Sunstroke: హీట్ వేవ్ నుంచి శరీరాన్ని ఇలా రక్షించుకోండి
పొద్దున తొమ్మిది గంటలకే మొహం మాడిపోయే ఎండ వచ్చేస్తుంది. ఇక మధ్యాహ్నం అడుగు బయట పెట్టాలంటే భయపడే పరిస్థితి. హీట్ వేవ్ నుంచి రక్షణ తప్పనిసరి.
రుతుపవనాలు వచ్చినా కూడా భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, ఒడిసా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు వేడిగాలులు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ షాక్(ఐఎండి) తెలిపింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకి రావొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. యూపీలోని బల్లియా ప్రాంతంలో వడగాలుల కారణంగా 50 మందికి పైగా మరణించారు. అంటే దీన్ని బట్టే అర్థమ చేసుకోవాలి వేడి గాలులు ఎంతగా ఉన్నాయో. హీట్ వేవ్ కి గురైన ఆసుపత్రిలో చేరిన రోగులకు ఛాతీ నొప్పు ఉందని వైద్యులు తెలిపారు. అందుకే ఎండ వేడికి బయట తిరగొద్దని హెచ్చరిస్తున్నారు.
వడదెబ్బ లేదా హీట్ స్ట్రోక్ సంకేతాలు
విపరీతమైన వేడి గాలులకు ప్రభావితమైనప్పుడు అలసట, తల తిరగడం, తలనొప్పి, అనారోగ్యంగా అనిపించడం, చెమటలు విపరీతంగా పట్టడం, చేతులు, కాళ్ళు, కడుపులో భరించలేని తిమ్మిరి, హృదయ స్పందన రేటు పెరగడం, దాహంగా అనిపిస్తుంది.
హీట్ వేవ్ సమయంలో ఇవి చేయొద్దు
మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో ఇంట్లోనే ఉండాలి. ఈ సమయంలో శ్రమతో కూడిన కార్యకలాపాలు చేయకూడదు. ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బొనేటెడ్ పానీయాలు తీసుకోవద్దు. ఇవి శరీరాన్ని డీ హైడ్రేట్ చేస్తాయి. అధిక ప్రోటీన్ ఆహారాన్ని కూడా నివారిస్తే మంచిది.
వీటిని తినండి
తగినంత నీరు తాగాలి. దాహంగా అనిపించకపోయినా కూడా నీరు తాగితే మంచిది. లస్సీ, తోరణి(బియ్యం గంజి), నిమ్మరసం, మజ్జిగ మొదలైన ఇంట్లో తయారు చేసిన పానీయాలు తీసుకోవాలి. చల్లని నీటితో స్నానం చేయాలి.
పిల్లలు ఉంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి
వేడిగాలుల సమయంలో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. తగినంత నీరు తాగేలా చేయాలి. నీరు తాగడానికి ఇబ్బందిగా అనిపిస్తే వివిధ రకాల షర్బత్ లు తీసుకోవాలి. కార్బొనేటెడ్ పానీయాలు అసలు ఇవ్వొద్దు. బయట ఆడుకోవడానికి పంపించొద్దు. పార్క్ చేసిన వాహనాల్లో వాళ్ళని విడిచిపెట్టకూడదు. పిల్లల్లో అనారోగ్య సంకేతాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.
వడదెబ్బకి గురైతే
ఒక వేళ వడదెబ్బకి గురైన వ్యక్తి మీ కంట పడితే కనీస ప్రాథమిక చికిత్స చేయడం మంచిది. వాళ్ళని నీడ కింద పడుకోబెట్టాలి. తలపై సాధారణ నీటిని పోసి శరీర ఉష్ణోగ్రత తగ్గించాలి. వాళ్ళ శరీరం చల్లబడిన తర్వాత రీహైడ్రేట్ చేయడానికి ఓఆర్ఎస్ లేదా మజ్జిగ వంటి సాధారణ పానీయాలు ఇవ్వాలి.
ఎవరు ప్రమాదంలో ఉన్నారు?
చల్లటి వాతావరణం నుంచి ఒక్కసారిగా వేడి వాతావర్ణంలోకి వచ్చిన వాళ్ళు త్వరగా హీట్ వేవ్ బారిన పడతారు. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు పనులు వాయిదా వేసుకోవడం మంచిది. నీరు బాగా తాగాలి. ఒక్కసారిగా చల్లటి వాతావరణం నుంచి వేడిలోకి రాకుండా మెల్ల మెల్లగా వేడి వాతావరణాన్ని శరీరానికి అలవాటు చేయాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: ఉసిరి అధికంగా తీసుకుంటే అనారోగ్యాలు రావడం గ్యారంటీ