Food: ఎలాంటి ఆహారాలు తింటే రక్తనాళాలు మూసుకుపోతాయో తెలుసా? ఇదిగో ఇవే
కొన్ని రకాల ఆహారాలు ఆరోగ్యానికి చాలా చేటు చేస్తాయి. వాటిని మితంగా తినాల్సిన అవసరం ఉంది.
రక్తనాళాలు మూసుకుపోవడం, రక్త ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడడం, రక్తంలో గడ్డలు... ఇలా కొన్ని సమస్యలు వింటుంటాం. వీటి వల్ల గుండెకే చేటు. గుండెపోటు, ఇతర గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అందుకే రక్తంలోని ఎలాంటి బ్లాకేజ్‌లు రాకుండా చూసుకోవాలి. కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల రక్తనాళాల్లో బ్లాకేజ్‌లు పెరుగుతాయి. అలాంటి ఆహారాన్ని దూరం పెట్టాల్సిన అవసరం ఉంది.
రక్తనాళాల ద్వారానే ఆక్సిజన్, పోషకాలు, రక్తం ఇతర అయయవాలకు చేరుతుంది. అలాంటి ఆ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడితే ఇతర అవయవాలు ఆక్సిజన్, పోషకాలు అందక ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా ఈ పరిస్థితి గుండె మీద వెంటనే తీవ్రంగా పడుతుంది. కొన్ని సార్లు గుండెపోటు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల కొవ్వు, వ్యర్థపదార్థాలు అధికంగా శరీరంలో చేరుతాయి. అవి రక్తనాళాల్లో పేరుకుని అడ్డుగోడలుగా మారతాయి. ఒక్కోసారి రక్తప్రవాహాన్ని పూర్తిగా బ్లాక్ చేస్తాయి. ఇది ప్రాణాలు తీసేంత ప్రమాదకరమైన పరిస్థితి. అందుకే ఆహారం విషయంలో కొన్ని పరిమితులు అవసరం. కేవలం నాలుక రుచి మాత్రమే చూసుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది.
ఎలాంటి ఆహారాలు తినకూడదంటే..
ట్రాన్స్ ఫ్యాట్స్, చెడు కొలెస్ట్రాల్ (ఎల్డిఎల్) అధికంగా ఉండే ఆహారాలను అధికంగా తినకూడదు. వీటివల్లే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది.కాబట్టి ఇవి ఉండే ఆహారాలను దూరం పెట్టాలి. డీప్ ఫ్రై చేసిన వేపుళ్లు రోజూ తినేవారిలో చెడు కొలెస్టాల్ చేరిపోతుంది. అలాగే పిజ్జా, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటివి రోజూ తిన్నా ఇదే సమస్య ఎదురవుతుంది. పాలు, పాత ఉత్పత్తులు కూడా అధిక మోతాదులో తీసుకోకూడదు. వాటిల్లో కొవ్వు ఉంటుంది. అది అధికంగా శరీరంలో చేరితే చెడు కొలెస్ట్రాల్ గా మారుతుంది. వెన్న తీసేసిన పాలను,ఉత్పత్తులను వాడితే సమస్య ఉండదు. అధికంగా మద్యం సేవించేవారికి కూడా రక్తనాళాల్లో బ్లాకేజ్ ఏర్పడే అవకాశం ఎక్కువ. కాబట్టి అలవాటు మానుకోలేకపోతే కనీసం తగ్గించండి. మితంగా తాగండి. ఫాస్ట్ ఫుడ్‌ను తినేవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. నూడుల్స్, మంచూరియాలు తెగ లాగిస్తారు చాలా మంది. వీటిని రోజూ తింటే సమస్య ముదిరిపోతుంది. ఎప్పుడో నెలకోసారి తిన్నా ఫర్వలేదు. ఇప్పటికే అధికబరువుతో బాధపడుతున్నవారు ఇలాంటి ఆహారాలన్నీ పక్కన పెట్టేయాలి. ఫాస్ట్ ఫుడ్ మరీ డేంజరస్. బరువును పెంచడంతో పాటూ, ఆరోగ్యసమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే, రక్తనాళాలు మూసుకుపోకుండా చూసుకోవాలి.
Also read: ఉగాదికి తెలుగులో శుభాకాంక్షలు చెప్పండి ఇలా
Also read: అరుదైన వ్యాధితో బాధపడుతున్న మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు, అందుకే లావైపోయిందట