Sweets for Diabetes: జొన్న లడ్డూల రెసిపీ,చక్కెర అవసరం లేదు, డయాబెటిస్ రోగులకు ప్రత్యేకం
డయాబెటిస్ రోగులు స్వీటు తినలేరు. తినాలన్న కోరిక పుట్టినా చంపేసుకుంటారు. అలాంటివారి కోసమే ఈ స్వీట్ రెసిపీ.
డయాబెటిస్ వచ్చాక నోరు కట్టేసుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా స్వీట్లు పూర్తిగా తినడం మానేయాలి. చక్కెర, బెల్లం వాడిన స్వీట్లు వారు అధికంగా తినకూడదు. అలాంటి వారికి చక్కెర లేని చక్కని స్వీటు ‘జొన్నలడ్డూలు’. ఇందులో వాడేవన్నీ ఆరోగ్యపరంగా మధుమేహులకు మేలు చేసేవే. ఇంకా చెప్పాలంటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగకుండా చూసే పదార్థాలనే ఇందులో వాడాం.
కావాల్సిన పదార్ధాలు
జొన్నపిండి - అరకప్పు
ఖర్జూరాలు - పది
బాదం తురుము - రెండు టీస్పూన్లు
పిస్తా తురుము - రెండు టీస్పూన్లు
అవిసె గింజలు - అర టీస్పూను
నెయ్యి - రెండు స్పూనులు
నీళ్లు - అరకప్పు
తయారీ ఇలా...
1. స్టవ్ పై కళాయి పెట్టి జొన్న పిండిని వేసి వేయించాలి. కాస్త రంగు మారే వరకు వేయిస్తే చాలు.
2. ఒక గిన్నెలో అరగ్లాసు నీళ్లు వేసి గింజలు తీసేసిన ఖర్జూరాలు వేసి ఉడికించాలి.
3. ఖర్జూరాలు మెత్తగా అయ్యాక ముందుగా వేయించిన జొన్నపిండి వేసి బాగా కలపాలి.
4. బాదం తురుము, పిస్తా తురుము వేసి బాగా కలపాలి. గరిటెతో బాగా కలిపాలి.
5. ఉండలు చుట్టడానికి వీలయ్యేంత చిక్కగా అయ్యే వరకు గరిటెతో కలిపి స్టవ్ కట్టేయాలి.
6. ఇప్పుడు నెయ్యిని చేతులకు రాసుకుని ఉండలు చుట్టుకోవాలి. అంతే జొన్నపిండి లడ్డూలు రెడీ.
జొన్నపిండితో షుగర్ కంట్రోల్ లో...
జొన్నన్నం, జొన్న రొట్టెలు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ వీటిని తినడం చాలా తగ్గించేశారు ప్రజలు. చపాతీతో పోలిస్తే జొన్నరొట్టెలే మంచివి. చపాతీలు తింటే గ్లూటెన్ శరీరంలో చేరుతుంది. జొన్నరొట్టెలో గ్లూటెన్ ఉండదు. కాబట్టి ఎంత తిన్నా ఫర్వలేదు. జొన్న పిండితో చేసిన రెసిపీలు తినడం వల్ల మధుమేహుల్లో డయాబెటిస్ కూడా అదుపులో ఉంటుంది. జొన్నలు ఫ్రీరాడికల్స్ తో పోరాడతాయి. జొన్నలపై ఉండే పొర యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్‌ను కలిగి ఉంటాయి. వీటిల్లో మెగ్నిషియం, కాల్షియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. ఖర్జూరాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. డయాబెటిస్ ఉన్న వారు అధికంగా తినకూడదు కానీ, మితంగా తినవచ్చు. వీటిలో వాడే అవిసె గింజలు, బాదం, పిస్తాలు కూడా శరీరానికి శక్తినిస్తాయి. కాబట్టి కేవలం మధుమేహులే కాదు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వీటిని తినవచ్చు.
Also read: నాటుకోడి కూర ఇలా వండారో, కొంచెం కూడా మిగలదు
Also read: మటన్ బోన్ సూప్, వారానికోసారైనా తినాల్సిందే