చేరాక ఎన్నో మార్పులకు కారణం అవుతుంది. ఆల్కహాల్ తరచూ తాగే వారిలో జ్ఞాపకశక్తిని కోల్పోవడం, గుండె, ఊపిరితిత్తుల సమస్యలు రావడం, కిడ్నీలు దెబ్బతినడం, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం, వికారం, వాంతులు, అనేక రకాల క్యాన్సర్లు బారిన పడే ప్రమాదం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, డిప్రెషన్, వంటివి జరుగుతాయి. మద్యపానం చాలా హానికరం. ఇంటా, బయటా మద్యపానం వల్ల ఎన్నో నష్టాలు కలుగుతాయి.
Also read: షాకింగ్, కార్న్ ఫ్లాక్స్ తినడం మానేయమని చెబుతున్న హార్వర్డ్ పరిశోధన
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.