(Source: ECI/ABP News/ABP Majha)
Brushing at Night: రాత్రి బ్రష్ చేయడం లేదా? జాగ్రత్త, మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉంది!
రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకుని తీరాలని నిపుణులు సలహా ఇస్తుంటారు. కానీ వినేవారు చాలా తక్కువమంది. ఇప్పుడు కొత్త అధ్యయన వివరాలతో మరింత సీరియస్ గా చెబుతున్నారు.
ఉదయం నిద్ర లేవగానే బ్రష్ చేయడం మంచి అలవాటే. క్రిములు నోటి నుంచి కడుపులోకి వెళ్లకుండా ఉండేందుకు ఇది చాలా అవసరం. అంతవరకు ఒకే.. కానీ, మరి రాత్రిళ్లు? ఔనండి, నిద్రపోవడానికి ముందు కూడా బ్రష్ చేయాలట. లేకపోతే అది మీ ఆరోగ్యానికే ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేకపోతే ఆంజీనా (గొంతు వాపు వ్యాధి), గుండె ఆగిపోవడం లేదా గుండె పోటు వంటి సమస్యలు రావచ్చని చెబుతున్నారు.
ఏప్రిల్ 2013 , మార్చి 2016 మధ్య కాలంలో జపాన్ లోని ఒసాక యూనివర్సిటి హాస్పిటల్ కి పరీక్షలకోసం, సర్జరీల కోసం, ఇతర చికిత్సల కోసం వచ్చిన 20 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న 1,675 మంది పేషెంట్ల డేటాను అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు ఈ ఆశ్చర్యకరమైన వివరాలను వెల్లడి చేశారు.
నోటి శుభ్రత, అలవాట్ల ఆధారంగా ఈ పేషెంట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు.
- రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకునే వ్యక్తులు (ఉదయం నిద్ర లేవగానే, రాత్రి నిద్రకు ముందు)
- కేవలం ఉదయం మాత్రమే బ్రష్ చేసుకునే వారు
- రాత్రి పూట మాత్రమే బ్రష్ చేసుకునే వారు
- ఎంత మాత్రమూ నోటి పరిశుభ్రత గురించి ఆలోచించని వారు
వయసు, లింగం, పొగతాగే అలవాటు, దంత, ఇతర వైద్య రికార్డులు కూడా ఈ అధ్యయనంలో పరిగణనలోకి తీసుకున్నారు. హార్ట్ ఫేయిల్యూర్, ఆరిథ్మియా, మయోకార్డియాల్ ఇన్ఫార్షన్, ఆంజీనా పెక్టోరిస్, వాస్క్యూలార్ అండ్ అరోటిక్ సర్జరీ అవసరమై హాస్పిటల్ లో చేరడం వంటి వివరాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.
పొగతాగే అలవాటు లేని.. కేవలం ఉదయం పూట మాత్రమే బ్రష్ చేసుకునే వారు, నోటి హైజీన్ గురించి ఏమాత్రం జాగ్రత్త తీసుకోని వారు గుండె సమస్యలతో హాస్పిటల్ లో చేరినపుడు వారి పరిస్థితి చాలా దారుణంగా ఉన్నట్టు చెబుతున్నారు.
మరోవైపు రెండు సార్లు బ్రష్ చేసుకునే అలవాటున్న వ్యక్తులు, కేవలం రాత్రి మాత్రమే బ్రష్ చేసుకునే అలవాటున్న వారిలో కోలుకునే రేటు చాలా ఎక్కువగా ఉండడం గమనించారట. ఇక పొగతాగే అలవాటున్న వారిలో ఎలాగో ఫలితాలు బావుండవని అందరికీ తెలిసిందే.
నేచర్స్ జర్నల్ సైంటిఫిక్ రీసెర్చ్ లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. ఉదయం నిద్ర లేచిన తర్వాత మాత్రమే బ్రష్ చెయ్యడం సరిపోదని, రాత్రి బ్రష్ చెయ్యడం వల్ల అనారోగ్యాలను నివారించడం సాధ్యమవుతుందని ఈ అధ్యయనం నిరూపిస్తుందని నిపుణులు సూచనలు చేస్తున్నారు. తాము నిర్వహించిన పరిశోధనలు కేవలం హృదయసంబంధమైనవి మాత్రమే అయినప్పటికీ ఆరోగ్యవంతులకు ఈ విషయం వర్తించకపోయినప్పటికీ రాత్రిపూట దంతధావనం చాలా ముఖ్యమైన విషయమని వారి అభిప్రాయం.
గుండె జబ్బులను నివారించాలని అనుకునే వారు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ముందు పళ్లు తోముకోవడం ఎంత ముఖ్యమో రాత్రి భోజనం తర్వాత నిద్రకు ఉపక్రమించే ముందు పళ్లు తోముకోవడం కూడా అంతే ముఖ్యమని ఈ అధ్యయనకారులు సలహా ఇస్తున్నారు. నోటిలోని బ్యాక్టీరియా శరీరంలో ఇన్ఫ్లమేషన్ కు కారణం అవుతుందట. గుండె జబ్బుల వంటి తీవ్రమైన అనారోగ్యాలకు కారణం కావచ్చని హెచ్చరిస్తున్నారు. ఇక నుంచి గుండె జబ్బులను నివారించే చర్యల్లో వ్యాయామం, ఆహారం, నిద్రతో పాటు రెండు సార్లు బ్రష్ చేసుకోవడం కూడా అలవాటు చేసుకోవలసి ఉంటుంది.
Also read : Bathing Tips: స్నానం చేసేప్పుడు కాళ్లు కడుగుతున్నారా? ఇది తప్పకుండా తెలుసుకోండి
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.