HorseGrams: ఉలవ పొంగనాల రెసిపీ... తింటే ఎన్నో ఆరోగ్యసమస్యలకు చెక్ పెట్టొచ్చు
ఉలవలు చాలా ఆరోగ్యకరమైనవి, కానీ వాటిని తినేవాళ్లు చాలా తగ్గిపోయారు.
ఎక్కడో గ్రామాల్లో తప్ప ఉలవలతో చేసిన వంటకాలు తినడం దాదాపు మానేశారు. ఈతరం ఇల్లాళ్లకు వాటితో ఏం వండాలో తెలియకపోవడమే ప్రధానకారణం. ఉలవచారు అందరికీ నచ్చాలని లేదు. దీంతో ఉలవలు కాలగర్భంలో కలిసిపోయేలా ఉన్నాయి. కొందామన్నా కూడా సాధారన దుకాణాలలో దొరకడం లేదు కూడా. ఉలవలు మనకు చేసే మేలు తెలుసుకుంటే వాటిని కచ్చితంగా మెనూలో చేర్చుకుంటారు.
1. ఉలవల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాల్షియం, ఫైబర్, ఫాస్పరస్‌లు కూడా లభిస్తాయి. శరీరానికి ఇవన్నీ అవసరమే. ఐరన్ వల్ల ఎర్రరక్తకణాల ఉత్పత్తి బావుంటుంది. రక్త హీనత దరిచేరదు.
2. ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక మలబధ్ధకం సమస్య పోతుంది.
3. వీటిలో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల బరువు కూడా తగ్గుతారు.
4. ఉలవల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. పిల్లలకు వారానికి రెండు మూడు సార్లయిన ఉలవలు పెట్టడం చాలా అవసరం. వీటిలో ఆకలిని పెంచే గుణం కూడా ఉంది.
5. లైంగిక సామర్ధ్యాన్ని పెంచే శక్తి దీనికుంది. వయాగ్రా మందులు వాడే బదులు ఉలవలు తింటే మంచి ఫలితం ఉంటుంది. ఈ విషయంపై చాలా అధ్యయనాలు కూడా జరిగాయి.
6. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో కూడా ఇది ముందుంటుంది.
7. బాలింతలకు ఉలవలూ మరీ మేలుచేస్తాయి. పాలు చక్కగా పడతాయి.
8. బరువు తగ్గాలనుకునేవారు ఉలవలను వేయించి మెత్తగా పిండి చేసుకోవాలి. ఆ పిండిని డబ్బాలో వేసుకుని దాచుకోవాలి. ప్రతి రోజు పరగడుపున గ్లాసు నీళ్లలో రెండు చెంచాలు వేసుకుని తాగితే కొన్ని రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది.
ఉలవచారు తినడం ఇష్టం లేని వాళ్లు ఉలవ పొంగనాలు ప్రయత్నించచ్చు. ఇవి రుచికి, చూడటానికి స్నాక్స్ లా ఉంటాయి కనుక పిల్లలు కూడా తినేస్తారు.
కావాల్సిన పదార్థాలు
ఉలవలు - ఒక కప్పు
ఉల్లి పాయ - ఒకటి
పచ్చిమిర్చి - రెండు
కరివేపాకు - గుప్పెడు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - సరిపడినంత
జీలకర్ర -ఒక స్పూను
ఇలా తయారీ
ఉలవల్ని రాత్రంతా నానబెట్టాలి. ఉదయం వాటిని శుభ్రం చేసి మెత్తగా రుబ్బుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కాస్త నూనె వేసి వేడిచేయాలి. అందులో పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసి వేయించాలి. కొంచెం వేగాక వాటిని రుబ్బులో కలుపుకోవాలి. ఉల్లిపాయ తరుగును రుబ్బులో వేసి బాగా కలపాలి. ఇప్పుడు గుంటపొంగనాలు వేసే కళాయిలో కాస్త ఆయిల్ రాసి రుబ్బును వేసుకోవాలి. ఉలవల గుండపొంగనాలను టమాటా పచ్చడితో తింటే భలే టేస్టుగా ఉంటుంది.