Heart Attack: ఈ బ్లడ్ గ్రూపుల వారికి గుండె పోటు వచ్చే అవకాశం ఎక్కువ
బ్లడ్ గ్రూపులను బట్టి మనిషి ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
A, B, AB, O... ప్రపంచంలోని ఎక్కువ జనాభా బ్లడ్ గ్రూపులు అధికంగా ఇవే ఉంటాయి. కొన్ని అరుదైన గ్రూపులు కూడా ఉన్నప్పటికీ ఆ రక్త వర్గాలను కలిగి ఉన్న వారు తక్కువ సంఖ్యలో ఉంటారు. ఒక కొత్త అధ్యయనం ప్రకారం కొన్ని బ్లడ్ గ్రూపులు కలిగి ఉన్నవారికి గుండె జబ్బుల ప్రమాదం పొంచి ఉంటుంది. మిగతా బ్లడ్ గ్రూపుల వారితో పోలిస్తే వీరికి గుండె,ఊపిరితిత్తుల సమస్యలు అధికంగా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు పరిశోధకులు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం వంటివి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంటే, కొన్ని రక్త వర్గాలు మాత్రం వ్యాధి వచ్చే అవకాశాన్ని పెంచుతాయని అంటున్నారు.
ఏ రక్తవర్గాలంటే...
A, B, AB రక్తవర్గాలను కలిగి ఉన్న వారిలో రక్తం గడ్డ కట్టడం, గుండె సంబంధ వ్యాధులు, గుండె పోటు వంటివి వచ్చే అవాకాశం ఎక్కువ. అమెరికాన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం 4,00,000 మందిపై చేసిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. ఈ మూడు రక్త వర్గాల్లో O రక్త వర్గంతో పోలిస్తే గుండె పోటు వచ్చే అవకాశం 8 శాతం ఎక్కువ, గుండె ఆగిపోయే ప్రమాదం 10 శాతం ఎక్కువని ఈ అధ్యయనం నిర్ధారించింది.
అలాగే A, B రక్త రకాలు కలిగిన వ్యక్తుల్లో సిరలలో రక్తం గడ్డకట్టే అవకాశం 51 శాతం అధికంగా ఉంటుందని, అలాగే ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం అనేది 47 శాతం అధికమని అధ్యయనం తేల్చింది. వీరు పల్మనరీ ఎంబోలిజం అనే సమస్యతో బాధపడే అవకాశం ఎక్కువని కూడా చెబుతోంది.
మరో అధ్యయనంలో....
AHA జర్నల్‌లో ప్రచురించిన మరో అధ్యయనంలో 89,500 మంది పెద్దల్లో ఆర్టెరియోస్క్లెరోసిస్, థ్రాంబోసిస్ మరియు వాస్కులర్ బయాలజీలను పరిశోధించారు శాస్త్రవేత్తలు. ఈ పరిశోధన దాదాపు 20 ఏళ్ల పాటూ సాగింది. ఆ పరిశోధనలో AB బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు ఇతరులతో పోలిస్తే 23 శాతం అధికంగా గుండె జబ్బులకు గురవుతారని తేలింది. B బ్లడ్ గ్రూప్ ఉన్న వారు 11 శాతం ఎక్కువ ముప్పుని కలిగి ఉంటారని, A బ్లడ్ గ్రూప్ వ్యక్తులు 5 శాతం ప్రమాదాన్ని కలిగి ఉంటారని తెలిసింది.
ఆయా రక్తవర్గాల వారు గుండె సంబంధిత వ్యాధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పరిశోధకులు. ఒక వ్యక్తి రక్త వర్గాన్ని మార్చలేనప్పటికీ వారి ఆహార, జీవన శైలి ద్వారా కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిలను నియంత్రణలో ఉంచుకుంటే గుండె సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చని సూచిస్తున్నారు.
Also read: ఈ బొమ్మలో మొత్తం ఎన్ని జంతువులున్నాయో కనిపెట్టండి చూద్దాం
Also read: ఇంట్లో పనీర్ సరిగా తయారుచేయలేకపోతున్నారా? ఇదిగో ఇలా చేస్తే బయట కొనే పనీర్‌లాగే ఉంటుంది