Mahatma Gandhi Birth Anniversary: స్వాతంత్య్ర సమరంలో స్పూర్తి రగిల్చిన గాంధీ సూక్తులు ఇవే, ఇప్పటికీ ఇవి స్పూర్తి మంత్రాలే
Mahatma Gandhi birth Anniversary: జాతి పిత మహాత్మ గాంధీ చెప్పిన మాటలు ఎప్పటికీ మనకు ఆచరణీయమైనవే.
Mahatma Gandhi birth Anniversary: ‘ఇలాంటి ఒక మనిషి భూమిపై నడిచాడంటే భవిష్యత్తు తరాలు నమ్మవేమో’... గాంధీజీ గురించి ప్రముఖ శాస్త్రవేత్త ఐన్ స్టీన్ అన్నమాటలివి. ఒక బక్కపలచటి వ్యక్తి మన దేశంలో బ్రిటన్ సామ్రాజ్య పతనానికి కారణమయ్యాడంటే నిజంగానే ముందు ముందు తరాలు నమ్ముతాయో లేదో. కానీ అదే నిజం... అతని పిలుపే బ్రిటన్ పతనానికి నాంది పలికింది. ఆయన ఇచ్చిన నినాదాలు, స్పూర్తి రగిల్చే మంత్రాలు భారతీయుల్లో స్వతంత్ర కాంక్షను పెంచాయి. ఆయన తన పిడికిలి బిగించి ‘సాధించండి లేదా చావండి’ (డూ ఆర్ డై) అని ఇచ్చిన పిలుపు భారతమాతను బానిస సంకెళ్ల నుంచి తప్పించింది. ఇక క్విట్ ఇండియా నినాదం బ్రిటన్ వారి వెన్నులో వణుకు పుట్టించింది. లక్షలమంది స్వాతంత్య్ర కాంక్షతో కదం తొక్కారు. ‘క్విట్ ఇండియా’ అనేది బ్రిటన్ వారికి ఓ హెచ్చరికే అని చెప్పాలి. ఇలాంటి స్పూర్తి మంత్రాలే కాదు జీవితానికి ఉపయోగపడే ఎన్నో సూక్తులను చెప్పారు గాంధీజీ.
1. ప్రపంచంలో నువ్వు చూడాలనుకుంటున్న మార్పు మొదట నీతోనే మొదలవ్వాలి.
2. మరణానికి భయపడడం అంటే, చిరిగిపోయిన దుస్తులను వదిలేసేందుకు భయపడడం అని అర్థం.
3. దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు, పౌరుల నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి.
4.భారతీయులు తమలో తాము పోట్లాడుకోవడం మానుకున్నప్పుడే మనకు అసలైన స్వాతంత్ర్యం వస్తుంది.
5. అహింసకు మించిన ఆయుధం లేదు.
6. గర్వం మనిషిని ఓటమి వైపు నడిపిస్తుంది.
7. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది.
8. మీలో బలహీనత భయాన్ని పెంచుతుంది. ఆ భయం మీలో మీకే తెలియని అపనమ్మకాన్ని పెంచుతుంది.
9. నన్ను స్తుతించే వారికంటే నన్ను కఠినంగా విమర్శించే వారి వల్లనే నేను అధికంగా మంచి పొందాను
10. విద్య దాచుకోవడం కన్నా అందరికీ పంచడం వల్ల మరింతగా పెరుగుతుంది.
11. కష్టపడి పనిచేయని వ్యక్తికి తిండి తినే హక్కు లేదు.
12. చాలా సమస్యలు మౌనంతో పరిష్కారం అవుతాయి. కానీ మనం మాటలతో ఆ అవకాశాన్ని చేజార్చుకుంటాం.
13. ఆత్మ వంచన, పరనింద చేసేవారు తమ పతనాన్ని తాము కొని తెచ్చుకున్నట్టే.
14. సత్యం భగవంతుడి కన్నా గొప్పది.
15. మీ ఆలోచనలు ఎల్లప్పుడు ఉన్నతంగా ఉండాలి. ఎందుకంటే మీ ఆలోచనలు మీ మాటల్లో ప్రతిబింబిస్తాయి.
16. మేధావులు మాట్లాడుతారు... మూర్ఖులు వాదిస్తారు.
17. అహం వలన ఏర్పడే అంధకారం చీకటి కంటే భయంకరమైనది.
18. నా దగ్గర ప్రేమ తప్ప మరో ఆయుధం లేదు. ప్రపంచంలో స్నేహం చేసుకోవడమే నా గమ్యం.
19. ఎంత గొప్పగా జీవించావో నీ చేతలు చెప్పాలి. ఎంత గొప్పగా మరణించావో ఇతరులు చెప్పాలి.
20. నేటి నీ చేతలు, రేపటి నీ భవిష్యత్తుని నిర్ణయిస్తాయి.
Also read: బ్రెడ్ పై పీనట్ బటర్ పూసుకుని తింటున్నారా? దీని వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటో తెలుసా?
Also read: రోజుకో కప్పు కాఫీతో మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుదల, అతిగా తాగితే ఆ నష్టం తప్పదు