Supplements for Skin and Hair : చర్మం మెరవాలన్నా.. జుట్టు ఒత్తుగా ఉండాలన్నా తీసుకోవాల్సిన 5 సప్లిమెంట్స్ ఇవే
Supplements for Glowing Skin : జుట్టు మెరుస్తూ ఉండాలన్నా.. చర్మం కాంతివతంగా ఉండాలన్నా.. శరీరానికి కొన్ని సప్లిమెంట్స్ అందించాల్సి ఉంటుంది. అవేంటో.. వాటివల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.

- చర్మ, కేశ సౌందర్యానికి పోషకాహారం, కొన్ని సప్లిమెంట్లు అవసరం.
- కొల్లాజెన్, బయోటిన్, ఒమేగా-3 చర్మ, కేశ ఆరోగ్యానికి తోడ్పడతాయి.
- విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తి, జింక్ కణాల మరమ్మత్తుకు తోడ్పడతాయి.
- సమతుల ఆహారం, సరైన జీవనశైలి సప్లిమెంట్ల కన్నా ఎంతో ముఖ్యం.
చర్మం అందంగా, కాంతివంతంగా కనిపించాలని.. జుట్టు ఒత్తుగా, షైనీగా ఉండాలని చాలామంది కోరుకుంటారు. ఇందుకోసం ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్, హెయిర్ కేర్ ట్రీట్‌మెంట్స్ ఉపయోగిస్తుంటారు. అయితే చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండటంలో పోషకాహారం కూడా కీలక పాత్ర పోషిస్తుందని చెప్తున్నారు నిపుణులు. శరీరానికి అవసరమైన కొన్ని విటమిన్లు, మినరల్స్ లోపిస్తే చర్మం పొడిబారడం, మొటిమలు రావడం, జుట్టు రాలడం వంటి సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు.
ఇలాంటి సమయంలో శరీరానికి కొన్ని సప్లిమెంట్స్ అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిలో భాగంగా కొల్లాజెన్, బయోటిన్, ఒమేగా 3 వంటి కొన్ని సప్లిమెంట్స్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. మరి చర్మ సౌందర్యం, జుట్టు ఆరోగ్యానికి తోడ్పడే ముఖ్యమైన సప్లిమెంట్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read : తక్కువ ఖర్చుతో గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవాలా? ఈ 5 జపనీస్ చిట్కాలు ట్రై చేయండి
కొల్లాజెన్
చర్మం బిగుతుగా, యవ్వనంగా కనిపించడంలో కొల్లాజెన్ కీలక పాత్ర పోషిస్తుంది. వయసు పెరిగే కొద్దీ శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి సహజంగానే తగ్గుతుంది. దీంతో చర్మంపై ముడతలు, సన్నని గీతలు కనిపించవచ్చు. కొల్లాజెన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల చర్మ హైడ్రేషన్, ఎలాస్టిసిటీ మెరుగుపడవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇది జుట్టు పెరుగుదలను పెంచుతుందని చెప్పే ఆధారాలు లేవు.
బయోటిన్
బయోటిన్‌ను విటమిన్ బి7 అని కూడా పిలుస్తారు. ఇది జుట్టు, చర్మం, గోళ్ల ఆరోగ్యానికి అవసరమైన పోషకాల్లో ఒకటి. శరీరంలో కెరాటిన్ అనే ప్రోటీన్ ఉత్పత్తికి సంబంధించిన ప్రక్రియల్లో బయోటిన్ సహకరిస్తుంది. బయోటిన్ లోపం ఉన్నవారిలో జుట్టు పలుచబడటం, జుట్టు రాలడం వంటి సమస్యలు కనిపించవచ్చు. అలాంటి లోపం ఉన్నప్పుడు సప్లిమెంట్స్ బాగా ఉపయోగపడతాయి.
Also Read : రైస్ వాటర్ మాత్రమే కాదు.. బియ్యపు పిండితోనూ గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు.. ఇలా అప్లై చేయండి
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్
చర్మం తేమగా ఉండటానికి, శరీరంలో వాపు సంబంధిత ప్రక్రియలను నియంత్రించడానికి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సహాయపడతాయి. ఇవి చర్మంలోని సహజ రక్షణ పొర పనితీరుకు తోడ్పడి పొడిబారడాన్ని తగ్గించవచ్చు. అలాగే స్కాల్ప్ ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఇవి అవసరం. ఈ లోపం ఉన్నవారు చేపలు, వాల్‌నట్స్, అవిసె గింజలు వంటివి తీసుకోవడం మంచిది.
విటమిన్ సి
చర్మ సౌందర్యానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలలో విటమిన్ సి ఒకటి. శరీరంలో కొల్లాజెన్ తయారవడానికి ఇది అవసరం. అంతేకాకుండా యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ ఫ్రీ రాడికల్స్ వల్ల కణాలకు కలిగే నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండటంతో పాటు గాయాలు త్వరగా మానడానికి కూడా ఇది అవసరం. విటమిన్ సి లోపం ఉంటే జుట్టు ఆరోగ్యం కూడా ప్రభావితమవుతుంది. నిమ్మకాయ, నారింజ, ఉసిరి, జామ వంటి పండ్ల ద్వారా ఈ విటమిన్‌ను పొందవచ్చు.
Also Read : అరటిపండు ఫేస్ మాస్క్.. ఇంట్లోనే మెరిసే, హెల్తీ స్కిన్ కోసం సులభమైన DIY చిట్కాలు
జింక్
చర్మం, జుట్టు, గోళ్ల ఆరోగ్యానికి అవసరమైన ముఖ్యమైన మినరల్ జింక్. శరీరంలో కణాల పెరుగుదల, కణజాల మరమ్మతు, రోగనిరోధక వ్యవస్థ పనితీరులో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. జింక్ లోపం వల్ల జుట్టు రాలడం, చర్మ సమస్యలు ఎదురవ్వవచ్చు. తగినంత జింక్ అందితే జుట్టు కుదుళ్ల ఆరోగ్యానికి, చర్మం పనితీరుకు తోడ్పడుతుంది. గుమ్మడి గింజలు, పప్పులు, నట్స్, గుడ్లు వంటి ఆహారాల్లో జింక్ లభిస్తుంది.
సప్లిమెంట్స్ కంటే ఇవే బెస్ట్..
చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే సప్లిమెంట్స్ ఒక్కటే సరిపోవు. రోజువారీ ఆహారంలో ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు, గుడ్లు, పప్పులు, నట్స్, చేపలు వంటి పోషకాహారాన్ని తీసుకోవాలి. తగినంత నీరు తాగాలి. రోజుకు 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి. వీటితో పాటు ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా మంచిదే. ఇవి చర్మం, జుట్టు ఆరోగ్యానికి సహాయపడతాయి. అలాగే వైద్యుల సూచనలు లేకుండా చర్మం మెరవాలని, జుట్టు ఒత్తుగా పెరగాలని మార్కెట్లో దొరికే సప్లిమెంట్స్‌ను తీసుకోకూడదు.
Also Read : గ్లోయింగ్ స్కిన్ కోసం ఉదయాన్నే ఏం చేయాలి? ఈ 6 స్కిన్ కేర్ స్టెప్స్ ఫాలో అవ్వండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















