Worlds Obesity Day: ఊబకాయం ఓ మహమ్మారి, ఏటా ఎంత మందిని చంపేస్తోందో తెలుసా?
ఊబకాయాన్ని మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు అదే పెద్ద సమస్యగా మారింది.
చూడటానికి లావుగా ఉంటే తప్పా, మీ శరీరాన్ని మీరు ప్రేమించండి... లాంటి వ్యాఖ్యలు ఊబకాయుల విషయంలో వినిపిస్తుంటాయి. ఎందుకంటే ట్రోలింగ్ బారిన పడేది ఊబకాయులే కాబట్టి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు అలా చెబతుంటారు. కానీ ఆరోగ్యపరంగా చూస్తే మాత్రం వారికి ఊబకాయం చాలా ప్రమాదకరం. కచ్చితంగా వారు బరువు తగ్గాల్సిందే. లేకుంటే భయంకరమైన రోగాల బారిన సులువుగా పడతారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచం వ్యాప్తంగా ఉన్న ఊబకాయుల సంఖ్య 65 కోట్ల పైమాటే. వారిలో అయిదేళ్ల లోపు వయసువారు నాలుగు కోట్ల మంది. వీరంతా కూడా ప్రమాదం అంచున ఉన్నట్టే. గుండెజబ్బులు, మధుమేహం, హైబీపీ వంటివి త్వరగా వీరిలో కలుగుతాయి. తద్వారా వీరి జీవనకాలం కూడా తగ్గుతుంది.
మూడు రెట్లు పెరిగింది...
1975నుంచి పోల్చుకుంటే ఇప్పటికీ ప్రపంచంలో మూడు రెట్లు ఊబకాయుల సంఖ్య పెరిగింది. 2016 గణన ప్రకారం 190 కోట్ల మంది అధికబరువుతో బాధపడుతుంటే, వారిలో 65 కోట్ల మంది ఊబకాయుల జాబితాలోకి వస్తారు. వీరు మితిమీరిన బరువు కారణంగా రకరకాల వ్యాధుల బారిన పడి మరణిస్తున్నారు. కేవలం ఊబకాయం కారణంగానే ఏటా మరణిస్తున్న వారి సంఖ్య 30 లక్షలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
అమెరికాలోనే అధికం
అన్నిదేశాలతో పోలిస్తే అమెరికాలోనే ఊబకాయుల సంఖ్య అధికం. ఆ దేశజనాభాలో 36 శాతం మంది ఊబకాయులే. అందుకే అక్కడి అమెరికా మెడికల్ అసోసియేషన్ 2013 నుంచ ఊబకాయాన్ని ఒక వ్యాధిగా పరిగణిస్తోంది. నిజానికి అమెరికా ప్రజలు మాత్రం అతి బరువును ఒక సమస్యగా చూడరు. బర్గర్లు, పిజ్జాలు లాగిస్తూనే ఉంటారు.
జన్యుపరంగా కూడా...
ఊబకాయం వారసత్వం కూడా వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఊబకాయులకు పుట్టే పిల్లలు కూడా లావుగా ఉండే అవకాశం అధికం. తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరూ ఊబకాయంతో ఉన్నా కూడా వారి పిల్లలకు జన్యువుల ద్వారా అధిక బరువు సమస్య రావచ్చు.
పరిష్కారం ఉంది...
బరువు అదుపులో పెట్టుకోవాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి. బరువు పెరుగుతున్నట్టు అనిపిస్తే వ్యాయామాలు, తేలికపాటి ఆహారంతో కంట్రోల్ ఉంచుకోవాలి. పండ్లు, తాజా కూరగాయలు అధికంగా తినాలి. పిజ్జాలు, బర్గర్లు, నూడుల్స్, ఫ్రైడ్ చికెన్ వంటి జంక్ ఫుడ్ ను దూరంగా పెట్టాలి. ముఖ్యంగా మద్యపానానికి దూరంగా ఉండాలి.
Also read: సగ్గుబియ్యం ఎందుకంత ఆరోగ్యమో తెలుసా? వాటి తయారీలోనే ఉంది రహస్యమంతా