Chronic Hepatitis : దీర్ఘకాలిక హెపటైటిస్ ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. కాలేయాన్ని కాపాడే అలవాట్లు ఇవే
Chronic Hepatitis Care : దీర్ఘకాలిక హెపటైటిస్ ఉంటే కాలేయంపై తీవ్రమైన ప్రభావం ఉంటుంది. అయితే మీరు జీవనశైలిలో చేసే మార్పులు ప్రమాదాన్ని దూరం చేస్తాయంటున్నారు నిపుణులు. అవేంటంటే..

Chronic Hepatitis and Liver Care : దీర్ఘకాలిక హెపటైటిస్ అనేది భవిష్యత్తు గురించి ఆందోళన చెందేలా చేస్తుంది. మళ్లీ ఎప్పటికీ సాధారణ స్థితికి రాకపోవచ్చని బాధపడుతూ ఉంటారు. అయితే నిజం ఏమిటంటే.. సరైన విధానంతో.. రోగ నిర్థారణ తర్వాత కూడా మీరు పూర్తి, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చని చెప్తున్నారు నిపుణులు. వైద్యులు సూచించిన మందులు తీసుకోవడంతో పాటు.. చెకప్స్ ముఖ్యమని చెప్తున్నారు. అంతేకాకుండా రోజువారీ జీవనశైలి ఎంపికలు.. కాలేయాన్ని దెబ్బతినకుండా కాపాడతాయి అంటున్నారు. మరి దీని కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం.
ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే..
శరీరంలో కాలేయం సహజమైన ఫిల్టర్‌లా పని చేస్తుంది. మనం తీసుకునే దాదాపు ప్రతిదాన్ని ప్రాసెస్ చేస్తుంది. కాబట్టి కాలేయాన్ని కాపాడుకోవడానికి.. తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు తీసుకోవడం మంచిది. వేయించిన పదార్థాలు, స్వీట్స్, ప్యాక్ చేసిన స్నాక్స్ తగ్గించాల్సి ఉంటుంది. దీనివల్ల అదనపు కొవ్వు.. కాలేయంపై ఒత్తిడిని తగ్గిస్తుంది. దీర్ఘకాలిక హెపటైటిస్ ఉన్నవారు రెడ్ మీట్ తినడం పూర్తిగా తగ్గించాలి. దానికి బదులు చేపలు, చికెన్ లేదా మొక్కల ఆధారిత వనరులు తీసుకోవడం మంచి ఫలితాలు ఇస్తుంది.
ఆల్కహాల్ తీసుకుంటున్నారా ?
హెపటైటిస్ ఉంది అంటే.. కాలేయం ఇప్పటికే ఒత్తిడికి గురి అవుతుందని అర్థం. అలాంటప్పుడు కొద్దిగా ఆల్కహాల్ తీసుకున్నా.. డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. హెపటైటిస్ నిర్ధారణ తర్వాత ఆల్కహాల్‌ను పూర్తిగా మానేయడం చాలా ముఖ్యమైన దశలలో ఒకటి. ఇది వ్యాధి పురోగతిని నెమ్మదింపజేయడమే కాకుండా... సిర్రోసిస్, ోకాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
యాక్టివ్‌గా ఉండాల్సిందే..
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మొత్తం శక్తి మెరుగుపడుతుంది. బరువును తగ్గడంలో సహాయపడుతుంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది. వారానికి కనీసం ఐదు రోజులు వేగంగా నడవడం, సైక్లింగ్ లేదా యోగా వంటి మితమైన వ్యాయామాలను చేయడానికి ప్రయత్నించండి. రెగ్యులర్‌గా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
మెడిసన్..
హెపటైటిస్‌కి సంబంధించి వైద్యులు సూచించే మందులు తీసుకోవడంతో పాటు.. కొన్ని రకాల మందులు తీసుకునేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఓవర్-ది-కౌంటర్ మందులు, కొన్ని మూలికా సప్లిమెంట్లు కూడా కాలేయాన్ని ఒత్తిడికి గురి చేస్తాయి. నొప్పి నివారిణి లేదా ప్రత్యామ్నాయ నివారణ అయినా ఏదైనా కొత్తది తీసుకునే ముందు వైద్యుడితో చర్చించాలి.
రెగ్యులర్ చెకప్స్
దీర్ఘకాలిక హెపటైటిస్‌తో ఇబ్బంది పడేవారు.. రెగ్యులర్‌గా చెకప్స్ చేయించుకుంటే మంచిది. రక్త పరీక్షలు, స్కానింగ్‌లు కాలేయ పనితీరును ట్రాక్ చేస్తాయి. సమస్యలను ప్రారంభంలో గుర్తించేలా చేస్తాయి. వీటిని మానేస్తే పరిస్థితి విషమించవచ్చు.
మొత్తం ఆరోగ్యానికై..
మధుమేహం, కొలెస్ట్రాల్, రక్తపోటును కంట్రోల్ చేయడం వల్ల కూడా కాలేయం హెల్తీగా ఉంటుంది. మీకు రోగనిరోధక శక్తి లేకపోతే హెపటైటిస్ ఎ, బి కోసం టీకాలు వేయించుకోవడం మంచిది. ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్లు కాలేయానికి మరింత నష్టం కలిగిస్తాయి. మీరు తినేది, మీరు ఎలా ఉంటున్నారు.. వేటికి దూరంగా ఉంటున్నారు.. వంటివాటిలో మార్పులు చేస్తే.. ఎక్కవ కాలం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండగలుగుతారు.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.






















