Water: నీరు తక్కువగా తాగుతున్నారా? అయితే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది జాగ్రత్త
నీరు తక్కువగా తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశం ఉంది.
ఎండాకాలంలో దాహం విపరీతంగా వేస్తుంది. కానీ వానాకాలం, శీతాకాలంలో మాత్రం దాహం తగ్గిపోతుంది. దానికి కారణం వాతావరణంలో ఉండే చల్లదనమే దాహం వేసినా, వేయకపోయినా ప్రతి రెండు గంటలకు ఒకసారి కచ్చితంగా నీళ్లు తాగాల్సిందే. కానీ చాలామంది దాహం వేస్తే మాత్రమే నీళ్లు తాగుతారు. దీని వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. త్వరగా డిహైడ్రేషన్ బారిన పడతారు. శరీరంలో నీళ్లు తగ్గితే ప్రధాన అవయవాలైన కాలేయం, కండరాలు, కీళ్లు వంటివి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశం ఉంది.
శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే అనేక రకాల సమస్యలు మొదలవుతాయి. అధ్యయనం చెబుతున్న ప్రకారం ఎప్పుడైతే శరీరంలో నీరు తగ్గుతుందో కొలెస్ట్రాల్ ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ల మోతాదులు పెరుగుతాయి. నీటి శాతం తగ్గిపోతే కాలేయం రక్తంలోకి ఎక్కువగా కొలెస్ట్రాల్ ని విడుదల చేస్తుందని చెబుతున్నారు పరిశోధనకర్తలు.
అంతేకాదు రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్‌ను తొలగించాల్సిన ప్రక్రియ కూడా నెమ్మదిస్తుంది. దీనివల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెకు సమస్య రావచ్చు. గుండెపోటు వంటివి త్వరగా వచ్చే అవకాశం ఉంది. అయితే నీటికి, ఈ కొలెస్ట్రాల్ పెరుగుదలకు మధ్య సంబంధం ఏంటన్నది ఇంకా అధ్యయనకర్తలు తెలుసుకోలేకపోయారు. కానీ తగినంత నీరు తాగితే మాత్రం శరీరంలో కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవచ్చనే విషయాన్ని మాత్రం చెబుతున్నారు. ఎవరైతే ఎక్కువగా నీరు తాగుతారో వారిలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతున్నట్టు అధ్యయనంలో తేలింది.
గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కచ్చితంగా నీరు తాగాల్సిందే. నీరు ఎక్కువగా తాగితే... కొలెస్ట్రాల్ తక్కువగా రక్తంలోకి విడుదలవుతుంది. గుండె పోటు వంటివి వచ్చే పరిస్థితులు తగ్గుతాయి. కాబట్టి కాలంతో పని లేకుండా ప్రతి రెండు గంటలకు ఒకసారి కనీసం గ్లాసు నీళ్లు తాగుతూ ఉండండి. రోజు మొత్తంలో ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగండి. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. అలాగే కొలెస్ట్రాల్‌ను తగ్గించి, శరీరం ఉత్సాహంగా ఉండేలా చూస్తుంది.
శరీరంలో నీరు తగ్గడం చాలా ప్రమాదకరం. తగినంత నీరు తీసుకోవడం ద్వారా 80 శాతం రోగాలను దూరం పెట్టవచ్చు. జీవక్రియలు సక్రమంగా సాగాలంటే తగినంత నీరు అవసరం. మెదడుకు సరిగా పనిచేయాలన్నా నీరే కావాలి. నీరు తగ్గితే తలనొప్పి వచ్చేస్తుంది. నీరు తక్కువగా తాగే వారిలో ఏకాగ్రత కుదరదు. మతిమరుపు కూడా వచ్చేస్తుంది. డిప్రెషన్ వంటివి త్వరగా దాడి చేస్తాయి. కాబట్టి శారీరక, మానసిక ఆరోగ్యం కోసం కచ్చితంగా నీటిని తగినంత తాగుతూ ఉండాలి.
Also read: చూయింగ్ గమ్ నములుతూ అనుకోకుండా అలా మింగేస్తే ఏమవుతుంది?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.