Maruti Suzuki: అద్భుతమైన ఫీచర్లు, అందుబాటు ధరలో సామాన్యుడి కారు- Alto K10 ప్రత్యేకతలు ఇవే!
అదిరిపోయే ఫీచర్లతో మారుతి సుజుకి సరికొత్త కారును తీసుకొచ్చింది. 2022 ఆల్టో K10 పేరుతో నాలుగు వేరియెంట్లను భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ కారు ధర, స్పెసిఫికేషన్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మారుతి సుజుకి కంపెనీ మరో కారును ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. 2022 ఆల్టోK10 పేరుతో పరిచయం చేసింది. 2012లో దేశీయ మార్కెట్లో విడుదల అయిన ఆల్టో కారు.. సుమారు 10 సంవత్సరాల తర్వాత సరికొత్తగా ముస్తాబై వచ్చింది. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.
సరికొత్తగా మరింత విశాలంగా
తాజాగా మార్కెట్లోకి అడుగు పెట్టిన 2022 ఆల్టో K10 కారు గతంలో వచ్చిన సెలెరియో మాదిరిగా ఉంటుంది. గతంలో వచ్చిన ఆల్టోతో పోల్చితే లేటెస్ట్ హంగులను జోడించారు. స్వెప్ట్ బ్యాక్ హెడ్ ల్యాంప్స్, బంపర్లను నూతనంగా రూపొందించారు. ముందు ఫాసియా పెద్ద గ్రిల్ తో వస్తుంది. అయితే అల్లాయ్ వీల్స్ లేవు. క్యాప్స్ తో కూడిన స్టీల్ వీల్స్ మాత్రమే ఉన్నాయి. అటు ఫాగ్ ల్యాంప్స్ కూడా లేవు. బ్యాక్ సైడ్ స్క్వేర్‌షేప్ టెయిల్ ల్యాంప్ క్లస్టర్, రీవ్యాంప్డ్ బంపర్ ను కలిగి ఉంది. 2022 మోడల్ కారుతో పోల్చితే తాజాగా వచ్చిన కారు పొడవు, ఎత్తు కాస్త ఎక్కువగా ఉంది.
ఫీచర్ల విషయానికి వస్తే..
2022 ఆల్టో K10 లేటెస్ట వెర్షన్ కారుకు సంబంధించిన ఫీచర్లలో చాలా మార్పులు ఉన్నాయి. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ను కలిగి ఉంది. పవర్ విండోలు, మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్ తో వచ్చింది. రిమోట్ కీని కలిగి ఉంది. వైర్డ్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే సపోర్టెడ్ 7-ఇంచుల స్మార్ట్ ప్లే స్టూడియో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ను అమర్చారు. ఇక సెక్యూరిటీ ఫీచర్లను పరిశీలిస్తే.. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్‌లున్నాయి. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ సహా పార్కింగ్ సెన్సార్లను కలిగి ఉంది. ఆల్టో K10లోని భద్రతా లక్షణాలు ఆధునిక రక్షణ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి.
ఇంజిన్ ప్రత్యేకతలు..
లేటెస్ట్ 2022 ఆల్టో 1.0 లీటర్ త్రి సిలిండర్ కె- సిరీస్ ఇంజిన్ తో వస్తోంది. 65 బీహెచ్పీ పవర్ తో 89 న్యూటన్ మీటర్ టార్క్ ను అందిస్తుంది. 5 స్పీడ్ మాన్యవల్ గేర్ బాక్స్ తో పాటు ఆటోమెటిక్ గేర్ బాక్సును కూడా అందుబాటులోకి తెచ్చింది. లీటర్ కి 24.9 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.
ఎన్ని వేరియెంట్లలో వచ్చింది? ధర ఎంతంటే?
2022 ఆల్టో K10 కారు LXi, VXi, ZXi, ZXi+ అనే నాలుగు వేరియెంట్లలో అందుబాటులోకి వస్తుంది. రూ 3.99 లక్షల ప్రారంభ ధర నుంచి న్యూ మారుతి సుజుకి అల్టోను సొంతం చేసుకోవచ్చు. ఆయా వేరియెంట్ ను బట్టి ధర రూ. 6 లక్షల వరకు ఉంది. దశాబ్దం క్రితం లాంచ్ అయిన మారుతి ఆల్టోఇప్పటి వరకూ 43 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడుపోయాయి. మారుతి సుజుకి అరేనా అవుట్ లెట్‌ల లో బుకింగ్స్ ఎప్పుడో ప్రారంభం అయ్యాయి. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా బుక్ చేసుకునే అవకాశంఉంది. ఇక గతంలో వచ్చిన రంగులతో పాటు సిజ్లింగ్ రెడ్, స్పీడీ బ్లూ, ఎర్త్ గోల్డ్ రంగుల్లోనూ లభించనుంది.
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?