Fear: భయాన్ని జయిస్తేనే విజయం - ఇలా చేస్తే ఏ ఆందోళనా దరిచేరదు
ఎవరైనా సరే భయం లేకుండా బతకాలనే కోరుకుంటారు. అలా భయం లేకుండా బతకాలంటే ధ్యానాన్ని జీవితంలో భాగం చేసుకోవాలి. జీవితం నుంచి భయాన్ని పారద్రోలే మార్గాలను ఇవ్వాళ తెలుసుకుందాం.
ఒకొక్కరికి ఒక్కో రకమైన భయం ఉంటుంది. రకరకాల భయాలతో ఎప్పుడూ సతమతం అవుతూ ఉంటారు. పనులు జరుగుతాయో లేదో, విజయవంతం అవుతుందో లేదో వంటి అనేక రకాల అనుమానాలతో ప్రశాంతంగా ఉండలేరు. ఇలాంటి అశాంతి వల్ల మనసులో భయం గూడు కట్టుకొని ఉంటుంది. మనసులోని చింత జీవితంలో భాగమే దీన్ని తప్పించుకోవడం కుదరదు. కానీ మనసులో బెంగ నిరంతరం ఉంటే రకరకాల ఆలోచనల తుఫాను చుట్టుముడుతుంది. అసలు జరుగుతాయన్న గ్యారెంటీ లేని విషయాల గురించి తలచుకొని భయం మొదలవుతుంది. అది జరగదని తెలిసినా కూడా ఒకవేళ జరిగితే అని తలచుకొని భయపడుతుంటాం. దీన్నే ఓవర్ థింకింగ్ అంటారు. ఇలాంటి ఓవర్ థింకింగ్ సమస్య చాలా మందిలో ఉంటుంది. ఈ ఓవర్ థింకింగ్ ఆంక్జైటీకి కారణం అవుతుంది. ఒక సారి ఆందోళన మొదలైతే ఇక అది ఎంత దూరమైనా వెళ్లొచ్చు. ప్యానిక్ గా మారిపోతారు కొందరు. కొందరు ఇలాంటి పరిస్థితుల్లో దిద్దుకోలేని తప్పులు చేస్తారు. మరికొందరైతే ప్రాణాల మీదకే తెచ్చుకుంటారు.
భయాన్ని మించిన మానసిక రోగం మరోటి లేదు. ఏపనీ చెయ్యనియ్యదు. ప్రతి క్షణం మనల్ని వెనక్కి లాగే తాడు ఇది. భయాన్ని జయించ గలిగితేనే విజయం సాధించగలిగేది. అందుకు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు, జీవన విధానంలో కొన్ని మార్పులు చాలు. చిన్న మార్పులే పెద్ద పరిణామాలకు కారణం కాగలవని పర్సనాలిటీ నిపుణులు చెబుతూ ఉంటారు. పెద్ద విజయాల కోసం కొద్దిగా మార్పులు చేసుకుంటే తప్పులేదు కదా. మరి అవి ఎలాంటి మార్పులనేది తెలుసుకుందాం.
భయాన్ని వదిలించుకునే కొన్ని మార్గాలు
ఇలా చిన్నచిన్న సమస్యల గురించి ఎక్కువ ఆలోచించి ఆందోళన కలుగుతున్నపుడు కొన్ని నిమిషాలు ధ్యానంలో కూర్చుంటే మంచి ఫలితం ఉంటుంది.
- ముందుగా జరిగేదంతా మంచికే అనే ఒక చిన్న నిబంధనను మీకు చెప్పుకోగలగాలి. అది మనలో ధైర్యాన్ని పెంచుతుంది. ఏది జరిగినా దాని వెనుక ఏదో మంచి ఉంటుందని మనసు నమ్ముతుంది.
- ధ్యానం జీవితంలో భాగం చేసుకోవడం మంచిది. క్రమం తప్పకుండా ధ్యాన సాధన చెయ్యాలి. ఎప్పుడైనా భయం జరగబోయే దాన్ని ఊహించుకోవడం వల్ల కలుగుతుంది. ఊహలోనే భయం ఉంటుందని గుర్తించాలి. భయాన్ని అధిగమించందుకు ఈ నిమిషాన్ని ఆస్వాధించడం నేర్చుకోవాలి. దీనికి ధ్యానం మంచి మార్గం.
- ధ్యానానికి కూర్చోవడానికి ఇంట్లో ప్రశాంతంగా ఉండే ఒక మంచి ప్రదేశాన్ని ఎంచుకోవాలి. ఈ ప్రదేశం కాస్త వెలుతురు తక్కువగా, నిశ్శబ్దంగా ఉండేలా జాగ్రత్త పడాలి. రోజూ ఒకే ప్రదేశంలో కూర్చుని ధ్యానించడం వల్ల త్వరగా ధ్యానానికి కనెక్ట్ అవుతారు, అలవాటు పడతారు.
- విజయం ఎప్పుడూ మీ గుప్పెట్లోనే ఉంటుందని నమ్మాలి. భయం దానికదే మాయం అవుతుంది. ఒక్క భయాన్ని జయిస్తే ప్రపంచాన్ని గెలుచుకోవడం అంత కష్టమైందేమీ కాదు.
- భయం, ఆందోళన రావణ కాష్టం వంటిది. మన ఆలోచనలే దానికి ఆజ్యం అతిగా ఆలోచించడం మానెయ్యాలి. ఒక్క ధ్యానం జీవితంలోకి ప్రశాంతతను, విజయాన్ని తెస్తుంది. కనుక రోజులో కొన్ని నిమిషాల ధ్యానాన్ని తప్పనిసరి చేసుకోవాలి.
Also Read: గరుడ పురాణం - ఆలస్యంగా నిద్రలేస్తే అన్ని కష్టాలా? లక్ష్మీదేవి కటాక్షించాలంటే ఏం చేయాలి?