Corona Vaccine: పిల్లల కోసం ఐవీఎఫ్ చికిత్స తీసుకునేవాళ్లు కూడా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు... కొత్త అధ్యయన ఫలితం
కరోనా వ్యాక్సిన్ పై చాలా అపోహలు ప్రజల్లో ఉన్నాయి. అందులో ఒకటి పిల్లల కోసం ప్రయత్నించే వాళ్లు కరోనా వ్యాక్సిన్ వేయించుకోకూడదని.
టీకాలు వేయించుకునే ముందు ప్రజలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటున్నారు... ఇంకా వారిలో ఏవో భయాలు, అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా పిల్లల కోసం ప్రయత్నించేవాళ్లు, గర్భిణిలు, పాలిచ్చే తల్లులు, ఐవీఎఫ్ పద్ధతిలో గర్భం దాల్చేందుకు ప్రయత్నించే వాళ్లు కూడా వ్యాక్సిన్‌ను దూరం పెడుతున్నారు. వారి భయాలను దూరం చేసేందుకు ఓ అంతర్జాతీయ స్థాయిలో ఓ అధ్యయనం జరిగింది. ఆ అధ్యయనంలో పిల్లలకోసం ప్రయత్నించే వాళ్లు, అందుకోసం చికిత్స తీసుకుంటున్నావాళ్లు, ఐవీఎఫ్ చికిత్స తీసుకుంటున్న వాళ్లు కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చని, వ్యాక్సిన్ చికిత్సపై ఎలాంటి ప్రభావం చూపించదని తేలింది. గర్భిణిలు కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చని ఇంతకుముందే చాలా పరిశోధనలు తేల్చి చెప్పాయి.
న్యూయార్క్ లోని ఇకాన్ స్కూల్ మెడిసిన్ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఐవీఎఫ్ చికిత్స తీసుకుంటున్నవారిని, తీసుకోని వారిని కూడా పరిశోధించారు. వారిలో గర్భం, ఫలదీకరణం, గర్భస్రావం అయ్యే రేట్లు పోల్చారు. వీరిలో వ్యాక్సిన్ వేసుకున్న వారిలో, వేసుకోని వారిలో ఫలితాలు ఒకేలా ఉన్నాయి. దీన్ని బట్టి గర్భంపై లేదా ఫలదీకరణంపై వ్యాక్సిన్ ఎలాంటి ప్రభావం చూపించదని తేలింది. అయితే బిడ్డ పుట్టాక వారిలో యాంటీ బాడీలు కనిపించే అవకాశం ఉందని చెప్పారు పరిశోధకులు. టీకాలు వేయించుకున్నవారిలో అండాశయ స్టిమ్యులేషన్, అండం నాణ్యత, పిండం అభివృద్ధి, గర్భధారణ ఫలితాలలో ఎటువంటి మార్పులు కనిపించలేదు. టీకాలు వేయించుకోకుండా గర్భధరించిన వారిలో కలిగిన మార్పులే, టీకాలు తీసుకున్నవారిలోను కనిపించాయి. కాబట్టి కరోనా వ్యాక్సిన్ సంతనోత్పత్తి వ్యవస్థపై ఎటువంటి ప్రభావం చూపించదని ఫలితాన్ని తేల్చారు అధ్యయనకర్తలు.
ఈ పరిశోధనను 222 మంది వ్యాక్సిన్ వేయించుకున్న వారిపై, 983 మంది టీకాలు తీసుకోకుండా గర్భధారణకు చికిత్స తీసుకుంటున్నవారిపై చేశారు. క్రోమోజోమ్ లు, అండాలు, ఫలదీకరణం, పిండం... అన్ని అంశాల్లో వీరిద్దరిలో మార్పులు ఒకేలా ఉన్నాయి. కాబట్టి ఐవీఎఫ్ చికిత్స తీసుకుంటున్నవారు కూడా నిర్భయంగా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు.
గర్భిణీలకు మరీ మంచిది
మునుపటి అధ్యయనాల్లో కోవిడ్ టీకాలు గర్భిణిలు వేయించుకుంటే మంచిదని తేల్చాయి. అవి వారిపై, గర్భస్థ శిశువుపై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపవని చెప్పాయి. కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే నెలలు నిండకుండానే ప్రసవం అవుతుందనే అపోహ ఉండేది. కానీ అవన్నీ తప్పని, గర్భిణిలు టీకా వేయించుకోవడం వల్ల బిడ్డకు కూడా మంచి జరుగుతుందని తేలింది. పుట్టిన బిడ్డల్లో టీకా తాలూకు యాంటీబాడీలు కూడా కనిపించాయి. దీన్ని బట్టి పిండం పెరుగుదలకు టీకా ఎటువంటి ఆటంకం కలిగించదని కూడా పరిశోధకులు తేల్చిచెప్పారు.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.