గంగా పుష్కరాలకు వెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
రద్దీగా ఉండే ఈ పుష్కర ఘాట్లలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం. పుష్కర స్నానానికి వెళ్లాలని అనుకునే వారు ముందుగా ఏర్పాట్లు చేసుకోవడం చాలా అవసరం.
ఈ ఏడాది గంగా నది పుష్కరాలు జరుగుతున్నాయి. గంగానది ప్రవహించే ప్రతి చోటా పుష్కరాల ఏర్పాట్లు చేశారు. గంగోత్రి, రుషికేశ్, హరిద్వార్, వారణాసి, ప్రయాగరాజ్ ఇలా అన్ని క్షేత్రాలలోనూ ఈ పుష్కరోత్సవాలు జరుగుతాయి. కానీ చాలా మంది కాశీ వెళ్లడానికే మొగ్గుచూపుతారు. ఇక్కడి విశ్వనాధుని పాదాల చెంత ప్రవహించే గంగను పరమ పవిత్రంగా భావించడం వల్ల ఇక్కడ చేసే పవిత్ర పుష్కరస్నానం పాపాలను హరిస్తుందని నమ్మకం.
పుష్కరకాలంలోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరమని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరం అంటారు. ఈ ఆది, అంత్య పుష్కరాలు ఎంతో ప్రత్యేకమైనవి, పవిత్రమైనవి. గురువు మేషంలోకి ప్రవేశించిన మొదటి పన్నెండు రోజులు సకల దేవతలతో కలిసి పుష్కరుడు గంగలో కొలువై ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ కాలంలో పితృతర్పణతో పితరులు సంతోషిస్తారని కూడా నమ్మకం. కనుక చాలా మంది హిందువులు గంగా పుష్కర స్నానానికి వస్తారు.
ఏప్రిల్ 22న గురు గ్రహం మేషంలోకి ప్రవేశించిన రోజు నుంచి పన్నెండు రోజుల పాటు అంటే మే 3 వరకు కూడా గంగా పుష్కరోత్సవాలు జరుగుతాయి. రద్దీగా ఉండే ఈ పుష్కర ఘాట్లలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం. పుష్కర స్నానానికి వెళ్లాలని అనుకునే వారు ముందుగా ఏర్పాట్లు చేసుకోవడం చాలా అవసరం. లేదంటే దేశంలోని పలు ప్రాంతాల నుంచి జనం వచ్చే ఈ ఉత్సవాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. అక్కడ దిగి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకుని రావడానికి తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.
ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఏ పనులు చెయ్యాలి? ఏవి చెయ్యకూడదు ఒకసారి తెలుసుకోవడం అవసరం.
- నదులు పవిత్రమైనవి. వాటి నీటిని కలుషితం చెయ్యకుండా ఉండడం మన బాధ్యత.
- నాణాలు, ఇతర వస్తువులు నది నీటిలోకి విసిరెయ్య కూడదు.
- జనం ఎక్కువ చేరడం వల్ల చాలా అపరిశుభ్రంగా మారి పోయే ప్రమాదం ఉంటుంది. కనుక మనకు వీలైనంత వరకు నదీ పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు ప్రయత్నించాలి.
- ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యర్థాలు నదిలో వదల కూడదు.
- ప్లాస్టిక్ వ్యర్థాలు నదీజలాలను కలుషితం చెయ్యడం మాత్రమే కాదు జలచరాలకు ముప్పు చేస్తాయి. ఇలా చేస్తే పుణ్యం వచ్చేది పోయి పాపం చుట్టుకోగలదు. కనుక అలాంటి పనులు అసలు చెయ్యకూడదు.
- నదీ స్నానానికి షాంపూలు, సబ్బులు వాడకూడదని గుర్తుంచుకోండి. కేవలం ఆనీటిలో మునక వేయడమే పవిత్రం. మురికి కడగడం కాదని మరచిపోవద్దు.
- రద్దీ ప్రదేశాల్లో క్యూపద్ధతి పాటించాలి.
మరికొన్ని జాగ్రత్తలు
- భక్తుల నమ్మకాలను క్యాష్ చేసుకునేందుకు ఎప్పుడు దుండగులు కాచుకుని ఉంటారు. మోసాలు జరిగే ప్రమాదం ఉంటుంది. కనుక అనుక్షణం జాగరూకత అవసరం.
- ఇప్పుడిప్పుడే పాండమిక్ కూడా ముదురుతోంది. కాబట్టి రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఎక్కువ సేపు ఉండడం సురక్షితం కాదు. తొక్కిసలాటలు జరిగే ప్రమాదం కూడా లేకపోలేదు.
- పుష్కరాల సమయం, చాలా మంది ఒకేచోట చేరుతారు. నీరు కలుషితమయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది. కనుక తాగే నీటి విషయంలో జాగ్రత్తలు తీసుకవడం తప్పనిసరి.