Fathers Day 2023: వేయి మంది పిల్లలు అనాథలవ్వడం వల్లే నాన్నల దినోత్సవం మొదలైంది
ఫాదర్స్ డే పుట్టి వందేళ్లు దాటింది. ఈ ప్రత్యేక దినోత్సవం పుట్టుక వెనుక ఒక ఆసక్తికరమైన కధనం ఉంది.
Fathers Day 2023: ఇంటి బరువు మోసేది నాన్న, పిల్లలు పుట్టినప్పుడు నుంచి వారు పెరిగి ప్రయోజకులయ్యే వరకు వారి కోసం అనుక్షణం తప్పించేది నాన్న. ఆయన కష్టం కంటికి కనిపించదు కానీ అతను భుజాలు బరువుతో కుంగిపోతూనే ఉంటాయి. ఆయన మాట కరుకైనా, మనసు వెన్నెలా కరిగిపోతుంది. బిడ్డల భవిష్యత్తు కోసం జీవితాంతం బరువును మోసే తండ్రికి ఓ ప్రత్యేకమైన రోజు ఉంది. అదే ‘ఫాదర్స్ డే’. ప్రతి ఏడాది ఆగస్టులో మూడో ఆదివారాన్ని పితృ దినోత్సవంగా నిర్వహించుకుంటారు. ఈసారి జూన్ 18వ తేదీన ఫాదర్స్ డే వచ్చింది. ఈ ప్రత్యేక దినోత్సవం రోజున మీ తండ్రికి ఒక అందమైన బహుమతితో పాటు శుభాకాంక్షలు చెప్పండి. ఫాదర్స్ డే పుట్టుక వెనక గుండెలను పిండేసే ఒక కథనం ఉంది. వేయి మంది పిల్లలు అనాధలు అయ్యాక ఈ నాన్నల దినోత్సవం పుట్టుకొచ్చింది. తమ తండ్రుల ప్రాణ త్యాగానికి గుర్తుగా ఈ ఫాదర్స్ డేని ఏర్పాటు చేశారు పిల్లలు.
అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో అతి పెద్ద గని మౌనింగా. అప్పట్లో ఎంతో మంది ఈ గనిలో పనిచేసుకుంటూ తమ కుటుంబాన్ని, పిల్లల్ని పోషించుకునేవారు. 1907లో డిసెంబర్ 6న ఆ గనిలో అనుకోని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 361 మంది మరణించారు. వారిలో 250 మంది పెళ్లయి,పిల్లలు ఉన్నవారే. ఆ 250 మంది తండ్రుల పిల్లలు వెయ్యి మంది దాకా ఉంటారు. వెయ్యి మంది పిల్లలు తండ్రి లేని అనాధలు అయ్యారు. అలాంటి పిల్లల్లో ఒక అమ్మాయి గ్రేస్ గోల్డెన్ క్లేటన్. ఆమెకు తండ్రి అంటే ప్రాణం. తండ్రికి ఈమెనే లోకం. అలాంటి తండ్రి అకస్మాత్తుగా చనిపోవడంతో ఆమె జీవితం తలకిందులైంది. ఎంతో ప్రేమించే తండ్రిని మర్చిపోలేక మనోవ్యథకు గురైంది. ఆమె తన తండ్రి స్మారకంగా చర్చిల్లో ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయించింది. ఎన్ని చేయించిన ఆమెకు తృప్తిగా అనిపించలేదు. ఎందుకంటే ఆమెకు తల్లి కూడా లేదు. తన చిన్నప్పుడే తల్లి చనిపోయింది. తనతో పాటు మరో నలుగురు అక్కలను, అన్నదమ్ములను తండ్రి ఒంటరిగా పెంచారు. ఎంతోమంది రెండో పెళ్లి చేసుకోమని చెప్పినా అతను పిల్లల కోసమే తన జీవితాన్ని అంకితం చేశారు. ఇంటి పనులు చేసుకుంటూ, ఉద్యోగం చేస్తూ పిల్లలని కష్టపడి చదివించే వారు. అలాంటి తండ్రి అకస్మాత్తుగా మరణించేసరికి ఆమె తట్టుకోలేకపోయింది. తన తండ్రి లాంటి వారి కోసం ప్రత్యేకంగా ఫాదర్స్ డే ఉండాలని ఆమె భావించింది. అలా మొదటిసారి 1910 లో జూన్ 19న ఫాదర్స్ డే ను నిర్వహించింది.
ఒక అమ్మాయి మొదలుపెట్టిన ఫాదర్స్ డే ఆ ప్రాంతంలో మెల్లగా ప్రాచుర్యం పొందింది. 1966లో అమెరికా ప్రెసిడెంట్ కూడా ఫాదర్స్ డే నిర్వహించాలని అధికారికంగా ప్రకటించారు. అలా ప్రతి సంవత్సరం ఆగస్టు మూడో ఆదివారం ఫాదర్స్ డే నిర్వహించడం మొదలుపెట్టారు. అమెరికా నుంచి ఇతర దేశాలకు కూడా ఈ ప్రత్యేక దినోత్సవం పాకింది. తన తండ్రికి విషెస్ చెప్పడంతో పాటు ఒక అందమైన బహుమతిని కొనిస్తారు పిల్లలు. ప్రస్తుతం ఈ ప్రత్యేక దినోత్సవాన్ని 100కు పైగా దేశాల ప్రజలు నిర్వహించుకుంటున్నారు.
ఈ రోజున తండ్రికి పిల్లలు అందించే బహుమతుల్లో అధికంగా అమ్ముడు అయ్యేవి గ్రీటింగ్ కార్డులు. ఫాదర్స్ డే రోజు తండ్రికి అందమైన గులాబీని అందించే పిల్లలు కూడా ఎంతోమంది. గులాబీ ఫాదర్స్ డే రోజు ఇవ్వాల్సిన పువ్వు గా గుర్తింపు పొందింది. పితృ దినోత్సవాన్ని మొదటిసారి నిర్వహించుకున్న దేశంగా అమెరికా చరిత్రకెక్కింది.
Also read: నాన్నకు ప్రేమతో ఇలా తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పండి