Prawns Recipe: రొయ్యల ఫ్రైడ్ రైస్, ఇంట్లోనే ఇట్టే చేసేయచ్చు
చికెన్ ఫ్రైడ్ రైస్‌లాగే రొయ్యల ఫ్రైడ్ రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది.
చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే చెవి కోసుకునే వారు ఎంతో మంది. అయితే ఎక్కువగా ఈ రెండింటినే వండుకుంటారు ఇంట్లో. నిజానికి ఈ రెండింటికన్నా రొయ్యల ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లోనే దీన్ని వండుకోవడం కూడా చాలా సులువు. ఒక్కసారి చేసుకుని తింటే మీరే మళ్లీ మళ్లీ వండుకుని తింటారు. పిల్లలకు ఇది చాలా నచ్చుతుంది.
కావాల్సిన పదార్థాలు
చిన్న రొయ్యలు - పావుకిలో
వండిన అన్నం - రెండు కప్పులు
మిరియాల పొడి - చిటికెడు
గుడ్డు - ఒకటి
సోయా సాస్ - అర స్పూను
ఉల్లిపాయ - ఒకటి
వెల్లుల్లి - నాలుగు రెబ్బలు
ఫిష్ సాస్ - ఒక స్పూను
నూనె - రెండు స్పూనులు
క్యారెట్ - ఒకటి
పసుపు - చిటికెడు
కారం - ఒక స్పూను
కొత్తిమీర తరుగు - రెండు స్పూనులు
తయారీ ఇలా
1.మీడియం సైజు పచ్చి రొయ్యలు లేదా అంతకన్నా చిన్న రొయ్యల్ని ఎంచుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.
2. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక వెల్లుల్లి రెబ్బలు నిలువుగా కోసి వేయించుకోవాలి.
3. వాటిలో రొయ్యలను వేసి వేయించాలి. రొయ్యల్లోంచి నీరు దిగి అవి ఇంకిపోయేదాకా వేయించాలి.
4. పావు స్పూను పసుపు, కారం వేసి వేయించాలి. రొయ్యలు పూర్తిగా ఉడికిపోవాలి.
5. కోడి గుడ్డు కొట్టి అందులో వేయాలి. గరిటెతో బాగా కలపాలి.
6. నిలువుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కల్ని కలిపి వేయించాలి.
7. వండిన అన్నం, ఫిష్ సాస్, సోయా సాస్, మిరియాల పొడి, ఉప్పు అన్నీ వేసి బాగా కలపాలి.
8. దించే ముందు తరిగిన కొత్తిమీరను చల్లాలి.
రొయ్యల ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్టే, తింటే ఎంత రుచిగా ఉంటుందో.
రొయ్యలతో ఆరోగ్య ప్రయోజనాలు
1. రొయ్యల్లో మన శరీరానికి అవసరం అయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాల వల్ల గుండె ఆరోగ్యం బావుంటుంది.
2. వీటిల్లో ఉండు సెలీనియరం క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది.
3. రొయ్యల్లో జింక్, క్యాల్షియం, ఐరన్, విటమిన్ ఇ, విటమిన్ బి, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా లభిస్తాయి.
4. చర్మ సౌందర్యాన్ని పెంచడంలో కూడా రొయ్యలు ముందుంటాయి. వీటిలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ బి12 చర్మానికి సున్నితమైన నిగారింపును అందజేస్తాయి. 5. రొయ్యలు తింటే బరువు పెరగరు. కారణం వీటిలో చాలా తక్కువ కొవ్వు ఉంటుంది. కాబట్టి పొట్ట నిండుగా తినవచ్చు.
6. రక్తహీనత సమస్య ఉన్న వారు రొయ్యలను తింటే ఇనుము అందుతుంది. దీని వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య కూడా పెరుగుతుంది. చాలా మంది రొయ్యలు వండడం కష్టం అనుకుంటారు. నిజానికి చేపల కన్నా రొయ్యలు వండడమే చాలా సులువు. చికెన్ ముక్కల్లా వీటిని ఎలా కలిపినా ముక్కలు కావు.
Also read: హ్యాపీ మూడ్ కావాలా? అయితే విటమిన్ డి తగ్గకుండా చూసుకోండి