SriramaNavami 2022: శ్రీరామనవమికి పానకం, వడపప్పు, వేసవి తాపానికి చెక్ పెట్టే సూపర్‌ఫుడ్స్ ఇవి
శ్రీరామనవమి రానే వచ్చింది. ఆ శ్రీరాముడి కోసం పానకం, వడపప్పు సిద్ధం చేశారా? వాటి వల్లే కలిగే ఆరోగ్య లాభాలు ఎన్నో.
![SriramaNavami 2022: శ్రీరామనవమికి పానకం, వడపప్పు, వేసవి తాపానికి చెక్ పెట్టే సూపర్‌ఫుడ్స్ ఇవి Health benefits of Paanakam, Vadapappu in Sri Ramanavami SriramaNavami 2022: శ్రీరామనవమికి పానకం, వడపప్పు, వేసవి తాపానికి చెక్ పెట్టే సూపర్‌ఫుడ్స్ ఇవి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/10/45486ea6dac7ef5488d32390952c5e2f_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
శ్రీరామనవమి రోజున రాముడికి ఇష్టమైన నైవేద్యం పానకం, వడపప్పు. వీటిని కచ్చితంగా భక్తులు సేవిస్తారు. శ్రీరామనవమి వసంతకాలంలో వచ్చే పండుగ. వేసవి కూడా మొదలయ్యే కాలం ఇది. వేసవిలో సీజనల్ వ్యాధులెన్నో దాడి చేసే అవకాశం ఉంది. అలాగే వేసవితాపం వల్ల కూడా వడదెబ్బ వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకునే నైవేద్యాలను కూడా పూర్వం పెద్దలు నిర్ణయించినట్టు కనిపిస్తుంది. వేసవిలో పానకం, వడపప్పు తినడం వల్ల ఎన్నో ఆరోగ్యలాభాలు ఉన్నాయి.
పానకంతో లాభాలు
భగవంతుడికి పెట్టే నైవేద్యాలన్ని ఆయా కాలాలపై ఆధారపడి నిర్ణయించినవే. అలాగే వేసవిలో ఆరంభంలో వచ్చే శ్రీరామనవమికి పానకం, వడపప్పు, చలిమిడి చేస్తారు. పానకంలో బెల్లం, నీళ్లు, మిరియాలు, యాలకులు వినియోగిస్తారు. పానకం తాగితే ఎంతో చలువ చేస్తుంది. మిరియాలు, యాలకులు గొంతు ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. పానకం పొట్టలోని ఇన్ఫెక్షన్లను కూడా తగ్గిస్తుంది. ఇందులో వాడే బెల్లం వల్ల శరీరానికి తగినంత ఇనుము అందుతుంది. కేవలం శ్రీరామనవమి నాడే కాదు ఎప్పుడైనా దీన్ని తయారుచేసుకుని తాగితే ఆరోగ్యానికి మంచిది. బెల్లం రక్తహీనత బారిన పడకుండా కాపాడుతుంది. మహిళలకు పానకం ఇంకా మేలు చేస్తుంది. నెలసరి సమయంలో వచ్చే సమస్యలకు పానకంతో చెక్ పెట్టచ్చు. పానకం తాగడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా శరీరానికి అందుతాయి.
చలువ వడపప్పు
వడపప్పును పెసరపప్పుతో తయారుచేస్తారు. వేసవిలో పెసరపప్పు తినడం చాలా అవసరం. ఇది శరీరానికి చలువ చేస్తుంది. వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది.బరువు తగ్గేందుకు ఈ పప్పు చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి ఇవి చాలా అవసరం. మధుమేహులకు కూడా పెసరపప్పు చాలా మంచిది. వేసవిలో పెసరపప్పు తినడం వల్ల చాలా శరీరానికి విటమిన్ ఎ, బి, సి, ఇ వంటి పోషకాలు అందుతాయి. ప్రొటీన్, ఫైబర్ వంటివి శరీరంలోకి చేరుతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయులు కూడా తగ్గుతాయి.
బెల్లం, వరిపిండితో చేసే చలిమిడి కూడా చాలా మంచిది. ఇది కూడా చలువ చేసేదే. బెల్లం ఉంది కాబట్టి అనేక ఆరోగ్యప్రయోజనాలు అందుతాయి. కానీ చలిమిడిని చాలా మంది పంచదారతో చేస్తారు. పంచదారతో చేసే చలిమిడి వల్ల లాభాల తక్కువ. పైగా ప్రాసెస్ చేసిన పంచదార వల్ల ఇతర సమస్యలు కూడా రావచ్చు.
Also read: ఏప్రిల్‌లో పుట్టినవారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, ఇదిగో ఇలా
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)