Mug Cake: మిగిలిపోయిన బిస్కెట్లతో ఇంట్లోనే మగ్ కేక్, అది కూడా అయిదు నిమిషాల్లో
ఇంట్లోనే కేకును చాలా సులువుగా చేసుకోవచ్చు. ఇక్కడ మేం మగ్ కేక్ తయారీని వివరించాం.
పిల్లలున్న ఇంట్లో బిస్కెట్లు సగం తిని సగం వదిలేయడం జరుగుతుంది. వాటిని పడయకుండా వాటితోనే కేకును రెడీ చేసుకోవచ్చు. చాకోలెట్ కేక్ కావాలంటే ఒరియో, హైడ్ అండ్ సీక్ వంటి చాక్లెట్ బిస్కెట్లను ఎంచుకోవాలి. వాటితో కేవలం అయిదు నిమిషాల్లో చాక్లెట్ లావా కేక్ చేసుకోవచ్చు. మీకు చిన్న కేక్ కావాలంటే చిన్న కాఫీ మగ్ ని ఎంచుకోండి, పెద్దది కావాలంటే కాస్త పెద్ద మగ్ తీసుకోవాలి. లోపల కేక్ మిక్స్ వేశాక వేడెక్కినప్పుడ ఆ మిక్స్ బయటికి పొంగుతుంది కాబట్టి, కప్పు నిండా మిక్స్ వేయకుండా జాగ్రత్త పడాలి. తక్కువ ఖర్చుతో అయిపోయే మగ్ కేక్ తయారీని తెలుసుకుందాం రండి...
కావాల్సినవి
బిస్కెట్లు - మూడు
కోకో పౌడర్ (స్వీట్ లేనిది) - రెండు స్పూన్లు
పంచదార పొడి - మూడు స్పూనులు
పాలు - మూడు స్పూనులు
డార్క్ చాకోలేట్ - నాలుగు పీస్‌లు
బేకింగ్ పౌడర్ - పావు స్పూను
వెజిటబుల్ ఆయిల్ - రెండు స్పూన్లు
వెనిల్లా ఎసెన్స్ - అర స్పూను
తయారీ ఇలా
1. బిస్కెట్లు మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి.
2. ఇప్పుడు మగ్‌లో మూడు స్పూనుల బిస్కెట్ల పొడి వేసుకోవాలి. దానిపై రెండు స్పూనుల కోకో పొడిని వేయాలి. ఇప్పుడు రెండు స్పూనుల పంచదార పొడి వేయాలి.
3. ఆ మిశ్రమానికి పావు స్పూను బేకింగ్ పౌడర్ కూడా చేర్చి ఫోర్క్ సాయంతో బాగా కలపాలి.
4. బాగా కలిపాక మూడు స్పూనుల పాలు, రెండు స్పూను వెజిటబుల్ ఆయిల్, అరస్పూను వెనిల్లా ఎసెన్స్ కూడా వేసి మళ్లీ బాగా కలపాలి.
5. మిశ్రమంలో ఎలాంటి గాలి బుడగలు లేకుండా, ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి.
6. మధ్యలో డార్క్ చాకోలెట్ ముక్కలు వేసుకోవాలి.
7. మైక్రోవోవెన్లో రెండు నుంచి అయిదు నిమిషాల వరకు పెట్టాలి.
8. కొన్ని మూడు నిమిషాలకే కేకు రెడీ అయిపోతుంది. కేకు రెడీ అయ్యిందో లేదో ఫోర్క్ తో గుచ్చి చూస్తే తెలిసిపోతుంది. ఫోర్క్‌కు ఏమీ అతుక్కోకుండా వస్తే కేకు రెడీ అయినట్టే.
ఓవెన్ లేకుంటే..
స్టవ్ మీద కళాయి పెట్టి గ్లాసు నీళ్లు వేయాలి. అందులో టిష్యూ పేపర్‌ని పెట్టాలి. ఆ టిష్యూ పేపర్ పై మగ్‌ని పెట్టాలి. కళాయిపై మూత పెట్టి ఏడు నిమిషాల పాటూ ఉడకించాలి. తరువాత మగ్ ని బయట పెట్టి వేడి చల్లారేవరకు ఓ అయిదు నిమిషాలు వదిలేయాలి. తరువాత చాకోలెట్ లావా కేకును లాగించేయచ్చు.
Also read: పానీపూరి నీళ్లు తెగ తాగేస్తున్నారా? అయితే బరువు పెరగడం ఖాయం
Also read: మరణం తరువాత జీవితం ఉంటుందా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?