చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా? ‘హ్యూమాన్జీ’ ఏమైంది?
చింపాజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా? ‘హ్యూమాన్జీ’ ఏమైంది?
మీరు ‘ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ సినిమా చూశారా? అందులో మనిషి కంటే చురుగ్గా ఆలోచించే చింపాజీలు చేసే బీభత్సం అంతా ఇంతా కాదు. అది సినిమా కాబట్టి.. అంతా ఎంజాయ్ చేశాం. వాస్తవానికి.. అలాంటి చింపాజీలను తయారు చేయాలనే ప్రయత్నాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. రష్యాకు చెందిన ఓ శాస్త్రవేత్త ఏకంగా మనిషి-చింపాంజీల కలయికతో ‘హ్యూమాన్జీ’ని సృష్టించేందుకు ప్రయత్నించాడు. ఇందుకు అతడు చేసిన అరాచక ప్రయోగాలు గురించి తెలిస్తే ముక్కున వేలు వేసుకుంటారు. ఇంతకీ అతడి ప్రయోగం ఫలించిందా? ‘హ్యూమాన్జీ’ ఈ భూమి మీదకు వచ్చాడా?
ఎందుకు ఈ ప్రయోగం?: మనిషి.. కోతి జాతి నుంచే వచ్చాడని అంటారు. చింపాజీలు లేదా గొరిల్లాలు కూడా మానవ జాతికి దగ్గర సంబంధాలు ఉన్నాయనే భావన ఎప్పటి నుంచే ఉంది. అయితే, అవి మనుషులంత తెలివిగా ఆలోచించలేవు, మాట్లాడలేవనే సంగతి తెలిసిందే. వాటికి బోలెడంత బలం, శక్తి ఉన్నా.. మనిషిలా కష్టపడి పని చేయడం కూడా వాటికి చేతకాదు. కానీ, చింపాంజీలకు తెలివి తేటలు ఉంటే మనిషిలా పనిచేస్తాయని రష్యాలో సోవియెట్ యూనియన్ శకానికి చెందిన ప్రముఖ రాజకీయవేత్త జోసెఫ్ స్టాలిన్ భావించాడు. మనిషి-చింపాజీల కలయికతో పుట్టే ‘హ్యూమాన్జీ’ ద్వారా సూపర్ సోల్జర్ అనే బలమైన సైన్యాన్ని తయారు చేయాలని అనుకున్నాడు. ఈ ప్రయోగాల కోసం అప్పట్లో బోలెడంత డబ్బు కుమ్మరించాడు.
హ్యూమాన్జీ సృష్టి కోసం స్టాలిన్.. ఇలియా ఇవనోవ్ అనే ప్రఖ్యాత శాస్త్రవేత్తను ఎంపిక చేసుకున్నాడు. తమ రెడ్ ఆర్మీ సైనికుల కోసం అజేయ జాతిని సృష్టించాలని ఆదేశించాడు. ఈ విషయం అప్పట్లో బయటి ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తపడ్డారు. అయితే, 1990లో విడుదలైన రహస్య పత్రాల ద్వారా ఈ సంచలన విషయాలు బయటపడ్డాయి. హ్యూమాన్జీలకు మనిషి కంటే ఎక్కువ తెలివి తేటలు లేకుండా చూడాలని తెలిపాడు. రైల్వే ట్రాక్‌ల నిర్మాణం తదితర పనులకు ఉపయోగపడేలా కొత్త ఈ హైబ్రీడ్ (మనిషి-చింపాజీల కలయిక) జాతి ఉండాలని స్టాలిన్ తెలిపాడు.
ప్రభుత్వ నిధులతో ఆఫ్రికాకు ప్రయాణం: ఈ ప్రయోగానికి ముందు శాస్త్రవేత్త ఇవనోవ్ గుర్రాలలో కృత్రిమ గర్భధారణ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఒక మగ గుర్రం స్పెర్మ్ ద్వారా 500 ఆడ గుర్రాలకు గర్బధారణ చేయొచ్చని నిరూపించాడు. ఇందులో భాగంగా అతడు ఆడ జీబ్రాల్లోకి గుర్రాల వీర్యాన్ని ప్రవేశపెట్టి సూపర్ హార్స్ అనే హైబ్రీడ్ జాతిని సృష్టించడానికి ప్రయత్నించాడు. గుర్రాల్లో హైబ్రీడ్ సాధ్యమైనప్పుడు.. మనిషికి దగ్గర జాతైన చింపాజీల ద్వారా హైబ్రీడ్ జాతులను తయారు చేయవచ్చనే ఆలోచన కలిగింది. ఆ సత్తా కేవలం ఇవనోవ్‌కు మాత్రమే ఉందని స్టాలిన్ నమ్మాడు.
ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చిన పదమే ‘హ్యూమన్జీ’. 1924లో ఇవనోవ్ హైబ్రిడైజేషన్ ప్రయోగం కోసం తన ప్రతిపాదనలను సోవియట్ ప్రభుత్వానికి అందించాడు. ఈ ప్రయోగం కోసం చింపాజీలను సేకరించేందుకు ఆఫ్రికా వెళ్లాలని చెప్పాడు. దీంతో ప్రభుత్వం అతడికి నిధులు కేటాయించింది. ప్రయోగం వివాదాస్పదమైనదని తెలిసినా.. పారీస్ పాశ్చర్ ఇన్‌స్టిట్యూట్ ఇవనోవ్‌కు సాయం చేయడానికి ముందుకు రావడం గమనార్హం. కోతులు, చింపాజీల పెంపంకం, పరిశోధనల కోసం పశ్చిమ ఆఫ్రికాలోని గినియాలోని పరిశోధన కేంద్రాన్ని ఉపయోగించుకొనేందుకు ఇవనోవ్‌కు అనుమతి లభించింది.
ఆఫ్రికా మహిళలపై ప్రయోగం..: చింపాంజీల సేకరణ అంత సులభం కాదని తెలుసుకోడానికి ఇవనోవ్‌కు ఎంతో సమయం పట్టలేదు. ఇందుకు అతడు ప్రత్యేకంగా శిక్షణ పొందాల్సి వచ్చింది. ముఖ్యంగా ఆడ చింపాజీలు అతడికి చుక్కలు చూపిస్తున్నాయంటూ అతడు తోటి శాస్త్రవేత్తలకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. మొత్తానికి అతడు మూడు చింపాజీలను సేకరించి.. వాటి మర్మాంగాల్లోకి మనిషి వీర్యాన్ని ఇంజెక్ట్ చేశాడు. కానీ, ఏదీ గర్భం దాల్చలేదు. చివరికి అతడు ఆఫ్రికా మహిళలను బంధించి.. చింపాజీల వీర్యంతో గర్భధారణ చేయాలని ప్రయత్నించాడు. ఈ విషయం తెలుసుకున్న సోవియట్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెంటనే ఈ ప్రాజెక్టుకు మద్దతు ఉపసంహరించుకుంది. ఈ ప్రయోగం యూరోపియన్ పరిశోధకులు, వైద్యులపై ఆఫ్రికన్ల నమ్మకాన్ని దెబ్బతీస్తుందని, అంతర్జాతీయ సంబంధాలను సమస్యాత్మకం చేస్తుందని రష్యన్ శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి తెలియజేశారు.
ప్రయోగం దారి తప్పడంతో..: ప్రాజెక్ట్ నిలిపేయడంతో ఇవనోవ్ సోవియట్ యూనియన్‌కు తిరిగి వెళ్ళాడు. అక్కడ అతను జార్జియాకు సమీపంలో ఉన్న రిపబ్లిక్ అబ్ఖాజియాలో 20 చింపాజీలతో నర్సరీని ఏర్పాటు చేసి ప్రయోగాలు కొనసాగించాడు. ప్రాజెక్ట్‌లో వైఫల్యాలు, ఆఫ్రికా మహిళలపై ప్రయోగాలకు ప్రయత్నించినట్లు ఆధారాలు లభించడంతో ఇవనోవ్‌ను 1930లో అరెస్టు చేశారు. చివరికి ఇవనోవ్ 1932లో కార్మిక శిబిరంలో చనిపోయాడు. కేంబ్రిడ్జ్ యూనివర్శిటీకి చెందిన రష్యన్ చరిత్రకారుడు అలెగ్జాండర్ ఎట్‌కిండ్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. కోతులు మనుషుల నుంచి ఉద్భవించాయని ఇవనోవ్ నిరూపించాలనుకున్నాడని తెలిపారు. మనిషి ఒక రకమైన కోతి జాతి నుంచి పరిణామం చెందుకుంటూ వచ్చాడని, మనిషిని దేవుడు సృష్టించలేదన్న డార్విన్ సిద్దాంతాన్ని చెప్పాలనుకున్నాడని పేర్కొన్నారు. కానీ అలా చేయడం మతానికి వ్యతిరేకమని అప్పట్లో కొందరు భావించారన్నారు. మనిషి కోతి నుంచి రాలేదని, దేవుడి సృష్టి అని నమ్మేవారికి ఇవనోవ్ ప్రయోగాలు నచ్చలేదు. పైగా ఈ ప్రయోగాల కోసం అనేక కోతులను చంపినట్లు తెలుస్తోంది. ఇందుకు 2005లో జార్జీయాలోని నల్ల సముద్రం సమీప పట్టణం సుచుమీలో బయటపడిన కోతి అస్థిపంజరాలే నిదర్శనం.
‘హ్యూమాన్జీ’ నిజంగానే ఉందా?:
1970లో మరోసారి ‘హ్యూమన్జీ’ పదం వినిపించింది. ‘అలివర్’ అనే చింపాజీని అంతా ‘హ్యూమన్జీ’గా భావించారు. అది తప్పకుండా మనిషి-చింపాజీల హైబ్రీడ్ జాతి అని నమ్మారు. ఎందుకంటే.. దానికి మనుషుల తరహాలో బట్టతల ఉంది. కొందరైతే.. చింపాజీలు మనిషిగా మారే క్రమంలో ఈ జాతి ఉద్భవించి ఉంటుందని భావించారు. అంటే, చింపాజీల తర్వాత మనుషుల కంటే ముందు పుట్టిన జాతి అని అనుకున్నారు. కానీ, 1996లో అలివర్‌పై నిర్వహించిన పరీక్షల్లో దానికి 48 క్రోమోజోములు ఉన్నాయని, అది మానవ హైబ్రిడ్ కాదని రుజువైంది. (మనుషులకు 46 క్రోమోజోములు ఉంటాయి). మొత్తానికి చింపాజీలు-మనుషుల కలయికతో ‘హ్యూమాన్జీ’లను సృష్టించడం సాధ్యం కాదని నిరూపితమైంది. కానీ, ఇప్పుడు బోలెడంత టెక్నాలజీ అందుబాటులో ఉంది. కాబట్టి.. హ్యుమాన్జీలను సృష్టించడం పెద్ద కష్టం కాదు. అప్పట్లో ఆ ప్రయోగం విఫలమైంది కాబట్టి సరిపోయింది. అదే జరిగితే ‘ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ తరహాలో మానవ జాతి ప్రమాదంలో పడేదేమో.
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..