Salary Budgeting Tips : నెల చివరిలో డబ్బులు సరిపోవట్లేదా? అయితే శాలరీ రాగానే(Salary Credit) ఈ టిప్స్ ఫాలో అవ్వండి
Money Management Tips : నెలాఖరు వచ్చేసరికి చాలామంది దగ్గర డబ్బులు అయిపోతాయి. మీరు కూడా అలాంటివారిలో ఒకరు అయితే శాలరీ రాగానే బడ్జెట్ ఇలా ప్లాన్ చేసుకోండి. నెల చివరిలో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి రాదు.

- జీతం రాగానే సరైన ప్రణాళిక లేకపోవడం ఆర్థిక ఇబ్బందులకు మూలం.
- ముందుగా పొదుపు చేసి, నెలవారీ బిల్లులు వెంటనే చెల్లించడం ముఖ్యం.
- రోజువారీ ఖర్చులకు పరిమితి, UPI లావాదేవీల ట్రాకింగ్ అవసరం.
Money Management Tips to Avoid Month-End Financial Stress : నెల మొదట్లో శాలరీ అకౌంట్లో పడగానే మనసుకు కాస్త హాయిగా ఉంటుంది. కానీ అద్దె, కరెంట్ బిల్లు, EMIలు, పిల్లల స్కూల్ ఖర్చులు, కిరాణా, బయట తినడం, షాపింగ్, ఆన్లైన్ ఆర్డర్లు.. ఇలా ఒక్కొక్కటి చెల్లిస్తూ పోతే నెల మధ్యలోనే బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతుంది. నెల చివరికి ఏదైనా అత్యవసర ఖర్చు వస్తే జీతం రావడానికి ఇంకా ఎన్ని రోజులు ఉందని కౌంట్ చేసుకుంటూ ఉంటారు.
నిజానికి సమస్య జీతం తక్కువగా ఉండటమే కాదు.. జీతం వచ్చిన వెంటనే ఖర్చులకు సరైన ప్లాన్ లేకపోవడం కూడా ప్రధాన కారణం కావచ్చు. అందుకే శాలరీ క్రెడిట్ అయిన రోజే కొన్ని విషయాలను పక్కాగా ప్లాన్ చేసుకుంటే నెల చివర్లో ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చని చెప్తున్నారు ఆర్థిక నిపుణులు.
Also Read : శాలరీని 50-30-20 రూల్‌తో ఎలా బ్రేక్ చేయాలి.. సేవింగ్స్ నుంచి ఖర్చులు దాకా ఇలా ప్లాన్ చేసుకోండి
శాలరీ రాగానే చేయాల్సిన మొదటిపని..
చాలామంది ముందుగా తమ నెల మొత్తం ఖర్చులు చేసి.. చివర్లో ఏమైనా మిగిలితే దానిని సేవ్ చేద్దామని అనుకుంటారు. కానీ ఆ పద్ధతిని ఫాలో అయితే పెద్దగా డబ్బు మిగలదు. అందుకే ముందే సేవింగ్.. తర్వాత ఖర్చులు అనే అలవాటు చేసుకోవడం మంచిది. అంటే జీతం అకౌంట్లో పడిన వెంటనే మీకు సాధ్యమైన మొత్తాన్ని సేవింగ్స్ అకౌంట్‌కు పంపేసుకోండి. అది చిన్న మొత్తం అయినా పర్వాలేదు. స్టార్ట్ చేయడమే ముఖ్యం. అలాగే అది అలవాటుగా మారాలి.
ఖర్చులు ముందే లెక్క పెట్టుకోండి..
నెలలో తప్పకుండా చెల్లించాల్సిన ఖర్చులను ముందుగానే రాసుకోవాలి. బడ్జెట్ ప్లానింగ్‌లో ఇది మరో ప్రధానమైన విషయం. మీకు ఉన్న ఖర్చులు అంటే ఇంటి అద్దె, EMI, కరెంట్, వాటర్, గ్యాస్ బిల్లులు, పిల్లల ఫీజులు, కిరాణా, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, ఫోన్, ఇంటర్నెట్ బిల్లులు, మందులు లేదా ఇతర తప్పనిసరి ఖర్చులు మొత్తం రాసుకోవాలి. ఇది ఎంత అవుతుందో ముందే తెలుసుకుంటే.. మీ దగ్గర ఖర్చు చేయడానికి ఎంత డబ్బు మిగుతుందో తెలుస్తుంది.
Also Read : జీతం పెరిగినా డబ్బులు మిగలట్లేదా? అయితే కారణాలు ఇవే, ఇలా సేవింగ్స్ చేసుకోండి
EMIలు, బిల్లులు
జీతం రాగానే తర్వాత చెల్లిద్దాం అని బిల్లులను వాయిదా వేస్తే చివర్లో అన్నీ ఒకేసారి పడతాయి. లేదా వాటి ఇంట్రెస్ట్ రేట్ పెరిగే అవకాశం ఉంది. అందుకే శాలరీ వచ్చిన వెంటనే అవసరమైన బిల్లులు, EMIలు వంటి తప్పనిసరి చెల్లింపులను ముందుగానే పే మంచిది.
రోజువారీ ఖర్చులకు లిమిట్..
నెల మొత్తం డబ్బు ఒకేసారి చేతిలో ఉందని భావించి ఖర్చు చేస్తే.. మొదటి 10–15 రోజుల్లోనే ఎక్కువ మొత్తం ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మిగిలిన డబ్బును నెలలోని రోజులకు అనుగుణంగా డివైడ్ చేసుకోవాలి. తప్పనిసరి ఖర్చులు, సేవింగ్స్ అన్నీ పక్కన పెట్టిన తర్వాత మీ దగ్గర ఎంత మిగిలితే.. దాన్ని మొత్తం నెలకు ఎలా ఉపయోగించాలో ముందుగానే ప్లాన్ చేసుకోండి. అలా చేస్తే మొదటి వారంలోనే ఎక్కువ ఖర్చు చేసి చివరి వారంలో ఇబ్బంది పడే పరిస్థితి తగ్గుతుంది.
Also Read : డబ్బులు పొదుపు చేయాలనుకుంటే జపనీస్ టెక్నిక్స్ ఫాలో అయిపోండి.. సింపుల్ బట్ ఎఫెక్టివ్
UPI ఖర్చులను ట్రాక్ చేయండి
రోజుకు 100, 200, 300 ఇలా చిన్న చిన్న మొత్తాలు UPI పేమెంట్స్ చేస్తే ఖర్చు పెద్దగా అనిపించదు. కానీ నెల మొత్తం లెక్క వేసుకుంటే ఆ చిన్న ఖర్చులే పెద్దగా మారతాయి. కాబట్టి టీ, కాఫీ, ఫుడ్ డెలివరీ, క్యాబ్, ఆన్లైన్ షాపింగ్ వంటి ఖర్చులను ఒకసారి ట్రాక్ చేసుకోండి. డబ్బు ఎక్కడికి వెళ్తోంది? అనే ప్రశ్నకు సమాధానం తెలిస్తే ఖర్చులు కంట్రోల్ చేసుకోవడం ఈజీ అవుతుంది.
ఆన్లైన్ షాపింగ్
సేల్ కనిపించగానే అవసరం లేకపోయినా కొనడం, కార్ట్‌లో ఉన్న వస్తువులను వెంటనే ఆర్డర్ చేయడం వంటి అలవాట్లు బడ్జెట్‌ను దెబ్బతీస్తాయి. ఏదైనా కొనాలనిపిస్తే వెంటనే ఆర్డర్ చేయకుండా అవి నిజంగా అవసరమా? లేక కేవలం ఇష్టం వల్ల కొనాలనిపిస్తుందా? అని ఆలోచించుకోండి. ఈ ఒక్క అలవాటు చాలా అనవసర ఖర్చులను దూరం చేస్తుంది.
Also Read : AIతో నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.. ఇలా వాడితే డబ్బే డబ్బు
క్రెడిట్ కార్డు వినియోగం..
క్రెడిట్ కార్డులో 50,000 లిమిట్ ఉంటే.. మన దగ్గర 50,000 ఉన్నట్లు కాదు. అది అప్పుగా తీసుకునే అవకాశం మాత్రమే. ప్రతి నెల పూర్తిగా చెల్లించలేని స్థాయిలో క్రెడిట్ కార్డ్ ఖర్చులు చేస్తే వడ్డీ, భారం పెరిగిపోతుంది. అందుకే తప్పని పరిస్థితుల్లో తిరిగి చెల్లించగలిగే మొత్తానికే ఖర్చు చేయడం మంచిది.
ఎమర్జెన్సీ ఫండ్
అనుకోకుండా ఉద్యోగంలో మార్పు రావడం, ఇంట్లో అత్యవసర ఖర్చు రావడం, వాహనం రిపేర్ కావడం వంటి పరిస్థితుల్లో అప్పు చేయకుండా ఉండేందుకు ఎమర్జెన్సీ ఫండ్ ఉండేలా సెట్ చేసుకోండి. మొదట చిన్న మొత్తంతో ప్రారంభించి క్రమంగా పెంచుకోండి. మీ ఆదాయం, కుటుంబ పరిస్థితులకు అనుగుణంగా ఎమర్జెన్సీ ఫండ్ లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం మంచిది.
నెల చివర్లో డబ్బులు ఎందుకు సరిపోలేదో తెలుసుకోవాలంటే.. ఆ నెల ఖర్చులను ఒకసారి చెక్ చేసుకోండి. ఏ ఖర్చు అవసరమైనది.. ఏది తగ్గించుకోవచ్చు.. ఎక్కడ ఎక్కువ డబ్బు ఖర్చైంది.. ఏ సబ్‌స్క్రిప్షన్‌ను ఉపయోగించడం లేదు.. ఇలా నెలకు ఒకసారి లెక్క చూసుకుంటే.. మీకు తెలియకుండానే అనవసర ఖర్చులు బయటపడతాయి. బడ్జెట్ అంటే అన్ని సరదాలను వదులుకోవడం కాదు.. వాటికి ఒక పరిమితి పెట్టుకోవడమని గుర్తించుకుంటే నెల చివరిలో ఇబ్బందులు ఉండవు.
Also Read : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























