చట్నీ పొడి ఇలా చేసి పెట్టుకోండి, నెల రోజుల పాటూ ప్రత్యేకంగా టిఫిన్లకు చట్నీ చేసుకోనక్కర్లేదు
చట్నీ పొడిని చేసి పెట్టుకుంటే ఇనస్టెంట్ చట్నీ రెడీ అయిపోతుంది.
తెలుగువారి ఆహారం చాలా ప్రత్యేకం. వారికి అల్పాహారంగా ఇడ్లీయో, దోశ, వడ, ఊతప్పం... ఇలాంటివి చేసుకుని తింటనే పొట్ట నిండుతుంది. బ్రెడ్ ముక్కలు, జామ్ లాంటివి నచ్చవు. అయితే టిఫిన్లతో పాటూ చట్నీ కూడా ఉండాలి. రోజూ చట్నీ రుబ్బేందుకు బద్దకించేవాళ్లు ఎంతోమంది. అలాంగి వారి కోసమే ఈ చట్నీ పొడి. ఇది చేసుకుని భద్రపరచుకుంటే, రోజూ ఇన్‌స్టంట్‌గా చట్నీ రెడీ అయిపోతుంది. ఈ పొడిలో కాస్త ఉప్పు, నీళ్లు కలుపుకుని, పోపు వేసుకుంటే చాలు. దీని రెసిపీ కూడా చాలా సులువు. ఉదయం పూట పిల్లలకు బాక్సులు పెట్టి స్కూలుకు పంపేవాళ్ళకు ఇది మంచి పద్ధతి.
కావాల్సిన పదార్థాలు
వేరుశెనగ పలుకులు - ఒక కప్పు
పుట్నాల పప్పు - అర కప్పు
ఎండు కొబ్బరి - ఒక ముక్క
మినపగుళ్లు - ఒక టీస్పూను
ఎండు మిర్చి - పది
వెల్లుల్లి రెబ్బలు - ఆరు
కరివేపాకులు - రెండు రెబ్బలు
ఉప్పు - రుచికి సరిపడా
తయారు చేసే విధానం ఇలా...
1. కళాయిలో నూనె లేకుండా వేరుశెనగ పలుకును వేయించాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
2. తరువాత ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేయించి పక్కకి తీసి పెట్టుకోవాలి.
3. అదే కళాయిలో మినప గుళ్లు, ఎండు మిర్చి, కరివేపాకులు, పుట్నాల పప్పు కూడా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించినవన్నీ వేయాలి. చివర్లో వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు కూడా వేసి కలపాలి.
5. వాటిని మెత్తని పొడిలా చేసుకోవాలి.
ఈ పొడిని ఒక సీసాలో వేసి గాలి చొరబడకుండా దాచుకోవాలి. టిఫన్ చేసుకునే ముందు ఎంత కావాలో అంత పరిమాణంలో ఒక గిన్నెలోకి తీసుకుని నీళ్లు పోసుకోవాలి. పోపు వేసుకుని ఇడ్లీ, దోశెలతో తింటే బావుంటుంది.
పోపు కూడా వేయచ్చు...
మీకు రోజూ పోపు వేసుకునే సమయం లేకపోతే.. పోపును కూడా వేసి రెడీగా ఉండేలా ఇన్ స్టెంట్ చట్నీ మిక్స్‌ను తయారు చేసుకోవచ్చు. మీకు నచ్చితే ఇలా కూడా చేయచ్చు.
పైన చెప్పిన విధంగా చట్నీ పొడిని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో కాస్త నూనె వేసి ఆ మొత్తం పొడికి పోపు సరిపోయేలా ఆవాలు, జీలకర్ర, కరివేపాకులు, ఎండు మిర్చి, వెల్లుల్లి వేసి పోపు రెడీ చేసుకోవాలి. ఆ పోపును చట్నీ పొడిలో వేసి బాగా కలుపుకోవాలి. నీరు మాత్రం తగలనివ్వకూడదు. ఇలా చేసుకుంటే రోజూ పోపు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎంచక్కా నీళ్లు కలుపుకుని తినేయడమే. ఉద్యోగం చేసే మహిళలకు ఈ చట్నీ మిక్స్ చాలా ఉపయోగపడుతుంది.
Also read: అయిదు రోజులు ట్రిప్‌కెళ్లాడు, వచ్చాక చూస్తే ఒకేసారి మంకీపాక్స్, కోవిడ్, హెచ్ఐవీ పాజిటివ్