Omicron BF.7: దేశంలోకి అడుగుపెట్టిన ఒమిక్రాన్ కొత్త వేరియంట్ BF.7, ఇది ప్రమాదకరమైనదే అంటున్న ఆరోగ్యనిపుణులు
Omicron BF.7: ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BF.7 మన దేశంలో అడుగుపెట్టినట్టు అనుమానిస్తున్నారు ఆరోగ్యనిపుణులు.
Omicron BF.7: గత మూడేళ్లుగా రూపాంతరాలు చెందుతూ ప్రజలను వణికిస్తోంది కరోనా వైరస్. అందులో ఒక వేరియంట్ ఒమిక్రాన్ గత ఏడాదిగా తిష్టవేసుకుని కూర్చుంది. పరిస్థితులు చక్కబడ్డాయనుకుంటున్న తరుణంలో ఒమిక్రాన్లో ప్రమాదకరమైన వేరియంట్ BF.7 పుట్టుకొచ్చింది. దీని తొలికేసు చైనాలోని మంగోలియా ప్రాంతంలో బయటపడ్డాయి. ఇప్పుడక్కడ ఈ వేరియంట్ బారిన పడిన కేసులు పెరుగుతున్నాయి.అక్కడ్నించి ఈ వేరియంట్ ఇప్పటికే ఎన్నో దేశాలకు ప్రయాణం కట్టింది. ఇంకా మనదేశం చేరలేదులే అనుకుంటున్న సమయంలో ఓ కేసు బయటపడింది. ఆ వ్యక్తి లక్షణాలన్నీ BF.7 వేరియంట్ అని అనుమానించేలా ఉన్నాయి. గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ ఈ కొత్త కేసును గుర్తించింది. ఇది వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలున్న వేరియంట్ గా చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు.
దీపావళికి ముందు...
ఒమిక్రాన్ వేవ్ వచ్చాక ఏడాది కాలంగా ఏ వేవ్ లేకుండా ప్రశాంతంగా ఉంది జనవాళి. కానీ ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ కారణంగా వేవ్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఆరోగ్యనిపుణులు.ముఖ్యంగా దీపావళి ముందు ఈ వేరియంట్ భారత్ లో అడుగుపెట్టడం కాస్త కలవరపెట్టే విషయమే. ఎందుకంటే దీపావళికి బంధువులు,స్నేహితులు ఒకేచో గుమిగూడడం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి BF.7 వేరియంట్ త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని, తద్వారా BF.7 వేవ్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఈ వేరియంట్ చాలా బలమైనది, వ్యాక్సిన్ల ద్వారా వచ్చిన రోగనిరోధక శక్తిని కూడా తట్టుకుని శరీరంలో నిలబడగలదని హెచ్చరిస్తున్నారు. అందుకే దీపావళికి మనుషుల మధ్య ఉండేటప్పుడు కచ్చితంగా మాస్క్ ధరించమని సూచిస్తున్నారు.
ప్రాణాంతకమే...
అధికారిక గణాంకాల ప్రకారం, ఢిల్లీలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. BF.7 కారణంగా ఇంకా కేసులు పెరిగే అవకాశం ఉంది. ఈ వేరియంట్ కూడా కొందరికి ప్రాణాంతకంగా మారవచ్చని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు, వయసులో పెద్దవారు, క్యాన్సర్ ను జయించి బతికిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. రోగినిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తినడం పెంచాలని సూచిస్తున్నారు.
Omicron BF.7 లక్షణాలు
ఇతర వేరియంట్ల మాదిరిగానే BF.7 లక్షణాలు కూడా అదే విధంగా ఉంటాయి.
1. ఒళ్లు నొప్పులు అధికంగా ఉంటాయి.
2. గొంతులో మంటగా ఉంటుంది.
3. అలసటగా ఉంటుంది.
4. దగ్గు, జలుబు వేధిస్తాయి.
5. జ్వరం తీవ్రత అధికంగా ఉంటుంది.
6. ముక్కు కారుతుంది.
Also read: చెడు కొలెస్ట్రాల్ ఎంతుందో చెక్ చేసుకుంటున్నారా? 40 ఏళ్లు దాటితే ఈ పరీక్ష తప్పదు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.