Iron Deficiency: మీకు ఐరన్ లోపం ఉందో లేదో మీ కళ్ళే చెప్పేస్తాయి
శరీరంలో రక్తం తగిన స్థాయిలో ఉందో లేదో మన కళ్ళే చెప్పేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మన ఇళ్ళల్లో పెద్ద వాళ్ళు కన్ను కిందకి లాగి చూసి అసలు నీ ఒంట్లో రక్తం ఎంత తక్కువగా ఉందో అని అంటారు. అదే విధంగా డాక్టర్స్ కూడా కళ్ళని పరిశీలించి రక్తం సరిగా లేదని చెప్తారు. కళ్ళు చూస్తేనే తెలిసిపోతుందా అంటే కచ్చితంగా తెలుస్తుంది. ఎర్ర రక్త కణాలు(ఆర్‌బీసీ) మానవ శరీరంలో చాలా ముఖ్యమైన కణాలు. ఊపిరితిత్తుల నుంచి మిగతా శరీర అవయవాలకు ఆక్సిజన్ సరఫరాను చెయ్యడంలో ఎర్ర రక్త కణాలు కీలక పాత్ర పోషిస్తాయి. రక్తకణాలు సరిపడినంత లేవంటే మనలో ఐరన్ లోపించింది అనేందుకు సంకేతంగా భావించాలి. శరీరానికి విటమిన్స్, ఖనిజాలు చాలా ప్రాముఖ్యం. ఇవి లోపిస్తే తరచుగా అలసటకి గురి కావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదురవుతాయి. ఐరన్ లోపం వల్ల శరీరంలో తగిన రీతిలో హిమోగ్లోబిన్ లేదని అర్థం. దాని వల్ల రక్త హీనత వంటి సమస్యలు వస్తాయి.
కళ్ళపై ప్రభావం
ఐరన్ లోపం వల్ల ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. దాని వల్ల శారీరక విధులకి ఆటంకం ఏర్పడుతుంది. దీని ప్రభావం చాలా త్వరగా కళ్ళల్లోనే కనిపిస్తుంది. ఐరన్ లోపం వల్ల రక్తం కంటి కణజాలాలకు తగినంత ఆక్సిజన్‌ను చేరవేయకుండా నిరోధిస్తుందని నిపుణులు వెల్లడించారు. తద్వారా కళ్ళల్లో పాలిపోయిన లక్షణాలు త్వరగా కనిపిస్తాయి. అందుకే వైద్యులు ముందుగా కళ్ళని పరిశీలిస్తారు. సాధారణంగా కళ్ళు లేత గులాబీ రంగులో కనిపిస్తాయి. ఐరన్ లోపం ఉంటే కన్ను దిగువ భాగం తెల్లగా కనిపిస్తుంది. అంటే శరీరంలో ఎర్ర రక్త కణాలు సరిగా లేవని అర్థం.
లక్షణాలిలా...
నేషనల్ హెల్త్ లంగ్ అండ్ బ్లడ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం ఐరన్ లోపం వల్ల తేలికపాటి రక్తహీనతతో బాధపడే వాళ్ళు ఎటువంటి లక్షణాలను కలిగి ఉండకపోవచ్చని అంటున్నారు. కానీ అధిక రక్తహీనతతో బాధపడే వాళ్ళులో మాత్రం అలసట, కళ్ళు తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో నొప్పి వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. ఇవే కాకుండా చేతులు, కాళ్ళు చల్లగా మారిపోవడం, చర్మం, గోళ్ళు, నాలుక ఎర్రగా లేకుండా పాలిపోయినట్టు కనిపిస్తాయి.
రక్తహీనత ఎలా తెలుస్తుంది
వైద్యులు రోగనిర్ధారణ పరీక్ష ఎఫ్ బిసి(ఫుల్ బ్లడ్ కౌంట్) ద్వారా తెలుసుకుంటారు. రక్తపరీక్షలో ఎర్ర రక్త కణాల సంఖ్య ఎంత ఉంది, హిమోగ్లోబిన్, ఫెర్రిటిన్ స్థాయిలు ఎంత ఉందనే విషయం తెలుస్తోంది. శరీరంలో ఐరన్ నిల్వ చెయ్యడంలో సహాయపడే ప్రోటీన్ ఫెర్రిటిన్. ఎఫ్ బిసి పరీక్ష ద్వారా ఇవన్నీ తెలుసుకోవచ్చు.
ఐరన్ స్థాయి పెంచే ఆహారాలు
శరీరానికి తగినంత ఐరన్ పొందేందుకు సమతుల్య ఆహారం తీసుకోవాలి. మయో క్లినిక్ ప్రకారం రెడ్ మీట్, సీ ఫుడ్, బీన్స్, బచ్చలికూర వంటి ముదురు ఆకు కూరలు, డ్రైఫ్రూట్స్, బ్రెడ్, పాస్తా వంటి ఐరన్-ఫోర్టిఫైడ్ తృణధాన్యాలు ఆరోగ్యకరమైనవి. ఇవి ఐరన్ అధికంగా లభించేందుకు అవసరమైన ఉత్తమ ఆహార పదార్థాలు.
సప్లిమెంట్స్ రూపంలో
ఐరన్ లోపం తీవ్రతని బట్టి సప్లిమెంట్స్ తీసుకోవాలో వద్దో వైద్యులు నిర్ధారిస్తారు. ఐరన్ స్థాయిలు చాలా తక్కువగా ఉన్నప్పుడే సప్లిమెంట్స్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. ముందుగా ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోమని సిఫార్సు చేస్తారు.