HIV Emergency Treatment : హెచ్ఐవీ వస్తుందని డౌట్ ఉందా? 72 గంటల్లో ఈ చికిత్స తీసుకుంటే ఇన్ఫెక్షన్‌ను అడ్డుకోవచ్చా? PEP అంటే ఏమిటి?
HIV Risk : HIV సోకే ప్రమాదం ఉందని అనుమానం ఉందా? అయితే సమయాన్ని వృథా చేయకుండా వైద్యుల సూచనలతో 72 గంటల్లోపే PEP చికిత్స ప్రారంభించాలి. ఈ చికిత్స ఎవరికి, ఎందుకు అవసరమో తెలుసుకుందాం.

- క్రమం తప్పకుండా వాడితే, వైరస్ సోకే ప్రమాదం తగ్గుతుంది.
HIV Infection 72 Hour PEP Window Treatment : హెచ్‌ఐవీ సోకే ప్రమాదం ఉందని అనుమానం వచ్చినప్పుడు చాలామంది భయపడిపోతారు. టెస్ట్ చేయించుకోవాలా? వద్దా? వైరస్ సోకకుండా ముందుగానే అడ్డుకోవచ్చా? అని ఆందోళన చెందుతారు. అయితే అలాంటి పరిస్థితుల్లో ఉపయోగపడే అత్యవసర నివారణ చికిత్స ఒకటి ఉందని వైద్యులు చెప్తున్నారు. అదే PEP. అంటే Post Exposure Prophylaxis. హెచ్ఐవీ సోకే అవకాశం ఉన్న సంఘటన తర్వాత 72 గంటల్లోపు ఈ చికిత్స ప్రారంభిస్తే.. వైరస్ శరీరంలో ఇన్ఫెక్షన్‌ను స్థాపించకుండా అడ్డుకునే అవకాశం ఉంటుంది.
హైదరాబాద్లోని యశోద హాస్పిటల్స్‌లో ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కన్సల్టెంట్‌గా చేస్తోన్న డాక్టర్ మోనాలిసా సాహు PEP చికిత్స గురించి ఎన్నో ఆసక్తికరమైన, అత్యవసరమైన విషయాలు తెలిపారు. ఈ చికిత్స ఎవరికి అవసరం? ఎలా పనిచేస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ మోనాలిసా మాటల్లోనే తెలుసుకుందాం.
Also Read : దోమ కుట్టినా, కౌగిలించుకున్నా, ఒకే గ్లాసులో నీళ్లు తాగినా HIV వస్తాదా? వీటిలో అపోహలు ఏవి? నిజమెంత?
PEP ట్రీట్మెంట్..
PEP అంటే పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్. HIV వైరస్‌కు గురయ్యే అవకాశం ఉన్న తర్వాత ఇన్ఫెక్షన్ రాకుండా నివారించేందుకు ఇచ్చే అత్యవసర చికిత్స ఇదేనని డాక్టర్ మోనాలిసా తెలిపారు. ఈ చికిత్సలో భాగంగా వ్యక్తి యాంటీ రెట్రోవైరల్ మందుల కలయికను వరుసగా 28 రోజుల పాటు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
అయితే ఈ చికిత్సను సొంతంగా ప్రారంభించకూడదని.. HIV సోకే ప్రమాదం ఉందా లేదా అనే విషయాన్ని వైద్యులు పరిశీలించి.. అవసరమైతేనే PEP సూచిస్తారని వెల్లడించారు. ముఖ్యంగా ఎక్స్‌పోజర్ జరిగిన 72 గంటల్లోపు చికిత్స ప్రారంభించడం చాలా ముఖ్యం. ఎంత త్వరగా మొదలుపెడితే అంత మంచిదని తెలిపారు.
Also Read : HIV ఉన్నవారికి వయసు పెరిగే కొద్దీ ఈ ఐదు ఆరోగ్య సమస్యల ముప్పు తప్పదంటోన్న వైద్యులు.. జాగ్రత్త
PEP చికిత్స ఎప్పుడు అవసరమంటే..
కొన్ని పరిస్థితుల్లో HIV వైరస్ శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు వైద్యులు దీనిని సిఫార్సు చేస్తారని డాక్టర్ తెలిపారు. కండోమ్ లేకుండా HIV ఉన్న వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకున్నప్పుడు, కండోమ్ చిరిగిపోయినప్పుడు, వైరస్ సోకిన వ్యక్తి ఇంజెక్షన్ ఉపయోగించినప్పుడు, లైంగిక దాడి జరిగిన సమయంలో హెచ్ఐవీ ఎక్స్‌పోజర్ ప్రమాదాన్ని అంచనా వేసి వీలైనంత త్వరగా PEP చికిత్స ప్రారంభిస్తారు.
HIV ఉన్న రోగికి ఉపయోగించిన సూది ప్రమాదవశాత్తు వైద్యసిబ్బందికి గుచ్చుకున్నా లేదా రక్తం ద్వారా వైరస్ సోకే అవకాశం ఉన్నా వెంటనే వైద్య సహాయం తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్ మోనాలిసా తెలిపారు. అయితే ఎక్స్‌పోజర్ స్వభావం, వైరస్ ఉన్న ద్రవాలతో సంబంధం ఏర్పడిందా లేదా వంటి అంశాలను వైద్యులు పరిశీలించిన PEP అవసరాన్ని నిర్ణయిస్తారు.
Also Read : హెచ్ఐవీ నివారణకు 8 వారాలకు ఒకసారి ఇంజెక్షన్.. ఇకపై రోజూ మాత్రలు వేసుకోనవసరం లేదట
72 గంటల్లోపే చికిత్స ప్రారంభించాలా?
హెచ్ఐవీ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కణాల్లోకి వెళ్లి తన సంఖ్యను పెంచుకోవడం ప్రారంభిస్తుంది. ఈ ప్రక్రియ ఇన్ఫెక్షన్ స్థిరపడటానికి దారితీయవచ్చు. PEP మందులు వైరస్ ప్రతిరూపాలు తయారవకుండా అడ్డుకోవడంలో సహాయపడతాయి.
PEP అనేది HIV వైరస్‌కు గురయ్యే అవకాశం ఉన్న తర్వాత ఇన్ఫెక్షన్ రాకుండా నివారించేందుకు ఇచ్చే అత్యవసర చికిత్స. ఇందులో యాంటీ రెట్రోవైరల్ మందులను 28 రోజుల పాటు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చికిత్సను ఎక్స్‌పోజర్ జరిగిన 72 గంటల్లోపు ప్రారంభించడం చాలా ముఖ్యం. ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఆలస్యం అయ్యే కొద్దీ చికిత్స ప్రభావం తగ్గుతుంది. 72 గంటలు దాటిన తర్వాత సాధారణంగా PEP సిఫార్సు చేయరు.
72 గంటలు దాటేస్తే.. వెంటనే వైద్యులను సంప్రదించి తదుపరి పరీక్షలు, జాగ్రత్తల గురించి తెలుసుకోవాలి. అంతేకానీ హెచ్ఐవీ లక్షణాలు కనిపించే వరకు వేచి ఉండకూడదు.
Also Read : కండోమ్స్ మగవారి వాడితే మంచిదా? ఆడవాళ్లు ఉపయోగించాలా? ఏది ఎక్కువ సురక్షితం?
PEP చికిత్స ఎంతవరకు ఎఫెక్టివ్..
హెచ్ఐవీ ఎక్స్‌పోజర్ జరిగిన వెంటనే PEP చికిత్స ప్రారంభించి.. వైద్యులు సూచించిన మందులను 28 రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. అయితే ఇది 100 శాతం రక్షణ కల్పిస్తుందని చెప్పలేము.
మందులను ప్రతిరోజూ నిర్ణీత సమయంలో తీసుకోవాలి. మధ్యలో డోసులు మిస్ చేయకూడదు. వైద్యుల సలహా లేకుండా చికిత్సను ఆపకూడదు. చికిత్స పూర్తయిన తర్వాత కూడా వైద్యులు సూచించిన సమయాల్లో HIV పరీక్షలు చేయించుకోవాలి. అవసరమైన మెడికల్ ఫాలోఅప్‌ను కొనసాగించాలి.
Also Read : ఎయిడ్స్(HIV) లాగే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు క్యాన్సర్ వస్తుందా? నిపుణులు ఏమంటున్నారు?
PEP సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
PEP చికిత్సలో ఉపయోగించే యాంటీ రెట్రోవైరల్ మందుల వల్ల కొందరిలో స్వల్ప సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. వికారం లేదా వాంతులు రావడం, విరేచనాలు కావడం, తలనొప్పి రావడం, అలసటగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని చూసి మందులను ఆపకూడదు. సమస్య తీవ్రంగా ఉన్నా.. రోజువారీ పనులకు ఇబ్బంది కలిగించినా వైద్యులను సంప్రదించాలి.
కాబట్టి హెచ్ఐవీ సోకుతుందనే అనుమానం వచ్చినప్పుడు భయంతో సమయం వృథా చేయకుండా.. 72 గంటల గడువు ముగిసే వరకు వేచి చూడకండి. వెంటనే సమీపంలోని HIV చికిత్స అందించే ఆసుపత్రి లేదా వైద్య నిపుణుడిని సంప్రదించండి. సకాలంలో చికిత్స ప్రారంభించడం ఎంతో ముఖ్యం.
Also Read : కేవలం శృంగారం వల్లనే కాదు.. ఈ తప్పుల వల్ల కూడా HIV, AIDS వస్తుంది, జాగ్రత్త
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























