Anger Controlling: ప్రతి చిన్నవిషయానికి కోపం వస్తుందా? వీటిని రోజూ తినండి కంట్రోల్‌లో ఉంటుంది
ఒక్కోసారి చిన్నచిన్న విషయాలకే కోపం వచ్చేస్తుంది. అలాంటివాళ్లకి ఈ ఆహారాలు మేలు చేస్తాయి.
కొందరికి పట్టరాని కోపం (Anger) వచ్చేస్తుంది, ఎప్పుడూ చికాకుగా ఉంటారు. చిన్న చిన్న విషయాలకే అరుస్తుంటారు. నిజానికి వారికి ప్రశాంతంగా ఉండాలని ఉంటుంది కానీ ఉండలేరు. కోపం వారి నియంత్రణలో లేకుండా వచ్చేస్తుంది. అలాంటి వారిపై కాలిఫోర్నియా యూనివర్సిటీలో పరిశోధనలు జరిగాయి. అలా కోపం రావడానికి, వారి తినే ఆహారానికి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో పరిశోధనలు సాగాయి. అందులో ఆహారం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందని తేలింది. అందుకే కోపాన్ని పెంచే ఆహారాలను దూరం పెట్టడమే కాదు, కొన్ని రకాల ఆహారాలను రోజూ తినడం ద్వారా కోపాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు.
ఇవి తినవద్దు...
కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు చెప్పిన ప్రకారం చెడు కొవ్వు అధికంగా ఉండే ఆహారాలను తినడం వల్ల కోపం పెరుగుతుంది. ముఖ్యంగా నూడిల్స్, కేకులు, చిప్స్, చైనీస్ ఫ్రైడ్ రైస్ లు వంటి జంక్ ఫుడ్స్ తింటే వారిలో కోపాన్ని కంట్రోల్ చేసుకునే శక్తి తక్కువగా ఉంటుంది. అలాగే చక్కెర అధికంగా ఉండే స్వీట్లు తినడం చాలా మేరకు తగ్గించాలి. ఇవి కూడా మనిషిలో త్వరగా చికాకు, విసుగు, కోపం వచ్చేందుకు కారణమవుతాయి. ఇలాంటివి తినడం తగ్గించి, కోపం రాకుండా చేసే ఆహారాన్ని తింటే ప్రశాంతమైన జీవితాన్ని గడపొచ్చు.
ఏం తినాలి?
కోపం నియంత్రణలో ఉండాలంటే ఒమెగా 3ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాలను తినడం అవసరం. అలాగే ఆరోగ్యకరకొవ్వులు ఉండే పదార్థాలను ఎంచుకోవాలి. చేపల్లో ఒమెగా 3ఫ్యాటీ ఆమ్లాలతో పాటూ మంచి కొవ్వులు కూడా లభిస్తాయి. అలాగే అవిసెగింజలు, గుడ్లు, వాల్ నట్స్, బాదంపప్పు వంటివి కూడా కోపం తగించే లక్షణాలను కలిగి ఉంటాయి. ఇందులోని పోషకాలు అధిక కోపాన్ని నియంత్రిస్తాయి. అంతేకాదు డోపమైన్ హార్మోన్ మన శరీరంలో అధికంగా ఉత్పత్తి అయితే కోపం రావడం తగ్గిపోతుంది. డోపమైన్ స్థాయిలు పెంచేందుకు చికెన్ (మితంగా), గుడ్లు, చేపలు, పుట్టగొడుగులు వంటివి తినాలి. అలాగే పాలకూర, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడికాయ గింజలు కూడా తింటుండాలి. విటమిన్ డి లోపం వల్ల కూడా కోపం అధికంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సూర్యరశ్మి ద్వారా విటమిన్ డి శరీరంలోకి చేరేలా చూసుకోవాలి. రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నా కూడా కోపం త్వరగా వచ్చేస్తుంది. కాబట్టి రోగనిరోధకశక్తిని పెంచే ఆహారాలను తినాలి, వ్యాయామాలు కూడా చేస్తూ ఉండాలి. వీటన్నింటితో పాటూ యోగా, ధ్యానం వంటివి కూడా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also Read: పానీపూరి నీళ్లు తెగ తాగేస్తున్నారా? అయితే బరువు పెరగడం ఖాయం
Also Read: మిగిలిపోయిన బిస్కెట్లతో ఇంట్లోనే మగ్ కేక్, అది కూడా అయిదు నిమిషాల్లో