Diet: మీ బ్లడ్ గ్రూపును బట్టి మీరు ఏమి తినాలో తెలుసుకోండి
డైట్ అందరికీ ఒకటే అనుకుంటాం కానీ బ్లడ్ గ్రూపును బట్టి కూడా ఉంటుంది.
ప్రతి ఒక్కరిది ఒక్కో రక్త వర్గం. సాధారణంగా ఎక్కువమంది O+ , O-, A+ , A-, B+ , B-, AB+, AB- అనే ఈ ఎనిమిదిరకాల రక్త సమూహాలలోనే ఉంటారు. మిగతా రక్త సమూహాలు ఉన్నప్పటికీ అవి చాలా అరుదుగా కనిపిస్తాయి. అనేక అధ్యయనాల్లో రక్త వర్గాలను బట్టి కూడా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని తేలింది. కొన్ని బ్లడ్ గ్రూపులకు చెందిన వారిలో గుండెజబ్బులు త్వరగా వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే మీ బ్లడ్ గ్రూపుని బట్టి కూడా ప్రత్యేకంగా ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా తినడం వల్ల ప్రత్యేకంగా రోగినిరోధక శక్తి పెరుగుతుంది.
1996లో ప్రచురించిన ‘ఈట్ రైట్ ఫర్ యువర్ టైప్’ అనే పుస్తకంలో ప్రకృతి వైద్యుడు డాక్టర్పీటర్ డి'అడమో రక్త వర్గాన్ని బట్టి ఆహారాన్ని తినాలని చెప్పారు. అప్పట్లో ఆ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇలా తినడం వల్ల ఆహారం మరింత ప్రభావవంతంగా జీర్ణమవుతుందని, శరీరానికి అవసరమైన పోషకాలను శోషించుకునేలా చేస్తుందని అందులో రాశారు. ఆయన చెప్పిన ప్రకారం ఏ గ్రూప్ వాళ్లు ఏం తినాలో తెలుసుకోండి.
A పాజిటివ్ లేదా నెగిటివ్
A+ , A- బ్లడ్ గ్రూపుల వారిని టైప్ A బ్లడ్ గ్రూపు వ్యక్తులు అంటారు. వీరు మాంసాహారాన్ని తగ్గించాలి. పండ్లు, కూరగాయలు, బీన్స్, చిక్కుళ్లు, తృణధాన్యాలు అధికంగా ఉండాలి. ఎందుకంటే వీరిలో రోగనిరోధక వ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది. మాంసాహారం ద్వారా శరీరంలో చేరే వైరస్, బ్యాక్టిరియాలను వీరు తట్టుకోలేరు.
B పాజిటివ్ లేదా నెగిటివ్
టైప్ B రక్త వర్గాలు కలిగిన వ్యక్తులు ఆకుపచ్చని కూరగాయలు, తక్కువ మొత్తంలో మాంసాహారం, గుడ్లు,కొవ్వు లేని పాలు తినాలి. మొక్కజొన్నలు, గోధుమలు, టమోటాలు, వేరుశెనగలు, నువ్వులు తినడం తగ్గించాలి. మీరు చికెన్ కు దూరంగా ఉంటే మంచిది.
టైప్ AB
AB+, AB- రక్త వర్గాలున్న వ్యక్తులు సముద్రపు ఆహారాన్ని తినాలి. అలాగే సోయాతో చేసిన పనీర్ అయిన టోఫు, పాలు, పెరుగు, చీజ్, పనీర్, బీన్్, ఆకుకూరలు, ధాన్యాలను తినాలి. మొక్కజొన్న, బీఫ్, చికెన్‌కు దూరంగా ఉండాలి. AB రకం రక్తం ఉన్నవారిలో కడుపులో ఆమ్లాలు తక్కువగా ఉంటాయి. కెఫీన్, ఆల్కహాల్, స్మోకీ మాంసాలను తినకూడదు.
టైప్ O
O+ , O- రక్త వర్గానికి చెందిన వారు అధిక ప్రొటీన్ ఉన్న ఆహారాన్ని తినాలి. ఇందులో చికెన్, లేత గొర్రె మాంసం, గుడ్లు, చేపలు, కూరగాయలు తినాలి. బీన్స్, పాలు, ధాన్యాలు కూడా తినవచ్చు.
ఈ బ్లడ్ గ్రూపుల వారికి ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఉంటే వాటికి తగ్గ ఆహారాన్ని కూడా తీసుకోవాలి. ఉదాహరణకు ఒక వ్యక్తికి మధుమేహం ఉన్నట్లయితే, అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం కొన్ని ఉత్తమ ఆహార విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది.
Also read: పంజాబీ స్లైల్లో చపాతీపై నెయ్యి రాసుకుని తింటున్నారా? ఇది ఆరోగ్యకరమేనా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.