Lung Cancer: స్మోకింగ్ వల్లే లంగ్ క్యాన్సర్ వస్తుందా? వేరే కారణాలూ ఉన్నాయంటోన్న పరిశోధకులు, అవి ఇవే!
lung cancer causes: మన దేశంలో లంగ్ క్యాన్సర్ తో బాధపడే వారిలో చాలా మంది అసలు పొగాకు అలవాటు లేని వారేనట. మరి వారిలో లంగ్ క్యాన్సర్ కారణాలేమిటి?
పొగతాగే అలవాటు వల్ల ఊపిరితీత్తులు పాడైపోతాయి. అది క్రమేనా లంగ్ క్యాన్సర్‌కు దారి తీస్తుంది. ఇందులో వాస్తవం లేకపోలేదు. కానీ, అదొక్కటే కారణం అనుకోవడమే పొరపాటు అని పరిశోధకులు చెబుతున్నారు. ఇంతకీ ఏమిటీ ఆ కారణాలు?
మనదేశంలో లంగ్ క్యాన్సర్‌కు చాలా వరకు జన్యువుల్లో వైవిధ్యం కారణమవుతోందట. దీనితో పాటు వాయు కాలుష్యం మరో ముఖ్యమైన కారణం కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. పొగతాగే అలవాటు లేని వారు కూడా ఈ కారణాలతో ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్నట్టు గుర్తించారు.
ఈ మధ్య కాలంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ పేషెంట్ల సంఖ్య పెరుగుతోందట. 2025 నాటికి ఇది మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. ఆగ్నేయాసియాలో ఈ క్యాన్సర్ ప్రమాద కారకాలను నిర్మూలించేందుకు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాలని శాస్త్రవేత్తలు పిలుపునిచ్చారు.
ఆగ్నేయాసియాలో కనిపించే ఊపిరితిత్తుల క్యాన్సర్ పశ్చిమ దేశాలు, ఆసియాలోని ఇతర ప్రాంతాలకంటే భిన్నమైందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ముఖ్యంగా మన దేశంలో చాలా మంది ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులు జీవితంలో ఎప్పుడూ పొగతాగలేదని అధ్యయనాలు చెబుతున్నాయి. వాయు కాలుష్యం వల్ల పొగతాగే అలవాటు లేనివారు కూడా ఊపిరితీత్తుల క్యాన్సర్‌కు గురవ్వుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రాంతాల వారీగా అధ్యయనాలు జరపడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. వాయుకాలుష్యం మాత్రమే కాదు.. ఇతరాత్ర వాతావరణ పరిస్థితులు కూడా లంగ్ క్యాన్సర్‌కు కారణమవుతోందని తెలుపుతున్నారు.
ఇండియాలోని ఊపిరితిత్తుల క్యాన్సర్ నిష్పత్తిని ఇతర దేశాలతో పోల్చినపుడు 0.51 గా ఉన్నట్టు ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్ వెల్లడించింది. భారత దేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ పాశ్చత్య దేశాల కంటే దాదాపు ఒక పది సంవత్సరాల తక్కువ వయసు వారిలోనే కనిపిస్తోందని సాధారణంగా 54 నుంచి 70 సంవత్సరాల మధ్య నిర్థారణ అవుతోందని లాన్సెట్ వారి క్లినికల్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమైంది.
వాయు నాణ్యతను బట్టి ప్రపంచంలోని అత్యంత కలుషితమైన 40 నగరాల్లో 37 దక్షిణాసియాలోనే ఉన్నాయని వీటిలో నాలుగు అత్యంత కలుషిత నగరాలు భారతదేశంలోనే ఉన్నాయని అధ్యయనంలో పేర్కొన్నారు. చైనా, భారతదేశం, ఇండోనేషియా, ఫిలిప్పిన్స్, థాయ్ లాండ్ ఆసియాలో జాతీయ విపత్తులతో తీవ్రంగా దెబ్బతిన్న దేశాలుగా చెప్పవచ్చు. ఈ దేశాలు 2020లో అత్యధికంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులను నమోదు చేసుకున్నాయి.
పర్యావరణ మార్పులు ఊపిరితిత్తుల క్యాన్సర్ భారాన్ని పెంచుతూనే ఉన్నాయి. ఈ సమస్య ఇప్పటికే ఆసియాలో ముఖ్యమైన ప్రజారోగ్య సమస్యగా పరిణమించిందని నిపుణులు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ లంగ్ క్యాన్సర్‌పై అప్రమత్తంగా ఉండాలి. వాయు కాలుష్యం నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం ఉత్తమం. అలాగే ఊపిరితీత్తుల్లో ఏ చిన్న సమస్య ఉన్నా సరే.. డాక్టర్లను సంప్రదించడం ముఖ్యం.
ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త
ఛాతిలో నొప్పి లేదా అసౌకర్యంగా అనిపించడం, తీవ్రమైన దగ్గు, విపరీతమైన గురక, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతు బొంగురుపోవడం, కఫంలో రక్తం, ఆకలి లేకపోవడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం, మింగడంలో కష్టం, ముఖం వాపు, అలసట వంటివి కనిపించినట్లయితే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. డాక్టర్‌ను సంప్రదించి వెంటనే చికిత్స పొందండి.
Also Read : Nebuliser: నెబ్యులైజర్ నిజంగా ఊపిరితిత్తుల్లో వైరల్ ఇన్ఫెక్షన్‌ను నయం చెయ్యగలదా? దేనికి వాడాలి?