Ayurvedam: మానసిక ఆందోళనను తగ్గించే ఉత్తమ ఆయుర్వేద ఔషధాలు ఇవిగో
మానసిక ఆందోళన బాధపడే వారికి ఆయుర్వేదం ఉత్తమ ఔషధాలను సూచిస్తోంది.
యాంగ్జయిటీ... ఇదే తెలుగులో ఆందోళన. ఏం జరుగుతుందోనని కంగారు, పొట్టలో గాభరా, గుండెలో దడ... యాంగ్జయిటీ ఇలాగే మొదలై ముదిరిపోయాక మనిషిని నిద్రపోనివ్వదు, తిననివ్వదు. దీని బారిన పడిన వారు బయటికి సాధారణంగా కనిపిస్తున్నప్పటకీ లోపల్లోపల తీవ్ర ఒత్తిడికి గురవుతారు. అలా వదిలేస్తే ఇతర అనారోగ్యాల బారిన త్వరగా పడతారు. కొంతమంది డిప్రెషన్ బారిన పడి ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. అందుకే యాంగ్జయిటీని చిన్న సమస్యగా తీసి పడేయకూడదు. అల్లోపతి మందులు వాడడం ఇష్టం లేని వారు ఆ సమస్యకు ఆయుర్వేదం మందులు వాడవచ్చు. ఇవి వెంటనే ప్రభావం చూపకపోయినా దీర్ఘకాలంలో మంచి ప్రభావమే చూపిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం ఆందోళన సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు ఈ మందులను వాడితే మంచిది.
ఇవి ఉత్తమం...
అశ్వగంధకు ఆయుర్వేదంలో ఉత్తమ స్థానం ఉంది. ఆందోళనకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. అశ్వగంధ పొడిని పాలలో లేదా స్పూను నెయ్యి, తేనే, లేదా చక్కెర వంటి వాటితో కలుపుకుని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అశ్వగంధను పావు స్పూను నుంచి అరస్పూను వరకు రోజుకు తినవచ్చు. అలాగే బ్రాహ్మి కూడా బాగా పనిచేస్తుంది. ఇది ఒత్తిడి కలిగించే హార్మోనును తగ్గిస్తుంది. మెదడకు చురుకుదనాన్ని అందిస్తుంది.పిల్లలకు బ్రాహ్మిన పెట్టడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వారిలో ఏకాగ్రత పెరుగుతుంది. ఇవే కాదు ఉసిరి, మండూక పర్ణి, యష్టి మధు, జటామంసి వంటి మూలికలు కూడా ఆందోళనను తగ్గించి మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. ఈ మందుల వల్ల నిద్రలేమి సమస్యలు కూడా తగ్గుతాయి.
యాంగ్జయిటీతో బాధపడుతున్న వారు తలకు ఎప్పటికప్పుడు నూనెను మర్ధనా చేసుకోవాలి. పొడిగా వదిలేయకూడదు. లేనిపోని ఆలోచనలు రాకుండా ధ్యానం చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఆయుర్వేదం మందులు స్వీకరిస్తూనే ధ్యానం చేయాలి.
ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. మానసిక ఆందోళనతో బాధపడుతున్న వారు స్పైసీ ఆహారం జోలికి పోకూడదు. సాత్వికాహారాన్ని స్వీకరించాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. ఆకుకూరలు అధికంగా తినాలి. అన్నింట్లోనూ కారం తగ్గించాలి. ఉప్పు, కారం అధికంగా వేసుకుని తినడం వల్ల యాంగ్జయిటీ లక్షణాలు ఇంకా పెరుగుతాయి. ఆయుర్వేదం మందులు వాడడం వల్ల మనసు, శరీరం రెండూ ప్రశాంతంగా ఉంటాయి. ఈ మందులు రెండింటిపైనా ప్రభావం చూపిస్తాయి.
Also read: సమంతకు వచ్చిన ఆ వ్యాధి అంత భయంకరమైనదా? ఇది వచ్చాక ఎన్నాళ్లు బతికే అవకాశం ఉంది?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.