Mixed Dal Dosa: మిక్స్‌డ్ పప్పులతో దోశ రెసిపీ, పిల్లలకు ఎంతో బలం
దోశ అంటే నచ్చనిది ఎవరికి? అందులోనూ టేస్టీ దోశలంటే చెవి కోసుకునే వారు ఎంతో మంది.
రోజూ ఒకే రకమైన దోశ తిని బోరు కొట్టింది. కేవలం బియ్యం, మినపప్పుతో చేసిన దోశలే తింటే రుచి ఒకేలా ఉంటుంది. దాని నుంచి అందే పోషకాలు కూడా పరిమితంగానే ఉంటాయి. అన్ని పప్పులను కలిపి దోశ చేసుకుంటే రుచికి రుచి, పైగా బోలెడంత శక్తి కూడా. ఈ మల్టీ దాల్ దోశ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కందిపప్పులోని బలం, పెసరపప్పులోని సుగుణాలు శరీరానికి మేలు చేస్తాయి. అన్ని పప్పులు పొట్టలో చేరితే ఏం కాదా? అనే సందేహం చాలా మందికి వస్తుంది. అలాంటి భయం అవసరం లేదు. సంతోషంగా వీటిని తినవచ్చు. ఈ రుబ్బును ఓసారి రుబ్బుకున్నాక మరుసటి రోజు వరకు ఫ్రిజ్ లో పెట్టుకుని వేసుకోవచ్చు. ఒకరోజు కన్నా ఎక్కువ రోజులు ఉంచితే మాత్రం రుచి మారిపోతుంది. ఈ దోశలు చేయడం కూడా చాలా సులువు. ఎలా చేయాలో ఓసారి చూడండి
కావాల్సిన పదార్థాలు
ఇద్దరికీ సరిపడా దోశెలు కింద చెప్పిన క్వాంటిటీలతో అవుతాయి.
కంది పప్పు - పావు కప్పు
పొట్టు తీయని పెసరపప్పు - పావు కప్పు
పొట్టు తీసిన పెసర పప్పు - పావు కప్పు
మినప పప్పు - పావు కప్పు
బియ్యం - అరకప్పు
పచ్చి శెనగపప్పు - పావు కప్పు
పచ్చి మిర్చి - నాలుగు
ఉప్పు - రుచికి సరిపడా
వెల్లుల్లి రెబ్బలు - నాలుగు
నూనె - దోశెలు పోసేందుకు సరిపడా
తయారీ ఇలా
1. అన్ని పప్పులు, బియ్యాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.
2. పప్పులు, బియ్యాలను దాదాపు నాలుగ్గంటల పాటూ నానబెట్టుకోవాలి.
3. నాలుగ్గంటల తరువాత నీటిని వడకట్టేసి పప్పు, బియ్యం, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
4. ఆ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఉప్పు కలుపుకోవాలి. రెండు నిమిషాల పాటూ బాగా గిలక్కొట్టుకోవాలి.
5. మీకు నచ్చితే కాస్త పసుపు వేసుకుని కలుపుకోవచ్చు. ఇది ఆప్షనల్. పసుపు వేయడం వల్ల మరింత రోగనిరోధక శక్తికి శరీరానికి చేరుతుంది.
6. ఇప్పుడు పెనంపై నూనె వేసి వేడెక్కాక పలుచగా దోశ వేసుకోవాలి.
7. ఈ దోశ రుచి అదిరిపోతుంది. దీన్ని కొబ్బరి చట్నీ లేదా టమాటా చట్నీతో తింటే మామూలుగా ఉండదు. ఓసారి తిని చూడండి. పిల్లలకు ఈ దోశ పెట్టడం వల్ల అన్ని రకాల పప్పులు వారి శరీరంలోకి చేరినట్టు అవుతుంది.