Video conference: వీడియో కాన్ఫరెన్సుల వల్ల అధికంగా అలసిపోయేది వీళ్లే, ఈ అలసటకూ ఓ పేరుంది
వీడియో కాన్ఫరెన్సుల వల్ల వచ్చే అలసటపై జరిగిన అధ్యయనంలో కొన్ని కొత్త విషయాలు బయటపడ్డాయి.
కరోనా వచ్చాక ఆఫీసులు మూత పడ్డాయి. ఇప్పటికీ సగం ఆఫీసులే తెరుచుకున్నాయి. ఇంటి నుంచి పనిచేసే వారి సంఖ్య ఇప్పటికీ ఎక్కువనే ఉంది. గత రెండేళ్లుగా ఎంతో మంది ఉద్యోగులు వీడియో కాన్ఫరెన్సులలో నిత్యం పాల్గొంటూనే ఉన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్సుల వల్ల వచ్చ అలసటను ‘వీడియో కాన్ఫరెన్స్ ఫ్యాటిగ్’ లేదా ‘జూమ్ ఫ్యాటిగ్’ అంటారు. ఓ కొత్త అధ్యయనంలో ఈ అలసట మగవారితో పోలిస్తే ఆడవాళ్లలోనే ఎక్కువని తేలింది. అందులోనూ ఎవరితోనూ ఏమీ పంచుకోని ఇంట్రవర్ట్ (అంతర్ముఖులు) అయిన యువ మహిళల్లో ఈ అలసట అధిక ప్రభావం చూపిస్తుందని తేల్చింది అధ్యయనం.
ప్రభావం ఎక్కువే
కోవిడ్ 19 ప్రపంచంపై విరుచుకుపడినప్పటి నుంచి అంటే 2020 ఏడాది ప్రారంభం నుంచి ప్రైవేటు, ప్రొఫెషనల్ వీడియో కాన్ఫరెన్స్ లు ఎక్కువైపోయాయి. వీడియో కాన్ఫరెన్సులు మాట్లాడేందుకు, చూసేందుకు చాలా చిన్న విషయాలుగా కనిపించవచ్చు. కానీ అవి చూపించే ప్రభావం మాత్రం ఎక్కువనే చెబుతున్నారు మానసిక వైద్య నిపుణులు. స్వీడన్లోని బ్లెకింగే ఇన్ స్టిట్యూల్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు జూమ్ ఫ్యాటిగ్ సమస్యపై అధ్యయనం చేశారు. త్వరగా అలసిపోవడానికి లింగం, వయస్సు, వ్యక్తిత్వం వంటివి ప్రధాన పాత్ర పోషిస్తాయని గుర్తించారు. ఈ అలసటపై ఇంకా చాలా అంశాలు ఆధారపడి ఉంటాయని తెలిపారు.మీటింగ్ నిర్వహించిన సంస్థ ప్రవర్తన, వారు వాడే సాంకేతికత, అలాగే ఉద్యోగి వ్యక్తిగత పరిస్థితులు, చుట్టూ ఉన్న పర్యావరణం వంటివి ప్రభావం చూపిస్తాయని కనుగొన్నారు.
ఇలా తగ్గించుకోవచ్చు
పరోక్షంగా పడే వీడియో కాన్ఫరెన్సుల అలసటను కొన్ని పనులు చేయడం ద్వారా తగ్గించుకోవచ్చని చెబుతున్నారు పరిశోధకులు. వాటిలో మొదటిది వరుస పెట్టి కాన్ఫరెన్సులలో పాల్గొన కూడదు. మధ్యలో కనీసం గంటైనా గ్యాప్ తీసుకుని ప్రశాంతంగా ఉండాలి. అలాగే మీరు మాట్లాడాలనుకున్నప్పుడు తప్ప మిగతా సమయం అంతా మైక్, కెమెరాను ఆఫ్ చేసి పెట్టుకుంటే మంచిది. దీని వల్ల నిత్యం అలెర్ట్ గా ఉండాల్సిన అవసరం లేకుండా కాస్త కుర్చీలో వెనక్కి చేరబడొచ్చు.
భవిష్యత్తులో కూడా ప్రపంచం హైబ్రిడ్ వర్క్ కల్చర్ వైపుగా సాగుతుందని, వీడియో కాన్ఫరెన్సులు పెరుగుతాయే కానీ తరగవనే అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు పరిశోధకులు. కాబట్టి మానసికంగా ఎలాంటి ప్రభావం పడకుండా కాన్ఫరెన్సులను షెడ్యూల్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. అలసట కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదేనని అంటున్నారు. ఈ అధ్యయనం తాలూకు వివరాలు జర్నల్ ఆఫ్ ఎన్విరాన్ మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్ లో ప్రచురించారు.
Also read: అమ్మను పెళ్లి దుస్తుల్లో అలా చూసి, నిజమైన ఆనందం అంటే ఇది, వీడియో చూడాల్సిందేy
Also read: ఈ బ్లడ్ గ్రూపుల వారికి గుండె పోటు వచ్చే అవకాశం ఎక్కువ