(Source: ECI/ABP News/ABP Majha)
Weight Loss: ఈ రోటీలు రోజుకు రెండు తినండి చాలు, నెలలో అయిదు కిలోల బరువు తగ్గే అవకాశం
గోధుమపిండితో చేసిన చపాతీల కన్నా వేరే రెండు పిండిలతో చేసే రోటీలు బరువు తగ్గేందుకు సహకరిస్తాయి.
కొందరు అన్నం పూర్తిగా మానేసి చపాతీలే తింటారు, ఎలాగైనా బరువు తగ్గాలనే లక్ష్యంతో చేసే పని ఇది. కానీ అంత త్వరగా బరువు తగ్గరు సరికదా పోషకాహార లోపం తలెత్తుతుంది. అలాగే గోధుమపిండిలో గ్లూటెన్ అధికం. రోజూ గ్లూటెన్ తినడం వల్ల బరువు తగ్గడం అటుంచితే ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొందరికి గ్లూటెన్ అలెర్జీ కూడాఉంటుంది. బరువు తగ్గేందుకు గోధుమపిండి కన్నా మరో రెండు రకాల పిండితో చేసే రోటీలు సహకరిస్తాయి. ఈ పిండిలలో గ్లూటెన్ ఉండదు పైగా అధికంగా ఫైబర్, ప్రొటీన్లు ఉంటాయి. ఇవి మీకు బరువును తగ్గించడంలో సహకరిస్తాయి. ఇంతకీ ఆ రెండు పిండి రకాలు ఏవో తెలుసా? రాగి, జొన్న పిండి.
గోధుమ చపాతీలు ఎందుకు వద్దు?
గోధుమ పిండి అందరి శరీరాలకి పడాలని లేదు. ఇవి తిన్న కొందరిలో అలెర్జీ వచ్చే అవకాశం ఉంది. దద్దుర్లు వంటి చర్మ సమస్యలు వస్తాయి. గోధుమలలో ఆక్సలేట్ పుష్కలంగా ఉంటుంది. రోజూ చపాతీలు తినడం వల్ల పిత్తాశయంలో, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు మెల్లగా పెరిగేందుకు కూడా ఇది కారణం అవుతుంది. ఇది ముఖ్యమైన ఖనిజాల శోషణను నిరోధిస్తుంది.
రాగి, జొన్న పిండి ఎలా సమకరిస్తాయి?
రాగి పిండి, జొన్న పిండితో చేసిన రోటీలు తినడం వల్ల బరువు తగ్గడమే కాదు, ఇంకా ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయి. ఈ రెండింటిలో ఫైబర్, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. పోషకాలు కూడా ఎక్కువ. ఆకలిని తగ్గించేటప్పుడు జీవక్రియ రేటును పెంచుతాయి. అందువల్ల ఈ రెండు రోటీలు తినడం వల్ల త్వరగా, ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. ఒక్క జొన్న రోటీలో 12 గ్రాముల ఫైబర్, 22 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. అదనంగా పోషకాలు కూడా అందుతాయి. అలాగే రాగి రొట్టెలో ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ చాలా సమృద్ధిగా ఉంటుంది. 100 గ్రాముల రాగిపిండిలో 13 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
జొన్నరొట్టె ఇలా చేసుకోండి...
పెద్ద గిన్నెలో అరకప్పు జొన్న పిండి కలపాలి. చిటికెడు ఉప్పు వేసి నీళ్లు కలుపుతూ రొట్టె పిండిని తయారుచేయాలి. కాసేపు మూత పెట్టి పక్కన పెట్టాలి. దీన్ని చపాతీలా ఒత్తుకుని పెనంపై రెండువైపు కాల్చుకోవాలి. చేత్తో ఒత్తుకునే చపాతీలా చేసుకుంటారు చాలా మంది. మీకు ఎలా వీలైతే అలా రోటీలా చేసుకోండి. ఈ రోటీని వేడిగా ఉన్నప్పుడే ఏదైనా కర్రీతో కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
రాగి రొట్టె తయారీ...
ఒక గిన్నెలో అరకప్పు రాగిపిండిని వేయాలి. చిటికెడు ఉప్పు, నీళ్లు వేసి చపాతీ పిండిలా కలపుకోవాలి. చిన్న ఉండలుగా చేసుకుని, ఒత్తుకుని కాల్చుకోవాలి. దీన్ని ఏ కూరతో తిన్నా టేస్టుగా ఉంటుంది.
ఈ రెండు రోటీల్లో ఏదో ఒకదాన్ని రోజుకు రెండు చొప్పున తినడం వల్ల చాలా ఉపయోగం ఉంది. బరువు త్వరగా తగ్గుతారు. పోషకాహారలోపం కూడా రాదు. నెలలో అయిదు కిలోల వరకు తగ్గే అవకాశం ఉంది.
Also read: రాఖీ పండుగకు సింపుల్ స్వీట్ రెసిపీలు ఇవిగో, వీటిని చిటికెలో చేయచ్చు
Also read: ఈ చిత్రంలో ఎన్ని పాండాలున్నాయో అర నిమిషంలో చెప్పండి, కేవలం 10 శాతం మందే గుర్తించగలరు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.