Braille Facts : మీకు తెలుసా బ్రెయిలీ భాష కాదు.. లాజికల్ సిస్టమ్‌పై ఆధారపడి ఉన్న ఓ కోడ్
World Braille Day : కంటి చూపు సరిగ్గా లేని వారికి, అంధత్వం ఉన్నవారికి బ్రెయిలీ ఓ వరమనే చెప్పాలి. ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం సందర్భంగా దీని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
World Braille Day 2024 : సరైన చూపు ఉన్నవారు బ్రెయిలీ దినోత్సవాన్ని సంవత్సరంలో ఒకసారి జరుపుకుంటారు. కానీ అంధత్వంతో ఇబ్బంది పడేవారు.. కంటి చూపు అడ్డు కాదంటూ తమను తాము మెరుగుపరచుకునేవారు బ్రెయిలీ దినోత్సవాన్ని రోజూ జరుపుకుంటారు. అప్పటివరకు ఉన్న హియరింగ్ విధానాలకు చెక్ పెట్టి.. అంధత్వం ఉన్నవారికి బ్రెయిలీ కొత్త ఊరటనిచ్చింది. తమ వ్యక్తిగత విషయాల గురించి ఇతరులపై ఆధారపడకుండా చేసింది. తమ సమాచారాన్నే తామే గోప్యంగా ఉంచుకోవడంలో అంధులకు బ్రెయిలీ ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చింది.
అంధుల జీవితాలనే మార్చేసింది..
ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జనవరి 4వ తేదీన జరుపుకుంటారు. బ్రెయిలీని కనిపెట్టి.. దానికి ఎన్నో సేవలు చేసిన లూయిస్ బ్రెయిలీ పుట్టినరోజును జ్ఞాపకం చేసుకుంటూ దీనిని నిర్వహిస్తున్నారు. ఫ్రాన్స్‌లో 1809లో జన్మించిన లూయిస్.. చిన్నతనంలో ఓ ప్రమాదంలో తన చూపును కోల్పోయాడు. లూయిస్ తన 15 ఏళ్ల వయసులో అంధుల జీవితాలను మార్చే కొత్త కమ్మూనికేషన్ విధానాన్ని పరిచయం చేశాడు. ఇది అంధుల జీవితాన్నే మార్చేసింది. అతని ధృడ సంకల్పంమే చరిత్రలో అత్యంత విలువైన విప్లవాత్మక వ్యవస్థల దృష్టికి దారితీసింది.
నైట్ రైటింగ్ కోడ్ ఆధారంగా..
లూయిస్ ఫ్రాన్స్‌లో విద్యార్థిగా ఉన్నప్పుడు మరిన్ని పుస్తకాలు చదవాలని ఆరాటపడుతూ ఉండేవాడు. ఆ సమయంలోనే వేలిముద్రలతో సులభంగా చదవగలిగే వర్ణమాలని సృష్టించే దిశగా ప్రయోగాలు చేశాడు. ఇలా పదిహేనేళ్ల వయసులో లూయిస్ బ్రెయిలీని కనుగొన్నాడు. రాత్రిపూట యుద్ధభూమిలో వెలుతురు లేకుండా చదవగలిగే సైనిక సందేశాల కోసం నైట్ రైటింగ్ కోడ్ వినియోగించేవారు. దాని నుంచి ప్రేరణ పొందిన లూయిస్ స్పర్శతో చదివేలా, రాసేలా బ్రెయిలీని కనుగొన్నాడు.
ఐక్యరాజ్య సమతి గుర్తించక ముందే..
అంధత్వంతో బాధపడుతున్న వారి మానవ హక్కులపై బ్రెయిలీ చూపించిన ప్రభావాన్ని గుర్తుగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2018లో ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించింది. లూయిస్‌కు నివాళిగా ఆయన పుట్టిన తేదీనే ఈ దినోత్సవం నిర్వహించాలని డిసైడ్ చేశారు. ఇలా మొదటి వేడుక జనవరి 4, 2019న జరిగింది. అయితే ఐక్యరాజ్యసమితి దీనిని గుర్తించకముందే చాలామంది ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకున్నారు.
ఇది భాష కాదు.. కోడ్
బ్రెయిలీ గురించి చెప్పాలంటే ఇది భాష కాదు. అనేక భాషలలో ఉపయోగించగలిగే కోడ్. బ్రెయిలీలో 6 చుక్కలు ఓ సెల్‌ను తయారు చేస్తాయి. ఖాళీ సెల్‌తో సహా 64 బ్రెయిలీ సెల్ కలయికలు ఉంటాయి. రచయితలు ప్రాధాన్యతను బట్టి బ్రెయిలీని వివిధ గ్రేడ్లుగా ఉపయోగిస్తారు. దీనిలో ప్రధానంగా మూడు గ్రేడ్లు ఉంటాయి. గ్రేడ్ 1 బ్రెయిలీలో ఆంగ్ల వర్ణమాలలోని 26 అక్షరాలు, సంఖ్యలు, విరామ చిహ్నాలు మరికొన్ని కలిగి ఉంటుంది. గ్రేడ్ 2లో అక్షరాలు, పదాలు ఉంటాయి. గ్రేడ్ 3ని షార్ట్ హ్యాండ్ బ్రెయిలీ అంటారు. ఈ నోట్స్‌లో వ్యక్తిగత అక్షరాలు ఉపయోగిస్తారు.
ఎందరో అంధులకు అక్షరాలు నేర్పింది..
ఈ బ్రెయిలీ వల్ల ఎందరో అంధులు చదవడం, రాయడం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంధులకు దీనివల్ల అక్షరాస్యత దొరుకుతుంది. ఎందరో బ్రెయిలీని తమ మాతృభాషల్లో వినియోగిస్తున్నారు. బ్రెయిలీని ఎవరైనా నేర్చుకోవచ్చు. చూసేందుకు కాస్త గందరగోళంగా ఉంటుంది కానీ.. ఇతర కోడ్ల మాదిరిగానే బ్రెయిలీ కూడా లాజికల్ సిస్టమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి ఇది అర్థమైతే.. మీరు బ్రెయిలీని సులభంగా చదవగలుగుతారు.
Also Read : మీకు ఈ సెక్షన్ గురించి తెలుసా? అబ్బాయిలైతే కచ్చితంగా తెలుసుకోవాల్సిందే