Money Detox : డబ్బు చేతిలో నిలవట్లేదా? కారణాలు ఇవే కావచ్చు.. నెల రోజులు ఇలా మనీ డీటాక్స్ చేసేయండి
Money Detox Tricks : డీటాక్స్ బాడీకే కాదు.. డబ్బుకి కూడా చేయాల్సి ఉంటుంది. అలా చేసినప్పుడు అధిక ఖర్చు, అనవసర ఖర్చు ఎక్కడ జరుగుతుందో తెలుస్తుంది.

- అనవసర ఖర్చులు గుర్తించేందుకు 'మనీ డీటాక్స్' ప్రారంభించాలి.
- అనవసర కొనుగోళ్లు వాయిదా వేసి, కేవలం అవసరాలకే ఖర్చు చేయాలి.
- వస్తువుల కొనుగోళ్లను వాయిదా వేసి, సులభ చెల్లింపులు తగ్గించాలి.
- చిన్న ఖర్చులు ట్రాక్ చేస్తూ, వ్యయ సరళిని గుర్తించాలి.
Money Detox Tricks for One Month : షాపింగ్‌కు చేసేది ఏదో ఒక వస్తువు కొనడానికే కావచ్చు. కానీ డిస్కౌంట్ కనిపించగానే మరో రెండు వస్తువులు కూడా కార్ట్‌లో చేరిపోతాయి. ఫ్రెండ్ కొత్త ఫోన్ కొనగానే మన ఫోన్ కూడా మార్చాలనిపిస్తుంది. ఆన్‌లైన్‌లో ఫ్లాష్ సేల్ కనిపిస్తే అవసరం లేకపోయినా.. ఏదో ఒకటి కొనేస్తుంటాం. ఇలా చిన్న చిన్న ఖర్చులే నెలాఖరుకు పెద్ద మొత్తంగా మారిపోతాయి. ఇలాంటి అనవసర ఖర్చులను గుర్తించేందుకు మనీ డీటాక్స్ ట్రై చేయవచ్చు.
మనీ డీటాక్స్..
నెల రోజుల పాటు అవసరమైన వాటికి మాత్రమే డబ్బు ఖర్చు చేసి.. అవసరం లేని షాపింగ్, కొత్త గ్యాడ్జెట్లు, అదనపు బట్టలు, యాక్సెసరీస్ వంటి కొనుగోళ్లను కొంతకాలం వాయిదా వేయడం. దీనివల్ల డబ్బు ఎంత మిగిలింది అనేదే కాకుండా.. అసలు మనం ఎందుకు ఖర్చు చేస్తున్నామో కూడా అర్థమవుతుంది. అయితే ఈ నెల రోజుల మనీ డీటాక్స్ ఎలా చేయాలి? ఏ పనులు పాటిస్తే అనవసర ఖర్చులను కంట్రోల్ చేయవచ్చో తెలుసుకుందాం.
Also Read : రోజుకు 500 పొదుపు చేస్తే 10 ఏళ్లలో 25 లక్షలు.. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పూర్తి లెక్క ఇదే
ఖర్చులకు హద్దు
మనీ డీటాక్స్ మొదలుపెట్టే ముందు ఏవి కొనాలి.. ఏవి కొనకూడదు అనేది ముందే నిర్ణయించుకోండి. ఇంటి అద్దె, కరెంట్ బిల్లు, కిరాణా సరుకులు, మందులు, ప్రయాణ ఖర్చులు వంటి అవసరమైన వాటిని మాత్రం కొనుక్కోవాలి. కొత్త బట్టలు, షూస్, కాస్మెటిక్స్, గ్యాడ్జెట్లు, అవసరం లేని ఆన్‌లైన్ షాపింగ్‌ను మాత్రం నెల రోజుల పాటు ఆపేయాలి.
అలాగే ఇంట్లో ఉన్న వస్తువులను ఒకసారి చెక్ చేసుకోండి. ఉదాహరణకు కొత్త షర్ట్ కొనాలని అనిపిస్తే.. మీ అల్మారాలో ఇప్పటికే వేసుకోని షర్ట్ ఉందేమో చూడండి. కొత్త కాస్మెటిక్ కొనేముందు ఇంట్లో ఉన్నది ఇంకా మిగిలి ఉందా లేదా చూసుకోవాలి. అలాగే వేరేవాళ్లు పాటించే నో-బై రూల్స్ మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మీ ఆదాయం, కుటుంబ అవసరాలకు తగ్గట్టుగా మీ నియమాలను మీరు సెట్ చేసుకోవాలి.
Also Read : నెల చివరిలో డబ్బులు సరిపోవట్లేదా? అయితే శాలరీ రాగానే(Salary Credit) ఈ టిప్స్ ఫాలో అవ్వండి
ఇప్పుడు వద్దు.. తర్వాత చూద్దాం మంత్ర
ఏదైనా నచ్చిన వస్తువు కనిపించిన వెంటనే కొనేయడం చాలా మందికి అలవాటు. ముఖ్యంగా డిస్కౌంట్ కనిపిస్తే.. ఇప్పుడే కొనకపోతే మళ్లీ ఈ ఆఫర్ రాదు అనిపిస్తుంది. అలాంటి సమయంలో నాకు ఇది కావాలి.. కానీ ఇప్పుడే కొనాల్సిన అవసరం లేదు అని మీకు మీరు చెప్పుకోండి. కొనాలనిపించిన వస్తువు పేరు, ధరను ఒక నోట్‌లో రాసి పెట్టండి.
చిన్న వస్తువుల విషయంలో కనీసం రెండు మూడు రోజులు ఆగి మళ్లీ ఆలోచించండి. ఖరీదైన వస్తువులైతే మరింత సమయం తీసుకోవడం మంచిది. మూడు వారాల తర్వాత కూడా అది నిజంగా అవసరమే అనిపిస్తే అప్పుడు కొనడం గురించి ఆలోచించుకోవాలి.
ఈజీ పేమెంట్స్ తగ్గించండి..
ఆన్‌లైన్ షాపింగ్, యూపీఐ, కార్డులు, వన్-క్లిక్ పేమెంట్స్ వల్ల ఖర్చు చేయడం చాలా సులభమైపోయింది. డబ్బు చేతిలో నుంచి వెళ్తున్నట్టు కూడా అనిపించదు. మనీ డీటాక్స్ సమయంలో షాపింగ్ యాప్స్ నుంచి వచ్చే ఆఫర్లు, డిస్కౌంట్ నోటిఫికేషన్లను ఆఫ్ చేయండి. సరదాగా టైంపాస్ కోసం షాపింగ్ యాప్స్ బ్రౌజ్ చేయడం కూడా తగ్గించండి.
Also Read : శాలరీని 50-30-20 రూల్‌తో ఎలా బ్రేక్ చేయాలి.. సేవింగ్స్ నుంచి ఖర్చులు దాకా ఇలా ప్లాన్ చేసుకోండి
చిన్న ఖర్చులే..
నెలకు జీతం వస్తుంది.. కొంతకాలానికే ఎక్కడ ఖర్చయిందో అర్థం కాకపోవడం చాలామందికి జరుగుతుంది. దీనికి కారణం ఒక్క పెద్ద ఖర్చు కాకపోవచ్చు. రోజూ చేసే చిన్న చిన్న ఖర్చులే పెద్ద మొత్తంగా మారుతుంటాయి. నెల రోజుల పాటు మీ బ్యాంక్ స్టేట్‌మెంట్, యూపీఐ ట్రాన్సాక్షన్స్, కార్డ్ పేమెంట్స్, సబ్‌స్క్రిప్షన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఉపయోగించని ఓటీటీ సబ్‌స్క్రిప్షన్, అవసరం లేని యాప్ మెంబర్‌షిప్, ఒకే రకమైన రెండు సర్వీసులను ఓసారి చెక్ చేసుకోండి. ఇవి మీరు ఎంతవరకు ఉపయోగిస్తున్నారనే దానిని బట్టి తగ్గించుకోండి.
జీతం వచ్చిన వెంటనే ఖర్చులకు సంబంధించిన డబ్బును, పొదుపు లేదా పెట్టుబడికి కేటాయించే డబ్బును వేరు చేయడం కూడా మంచిది. ఇందుకోసం ప్రత్యేక ఖాతాలోకి నిర్ణయించిన మొత్తాన్ని ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్ చేసే విధానాన్ని పాటించవచ్చు.
Also Read : జీతం పెరిగినా డబ్బులు మిగలట్లేదా? అయితే కారణాలు ఇవే, ఇలా సేవింగ్స్ చేసుకోండి
సేవింగ్ అవార్డు
నెల పూర్తయ్యాక మీరు కొనాలని అనుకుని.. కొనకుండా ఆపేసిన వస్తువుల జాబితాను చూడండి. అంటే 2,000 షూస్, 3,000 డ్రెస్, 1,500 హెడ్‌ఫోన్స్ కొనాలని అనుకుని కొనకుండా ఆగిపోయిన మొత్తాన్ని లెక్క వేసుకోండి. ఆ వస్తువు కొనకపోయినా ఆ డబ్బును మరో అనవసరమైన వస్తువుపై ఖర్చు చేసి ఉంటే మీరు నిజంగా పొదుపు చేసినట్లు కాదు. అందుకే నెలాఖరులో మీ బ్యాంక్ బ్యాలెన్స్, ఖర్చులు, పొదుపును చూసి అసలు ఎంత డబ్బు మిగిలిందో.. ఏమి చేయడం వల్ల మిగిలిందో చెక్ చేసుకోండి.
అలాగే మీరు ఏ సందర్భాల్లో ఎక్కువగా ఖర్చు చేస్తున్నారో కూడా తెలుసుకోండి. బోర్ కొట్టినప్పుడు షాపింగ్ చేస్తున్నారా? డిస్కౌంట్ చూసి కొనేస్తున్నారా? ఫ్రెండ్స్ కొనడం చూసి మీకూ కావాలనిపిస్తుందా? ఇలా ఏదైనా కారణం గుర్తిస్తే దాన్ని కంట్రోల్ చేయడం సులభమవుతుంది.
Also Read : డబ్బులు పొదుపు చేయాలనుకుంటే జపనీస్ టెక్నిక్స్ ఫాలో అయిపోండి.. సింపుల్ బట్ ఎఫెక్టివ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























