Teenagers: తల్లిదండ్రులూ జాగ్రత్త, టీనేజర్లలో పెరిగిపోతున్న డిప్రెషన్ లక్షణాలు
ఇటీవల కాలంలో డిప్రెషన్ బారిన పడుతున్న టీనేజర్ల సంఖ్య పెరిగిపోతోంది
ఒక మనిషి జీవితంలో టీనేజీ చాలా ముఖ్యమైన దశ. 13 నుండి 18 ఏళ్ల లోపు వయసును టీనేజ్‌గా చెబుతారు. ఈ సమయంలో వారిలో శారీరక, మానసిక ఎదుగుదల చాలా వేగంగా ఉంటుంది. వారి ఆలోచనల్లో మార్పులు కూడా అధికంగానే ఉంటాయి. హార్మోన్ల ప్రభావం వారిపై ఎక్కువగా ఉంటుంది. భయాలు, అనుమానాలు పెరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో వారికి తల్లిదండ్రుల సపోర్ట్ చాలా అవసరం. చాలామంది టీనేజీ యువత డిప్రెషన్ బారిన పడి ప్రాణాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు వారిలో డిప్రెషన్ లక్షణాలు ముందే గుర్తిస్తే పిల్లలను కాపాడుకోవచ్చు. సొసైటీ నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లు, కుటుంబం నుంచి వచ్చే వ్యతిరేకత, సవాళ్లను ఎదుర్కో లేకపోవడం వంటివన్నీ కూడా వారిలో ఒత్తిడిని, ఆందోళన పెంచుతున్నాయి. ఆ ఒత్తిడిని తట్టుకునే శక్తి లేక టీనేజీ పిల్లలు ఆత్మహత్యల వైపు ఆలోచిస్తున్నారు. అందుకే వారి ప్రవర్తనలో ఏమైనా తేడా వస్తే తల్లిదండ్రులే చొరవ చూపాలి. వాళ్లకు ఉన్న ఆందోళన, అనుమానాలను పరిష్కరించాలి.
టీనేజీలో ఉన్న పిల్లలు సరిగా ఆలోచించలేరు. మొండితనంగా ఉంటారు. తాము అనుకున్నది జరగకపోతే తీవ్ర నిరాశకు గురవుతారు. మానసికంగా కృంగిపోతారు. వీరి మనస్తత్వం చాలా భిన్నంగా ఉంటుంది. ఎక్కువగా తోటి వారితో పోల్చుకుంటూ ఉంటారు. అందంగా లేమని, రంగు తక్కువగా ఉన్నామని, సన్నగా ఉన్నామని, లావుగా ఉన్నామని, మంచి డ్రెస్సులు లేవని ప్రతి దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎవరైనా తమకన్నా మెరుగ్గా కనిపిస్తే ఆత్మన్యూనతకు గురవుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులే వారిలో డిప్రెషన్ కు కారణం అవుతాయి. అలాగే ఎవరైనా తమలోని లోపాల్ని ఎత్తి చూపినా కూడా భరించలేరు. టీనేజీలోకి రాగానే హార్మోన్ల స్థాయిల్లో హెచ్చుతగ్గులు అధికంగా ఉంటాయి. వాటి వల్ల కూడా వీరు త్వరగా మానసిక సమస్యల బారిన పడతారు.
కొంతమందికి చిన్నప్పటినుంచి చదువు మీద చాలా ఆసక్తి ఉంటుంది. తమ కన్నా ఎవరైనా క్లాసులో మెరుగ్గా రాణిస్తే భరించలేకపోవడం వంటివి జరుగుతాయి. ఇలాంటివారు త్వరగా డిప్రెషన్ కి గురవుతారు. తాము ఎంత చదువుతున్నా క్లాస్ లో ఫస్ట్ రాలేకపోతున్నామని మానసికంగా కృంగిపోతారు.
ఒత్తిడికి, మానసిక ఆందోళనకు గురవుతున్న పిల్లలను తల్లిదండ్రులే గుర్తించాలి. వారిని కాపాడుకోవాలంటే తల్లిదండ్రుల మద్దతు చాలా అవసరం. డిప్రెషన్ తో బాధపడుతున్న పిల్లలను గుర్తిస్తే వారికి సకాలంలో చికిత్స అందించి కాపాడుకోవచ్చు. మీ పిల్లలు ఉన్నట్టుండి ఏడవడం, నలుగురితో కలవలేకపోవడం, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడడం, ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తున్నట్టు కనిపించినీ మీరు తేలిగ్గా తీసుకోవద్దు. వారి దగ్గర కూర్చుని కారణాలు తెలుసుకోండి. మాటల్లో నిరాశ, నిస్సృహాలు కనిపిస్తుంటే మీరు వారికి మద్దతుగా నిలవండి. చిన్న చిన్న విషయాలకి కోపం తెచ్చుకోవడం, వస్తువులు విసిరి కొట్టడం, ఎదుటివారిపై అరవడం వంటివి చేస్తున్న కూడా వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందే. ఆహారం తినకపోవడం కూడా డిప్రెషన్ లక్షణమే. తమకు తామే హాని చేసుకోవాలని ఆలోచించడం, ఆ ఆలోచనలు వారి మాటల్లో అప్పుడప్పుడు బయటికి రావడం జరుగుతాయి. అలాంటప్పుడు వారు డిప్రెషన్ బారిన పడ్డారని మీరు గుర్తించాలి. ఎక్కువగా నిద్రపోతున్న లేదా నిద్ర చాలా వరకు తగ్గిపోయినా కూడా డిప్రెషన్ లక్షణమే. ఇలాంటి పిల్లలకు తల్లిదండ్రులే అండగా నిలవాలి. మీ పిల్లల తప్పు చేసిన సరే వారిని మందలించడం, విపరీతంగా కోప్పడడం, అసహ్యించుకోవడం వంటివి చేయకండి. ఇది వారిలో ఆత్మహత్య ఆలోచనలను తెస్తుంది. కాబట్టి ముందు వారిని దగ్గరకు తీసుకోండి. ఊరటగా మాట్లాడండి. పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య స్నేహం కచ్చితంగా ఉండాలి. పిల్లలు ఏదైనా సరే తల్లిదండ్రులకు మనసు విప్పి చెప్పేలా ఇంట్లోని పరిస్థితులు ఉండేలా చూసుకోండి. మీరు ఎంత బిజీ అయినా కూడా మీ పిల్లల కష్టసుఖాలు తెలుసుకోవడం కోసం కొంత సమయాన్ని కేటాయించండి. డిప్రెషన్ బారిన పడినట్టు గుర్తిస్తే వెంటనే మానసిక వైద్యులను కలిసి చికిత్స అందించండి. వారు త్వరగా నే కోలుకుంటారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.