Menstrual Hygiene : పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి అందరికీ కామనేనా? ప్రతి అమ్మాయి తెలుసుకోవాల్సిన విషయాలివే
Menstrual Hygiene Day : పీరియడ్స్ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకుంటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.

Menstrual Health : టీనేజ్ నుంచి మోనోపాజ్ వరకు దాదాపు ప్రతి ఆడపిల్ల ఎదుర్కొనే ప్రధానమార్పు పీరియడ్స్. ప్రతి నెల ఈ పీరియడ్స్ సమయంలో చాలామంది కడుపు నొప్పి, నడుము నొప్పి, క్రాంప్స్ వంటివి తీవ్రమైన స్థాయిలో ఎదుర్కొంటారు. మరికొందరికి ఇంత ఇబ్బంది ఉండకపోవచ్చు. మరికొందరికి దానిని మించి కూడా ఇబ్బంది ఉండొచ్చు.
ఈ పీరియడ్స్ సమయంలో ప్రతి మహిళ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తూ.. అవగాహాన కల్పిస్తూ Menstrual Hygiene Day నిర్వహిస్తున్నారు. కొందరికి ఋతుస్రావంపై సరైన అవగాహన లేక ఎన్నో ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అందుకే ఈ విషయంపై అవగాహన కల్పిస్తూ Menstrual Hygiene Day చేస్తున్నారు. ఈ క్రమంలో పీరియడ్స్ గురించి ప్రతి మహిళ కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలేంటో చూసేద్దాం.
శుభ్రత
పీరియడ్స్ సమయంలో కచ్చితంగా శుభ్రతను పాటించాలి. ఇది ఫాలో అవ్వకపోతే రిప్రొడెక్టివ్ హెల్త్‌పై ప్రభావం చూపుతుంది. బాక్టీరియల్ వాజినోసిస్, యూటీఐ, ఆర్టీఐ వంటి ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఎక్కువరోజులు కొనసాగితే వంధ్యత్వం, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధులు, ఎస్టీఐలు వచ్చే అవకాశం పెరుగుతుంది.
అన్ని నొప్పులు ఒక్కటి కాదు..
పీరియడ్స్ సమయంలో నొప్పి రావడం అనేది అందరూ కామన్ అనుకుంటారు. తేలికపాటి అసౌకర్యం, తిమ్మరి నార్మల్ అయినప్పటికీ తీవ్రమైన నొప్పి వస్తుందంటే మీరు కచ్చితంగా వైద్య సహాయం తీసుకోవాలి. ఎందుకంటే ఎండోమెట్రియోసిస్, ఫైబ్రోసిస్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధులు వంటి అంతర్లీన సమస్యలకు ఇది దారితీస్తుంది.
యోని శుభ్రత..
పీరియడ్స్ సమయంలో తరచుగా నీటితో కడుక్కుంటే సరిపోతుంది. యోని ప్రాంతం శుభ్రమవ్వడానికి నీరు సరిపోతుంది. దానికోసం సబ్బులు, ఇతర వాష్‌లు ఉపయోగించకపోవడమే మంచిది. దీనివల్ల యోని ప్రాంతంలో పీహెచ్ సమతుల్యత దెబ్బతింటుంది. ఇది ఇరిటేషన్, ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.
ప్యాడ్స్, కప్పులు
పీరియడ్స్ సమయంలో చాలామంది ప్యాడ్స్ వినియోగిస్తారు. వీటిని మళ్లీ ఉపయోగించే అవకాశం ఉండదు. కానీ ఈ మధ్యకాలంలో ప్యాడ్స్ వినియోగంపై వస్తోన్న కొన్ని వదంతుల నేపథ్యంలో టాంఫోన్లు, కప్స్‌కి చాలామంది మారుతున్నారు. అయితే ఋతు సమయంలో వినియోగించే కప్పులు మళ్లీ ఉపయోగించే అవకాశముంది. అలా మళ్లీ వినియోగించే కప్పులు, ఇతర వస్తువులు వీలైనంత శుభ్రంగా ఉండేలా చూసుకోండి. లోదుస్తులు కూడా స్కిన్‌కి ఇరిటేషన్ లేనివి ఎంచుకోవాలి. దీనివల్ల అసౌకర్యం తగ్గుతుంది.
ఒత్తిడి
ఒత్తిడి ఋతుక్రమంపై చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. మీరు దీర్ఘకాలికంగా ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నప్పుడు మీ మెదడు ఋతుచక్రాన్ని నియంత్రించే హార్మోన్ ఉత్పత్తిని నెమ్మదింపజేస్తుంది. ఇది హైపోథాలమస్‌కు సంకేతాలు ఇస్తుంది. దీనివల్ల పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, అండోత్సర్గము ఆలస్యం అవుతుంది. దీనివల్ల ఋతుచక్రం తప్పిపోవడానికి దారితీస్తుంది.
పీరియడ్స్ సమయంలో పరిశుభ్రత పాటించకపోతే.. దీర్ఘకాలిక ఆరోగ్య పరిణామాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో హ్యూమన్ పాపిల్లోమావైరస్తో కూడిన ఇన్ఫెక్షన్లు, గర్భాశయ క్యాన్సర్‌కు వచ్చే అవకాశముంది. హైడ్రేటెడ్‌గా ఉండడం చాలా ముఖ్యం. దీనివల్ల శరీరంలోని టాక్సిన్లు బయటకు పంపి.. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. అలాగే రాత్రి అంతా ఒకటే ప్యాడ్ పెట్టుకోవడం మంచిది కాదు. ఇది కూడి చికాకు, ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే పీరియడ్స్ సమయంలో ఇబ్బందులు తగ్గుతాయి.






















