Weight Loss: కండల కోసం ప్రొటీన్ షేక్‌లకు బదులు ఈ పానీయం తాగండి
కండలు తిరిగిన శరీరం కోసం ఎంతో మంది యువత జిమ్‌కి వెళ్తారు. ప్రోటీన్ షేక్‌లను ఎక్కువగా తాగుతుంటారు.
భారతీయ ఆహారంలో సూపర్ ఫుడ్స్ ఎన్నో ఉన్నాయి. కానీ వాటిని పక్కన పెట్టి కృత్రిమ ఆహారాలపైనే ఎక్కువ మంది ఆధారపడుతుంటారు. కండలు తిరిగే శరీరం కావాలంటే కండరాలు బలంగా ఉండాలి. అందుకోసం ప్రోటీన్ షేక్‌లను ఎక్కువగా తాగుతూ ఉంటుంది యువత. అయితే ప్రోటీన్ షేక్‌లకు బదులు, సత్తు పిండితో చేసిన పానీయాన్ని తాగడం వల్ల ఎంతో ఆరోగ్యమని చెబుతున్నారు వైద్య నిపుణులు. సత్తుపిండిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. శాఖాహారులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దీంట్లో ప్రోటీన్ నిండి ఉంటుంది. అందుకే సత్తు పిండిని ‘పేదవారి ప్రోటీన్’ అని కూడా పిలుస్తుంటారు. కండలు తిరిగే శరీరం కావాలనుకునే వారికి సత్తు పిండి ఎంతో సహాయపడుతుంది. బీహార్చ జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో సత్తుపిండి ఎంతోమంది పేదవారి ఆకలి తీరుస్తుంది. దీనిలో అధిక నాణ్యత గల ప్రోటీన్ ఉంటుంది.అలాగే కాల్షియం, మాంగనీస్, ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. సోడియం అతి తక్కువగా ఉంటుంది. దీనితో చేసిన ఆహారము లేదా పానీయమో తాగిన వెంటనే తక్షణ శక్తి వస్తుంది. శరీర ఉష్ణోగ్రతను పెరగకుండా అదుపులో ఉంచడంలో కూడా ఇది సహాయపడుతుంది. దీనిలో ఫైబర్ ఎక్కువే ఉంటుంది. కాబట్టి జీర్ణక్రియకు ఎంతో మేలు జరుగుతుంది. హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం వంటివి రాకుండా అడ్డుకునే శక్తి ఈ సత్తు పిండికి ఉంది. మిల్క్ షేక్‌లు, ప్రోటీన్ షేక్‌లకు బదులు ప్రోటీన్ కోసం ఈ సత్తు పానీయం పై ఆధారపడడం ఎంతో ఆరోగ్యం. దీన్ని ఇంట్లో కూడా చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు.
సత్తు పిండి తయారీ
సత్తుపిండి మార్కెట్లో రెడీమేడ్‌గా దొరుకుతుంది. అది కొనడం ఇష్టం లేకపోతే మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వాటిలో వాడే పదార్థాలు ఎవరి ఇష్టాలను బట్టి ఉంటాయి. కొంతమంది బార్లీ లేదా సెనగపప్పు తో తయారు చేస్తారు. ఒడిశాలో జీడిపప్పు, బాదం పప్పులు, చిరుధాన్యాలు, బార్లీ, కొమ్ము సెనగలు ఇలాంటివన్నీ కలిపి సత్తు పిండిని చేస్తారు. ఎక్కువగా కొమ్ము సెనగలతోనే ఈ సత్తుపిండిని తయారుచేసి దాచుకుంటారు. మీ ఇష్ట ప్రకారం సత్తుపిండిని దేనితో తయారు చేయాలో నిర్ణయించుకోవచ్చు.
మీరు చిరుధాన్యాలతో తయారు చేయాలనుకుంటే కొన్ని చిరుధాన్యాలు, కొమ్ము శనగలు కళాయిలో వేయించి, వాటిని పొడి చేసి పెట్టుకోవాలి. లేదా బార్లీ, సెనగపప్పు వేయించి పొడి చేసి సత్తుపిండిని తయారు చేసుకోవచ్చు. ముందు చెప్పినట్టు ఇందులో బాదం, జీడిపప్పులు, బార్లీ, కొమ్ము శనగలు వేయించి పిండిని చేసి పెట్టుకోవచ్.చు వీటిలో మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు. అలా సత్తుపిండిని చేసుకున్నాక గ్లాసు నీటిలో ఒక స్పూను సత్తుపిండి, చిటికెడు ఉప్పు, ఒక స్పూను బెల్లం, అర స్పూను నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆ పానీయాన్ని రోజూ ఉదయాన తాగేయాలి. ఏ కాలంలో ఈ పానీయాన్ని తాగినా మంచిదే.
Also read: క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే మూడు రకాల ఆహార పదార్థాలు ఇవే, తినడం మానేస్తే మీకే మంచిది
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.