News
News
X

Brakes Fail: కారు సడెన్‌గా బ్రేక్ ఫెయిలైతే ఏం చేయాలి? ఇదిగో ఇలా చేస్తే అంతా సేఫ్!

కారు గంటకు 100 కిలో మీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఒక్కసారిగా బ్రేకులు పని చేయడం లేదు. అప్పుడు ఏం చేస్తారు?

FOLLOW US: 

కారు 100 కిమీల వేగంతో హైవేపై దూసుకెళ్తోంది. ఇంతలో దూరంగా పెద్ద గుంత కనిపించింది. దీంతో బ్రేక్ వేసి కారు వేగాన్ని తగ్గించాలని అనుకున్నాడు. కానీ, సాధ్యం కాలేదు. కారణం... బ్రేక్ ఫెయిల్. ఆ సమయంలో ఎంతటి డ్రైవింగ్ నిపుణుడికైనా గుండె జారుతుంది. కంగారులో స్టీరింగ్ పక్కకు తిప్పేయడమో లేదా తోటి ప్రయాణికుల కేకలకు భయపడి పొరాపాట్లు చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి, మీరు తప్పకుండా ఆ సమయంలో కూల్‌గా ఉండాలి. ఆ సమయంలో మీరు భయం లేకుండా చాకచక్యంగా ఉండాలంటే ముందుగా బ్రేక్ ఫెయిల్ సమయంలో ఏం చేయాలనేది తెలుసుకోవాలి.

ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా, ఎవరికైనా రావొచ్చు. కారు బ్రేకులు ఫెయిల్ అయితే ఏం చేయాలో చాలా మందికి తెలియదు. అలా తెలియకే   భయాందోళనకు గురవుతారు. ఎదురొచ్చిన వాహనాలకు డ్యాష్ ఇస్తారు. లేదంటే చెట్టుకో, పుట్టకో తగిలించి ప్రాణాలు కోల్పోతారు. అందుకే  వేగంగా వెళ్తున్న కారు బ్రేకులు ఫెయిల్ అయితే అప్పటికప్పుడు ప్రమాదం నుంచి బయటపడేలా తీసుకోవాల్సిన చర్యలు కొన్ని ఉన్నాయి. 

బ్రేకులు ఫెయిలైనా భయం వద్దు..

చాలా వాహన ప్రమాదాలకు అసలు కారణం భయం. బ్రేకులు ఫెయిల్ అయిన విషయం తెలిసిన వెంటనే జనాలు తీవ్ర భయాందోళనకు గురవుతారు. ఆ సమయంలో చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే ముందుగా భయాన్ని నియంత్రించుకోవాలి. బ్రేకులు ఫెయిల్ అయినా నిశ్చింతగా ఉండి.. కింది స్టెప్పులను ఫాలో అయితే.. గండం నుంచి ఈజీగా గట్టెక్కే అవకాశం ఉంది.

1. పార్కింగ్ లైట్లు ఆన్ చేయండి

పార్కింగ్ లైట్లు (హాజార్డ్స్) అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించబడతాయి. వాహనం పార్కింగ్ లైట్లు ఆన్ చేయడం ద్వారా, వెనుక వాహనంలో వచ్చే వారు మీ వాహనంలో సమస్య ఉందని తెలుసుకుంటారు. మీ వాహనానికి కాస్త దూరంగా వెళ్లడమో? పక్కకు వెళ్లడమో? చేస్తారు.

2. గేర్ మార్చడం

బ్రేక్‌లు పని చేయకపోతే.. వెంటనే  గేర్‌ మార్చండి. టాప్ గేర్  నుంచి నెమ్మదిగా గేర్లు మారుస్తూ ఫస్ట్ గేర్ వరకు తీసుకురావాలి. వెంటనే వేగం తగ్గుతుంది. ఆటో మేటిక్ కారులో అయినా ఇదే పద్దతిని పాటించాల్సి ఉంటుంది. చాలా ఆటో మేటిక్ కార్లలో మాన్యువల్ సెట్టింగ్‌ లు కూడా అందించబడ్డాయి. మీరు గేర్‌లను ఒక్కొక్కటిగా తగ్గిస్తూ ఉండాలి. అంటే కారు 5వ గేర్‌లో ఉన్నట్లయితే, ముందుగా దానిని 4వ స్థానానికి ఆపై 3వ గేర్‌కి తగ్గించాల్సి ఉంటుంది. వెంటనే టాప్ నుంచి ఫస్ట్ గేర్ లేదంటే సెకెండ్ గేర్ లోకి మార్చడం మూలంగా ఇంజిన్ లో సమస్యలు వస్తాయి. అందుకే నెమ్మదిగా వన్ బై వన్ మార్చాలి.   

3. కారును పక్కకు నడపండి

బ్రేక్ ఫెయిల్ అయితే, కారును రోడ్డు మధ్యలో అలాగే నడపకూడదు. వెంటనే దానిని పక్కకు తిప్పాలి. రోడ్డు మధ్యలో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

4. ఎమర్జెన్సీ హ్యాండ్‌బ్రేక్‌ని ఉపయోగించండి

అత్యవసరం అనుకుంటేనే ఎమర్జెన్సీ హ్యాండ్ బ్రేక్ ను వినియోగించాల్సి ఉంటుంది. ముందుగా పైన చెప్పిన పద్దతులను పాటించిన తర్వాత చివరగా హ్యాండ్ బ్రేక్ వాడాల్సి ఉంటుంది. అలా కాకుండా బ్రేకులు ఫెయిల్ అయిన వెంటనే కంగారు పడి.. వేగంగా వెళ్తున్న కారుకు హ్యాండ్‌ బ్రేక్‌  వేస్తే.. రోడ్డు మీదే పల్టీ కొట్టే అవకాశం ఉంటుంది. అలాగే, కారు వేగంగా ఉన్నప్పుడు కంగారు స్టీరింగ్‌ను పక్కకు తిప్పకూడదు. ఒక వేళ ఎదురుగా ఏదైనా వాహనం వస్తుంటే.. దాన్ని తప్పించడానికి మాత్రం కంగారు పడకుండా స్టీరింగ్‌ను నిదానంగా పక్కకు తిప్పి ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. పరిస్థితి అంతవరకు రాకుండా ఉండాలంటే పైన చెప్పిన సూచనలు పాటించండి. ఈ విలువైన సమాచారాన్ని మీ దగ్గరే దాచేసుకోకండి. మీ ఫ్రెండ్, ఫ్యామిలీతో కూడా పంచుకుని.. వారిని కూడా అలర్ట్ చేసి మేలు చేయండి. 

Also Read: యాక్టివా ప్రీమియం ఎడిషన్ వచ్చేసింది, అదిరిపోయే లుక్, కళ్లు చెదిరే ఫీచర్స్ - ధర ఎంతంటే..
Also Read: అద్భుతమైన ఫీచర్లు, అందుబాటు ధరలో సామాన్యుడి కారు- Alto K10 ప్రత్యేకతలు ఇవే!

Published at : 20 Aug 2022 06:39 PM (IST) Tags: Brakes Fail Emergency Handbrake Parking lights