worlds Biggest Banana: ఈ అరటిపండు తింటే మధ్యాహ్నం మీల్స్ తిన్నట్టే, ఒక్క పండుకే పొట్ట నిండిపోతుంది
ప్రపంచంలోనే అతి పెద్ద అరటిపండు ఇది. మనిషి చేయి కంటే లావుగా, పొడవుగా ఉంటుంది.
అరటి పండ్లలో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో ఎర్ర అరటి పండ్లు, చక్కెరకేళి, దేశివాళీ పండ్లు, కొమ్మ అరటి పండ్లు... ఇలా రకరకాలుగా చెప్పుకుంటారు. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద అరటిపండు గురించి మీకు తెలుసా? దీన్ని చూస్తే మీరు ఆశ్చర్య పోవడం ఖాయం. ఇది ఒక మనిషి చేయంతా ఉంటుంది. దీన్ని తింటే మరి భోజనం చేయాల్సిన అవసరం ఉండదు. పొట్ట నిండిపోతుంది. ఒక్కొక్క పండు మూడు కిలోల కంటే ఎక్కువ బరువు తూగుతుంది. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజం. అరటి పండ్లు ఇష్టపడే వారికి ఈ పెద్ద అరటి పండ్లను రుచి చూస్తే వదిలిపెట్టరు.
ఎక్కడ పండుతాయి?
ఈ అరటి పండ్లను ‘జెయింట్ హైలాండ్ అరటి’ అని పిలుస్తారు. ఇవి న్యూ గినియాలోని ఉష్ణ మండల పర్వత అడవుల్లో మాత్రమే పెరుగుతాయి. అక్కడ ఉన్న స్థానికులు దీన్ని ‘మూసా ఇంజన్స్’ అని పిలుస్తారు. ఇండోనేషియాలోని పర్వతాలలో ఈ అరటి చెట్లు కనిపిస్తాయి. వీటి ఆకులు ఒక్కొక్కటి 16 అడుగుల వరకు పెరుగుతాయి. ఆ ఒక్క ఆకును పట్టుకొని మర్రిచెట్టు ఊడలను పట్టుకొని ఊగినట్టు... ఊగుతారు అక్కడ స్థానికులు. అంత దృఢంగా ఉంటాయి ఆకులు.
ఈ అరటి చెట్లు చాలా భారీగా పెరుగుతాయి, వాటి కాండం ఎంతో లావుగా ఉంటుంది. ఒక్కొక్క చెట్టు 36 పండ్లను ఉత్పత్తి చేస్తుంది. అందులో ఒక్కొక్క పండు 30 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. అందుకే ఈ అరటిని అరుదైన జాతిగా గుర్తిస్తారు. ఇండోనేషియాలోని న్యూ గినియా, పపువా న్యూగినియా వంటి దీవుల్లో ఈ అరటి చెట్టు జీవిస్తుంది. ఈ చెట్టుని తీసుకెళ్లి పెంచాలని ఎంతోమంది ప్రయత్నించారు, కానీ అన్ని వాతావరణాల్లో ఈ అరటి చెట్టు పెరగదు. కేవలం ఆ దీవుల్లో మాత్రమే ఇది పెరుగుతుంది.
చూడడానికి రంగు, రూపం అంతా సాధారణ అరటిపండ్ల లాగే ఉంటుంది. బయట పసుపు రంగు తొక్క, లోపల తెల్లని గుజ్జు. కానీ పరిమాణం మాత్రం పెద్దదిగా ఉంటుంది. సాధారణ అరటి చెట్టుతో పోలిస్తే ఈ అరటి చెట్లు సాగుకు రావడానికి ఎక్కువ సమయాన్ని తీసుకుంటాయి.
ఇలాంటి అరటి చెట్లు ఈ భూమిపై ఉన్నాయని తెలిసింది కొన్నాళ్ల క్రితమే. మొదటి సారి 1954లో న్యూ గినియాలో ఈ అరటి జాతిని కనిపెట్టారు. ఎలాంటి సాగు లేకుండా ఈ అరటి చెట్లు తమకు తాము గానే పెరగడం విశేషం. అక్కడున్న స్థానికులు వీటిని తినేందుకు ఇష్టపడతారు. అయితే ఈ అరటిపండు తినడం వల్ల ప్రత్యేకంగా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్నది మాత్రం తెలియదు.
Also read: మన దేశంలో పురాతన గ్రామం ఇది, ఇక్కడ బయట వారు ఏం తాకినా ఫైన్ కట్టాల్సిందే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.