Dizziness : నిల్చున్న వెంటనే మైకమా? కళ్లల్లో చీకటి అయిపోతుందా? కారణాలు, లక్షణాలు, నివారణ చర్యలివే
Dizziness Prevention Tips : లేవగానే కళ్లు తిరగడం లేదా దృష్టి మందగించడం వంటివి జరుగుతున్నాయా? అయితే ఇది ఓ వ్యాధికి సంకేతమని.. దానిని నిర్లక్ష్యం చేయవద్దని చెప్తున్నారు. అదేంటంటే..

Orthostatic Hypotension : సడెన్‌గా లేచిన వెంటనే లేదా ఎక్కువ సమయం కూర్చున్న తర్వాత ఒక్కసారిగా లేచినప్పుడు కొందరికి మైకం వచ్చినట్లుగా అనిపిస్తుంది. అలాగే కళ్ల ముందు చీకటిగా అనిపిస్తుంది. లేదంటే నీరసంగా, బలహీనంగా అనిపిస్తుంది. ఇది చాలామంది ఎక్కువగా అనుభవిస్తారు. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా కామన్ అని లేదా ఐరన్ లోపంగా భావించి లైట్‌గా తీసుకుంటారు. కానీ ఇలాంటి వాటిని తేలిగ్గా తీసుకోకూడదని వైద్య నిపుణులు చెప్తున్నారు. దీనిని ఒక రకమైన లో బీపీగా చెప్తారు. దీనిని వైద్య పరిభాషలో ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ లేదా పోస్చురల్ హైపోటెన్షన్ అంటారు. అసలు నిలబడిన వెంటనే ఎందుకు మైకం వస్తుంది? దాని లక్షణాలు ఏమిటి? దానిని ఎలా నివారించాలో తెలుసుకుందాం.
ఎందుకలా జరుగుతుందంటే..
కొంతమంది నిపుణులు ఏమి చెప్తున్నారంటే.. ఒక వ్యక్తి అకస్మాత్తుగా నిలబడినప్పుడు, గురుత్వాకర్షణ శక్తి కారణంగా.. శరీరంలోని రక్తం.. కాళ్లల్లో పేరుకుపోతుంది. దీనివల్ల గుండెకు తిరిగి వచ్చే రక్తం తగ్గిపోతుంది.అలా రక్తపోటు ఒక్కసారిగా పడిపోతుంది. దీనినే ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటారు. గుండె, రక్త నాళాలు ఈ లోపాన్ని భర్తీ చేయడానికి వేగంగా స్పందిస్తాయి. దీనివల్ల గుండె వేగంగా కొట్టుకోవడం, రక్త ప్రసరణను కొనసాగించడానికి కణాలు కుంచించుకుపోతాయి. కానీ ఎవరిలో అయితే ఈ ప్రతిస్పందన బలహీనంగా ఉంటుందో.. వారికి మైకం లేదా స్పృహ కోల్పోయే సమస్యలు వస్తుంటాయి.
ఎవరికి ప్రమాదం ఎక్కువ?
ఒక్కసారిగా లేచిన తర్వాత మైకం లేదా స్పృహ కోల్పోయే సమస్యలు సాధారణంగా వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తాయి. దీనితో పాటు, డీహైడ్రేషన్‌తో బాధపడేవారిలో ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే మహిళల్లో ఐరన్ లోపం ఉన్నవారిలో కూడా ఇలా జరుగుతుంది. కొన్ని ప్రత్యేక మందులు వాడేవారికి కూడా ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
లక్షణాలు ఏమిటంటే..
ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ లక్షణాలలో మైకం లేదా తల తిరగడం సర్వసాధారణం. దీనితో పాటు, కళ్లు మసకబారడం కూడా మరో లక్షణం. బలహీనత, అలసట, వికారం కూడా దీని లక్షణాలు కావచ్చు. వీటితో పాటు తీవ్రమైన సందర్భాల్లో స్పృహ కోల్పోవడం కూడా జరుగుతుంది. ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్లో ఈ లక్షణాలన్నీ నిలబడిన తర్వాతే ప్రారంభమవుతాయి. కూర్చున్న తర్వాత లేదా పడుకున్న తర్వాత కొద్దిసేపటికి తగ్గుతాయి. కానీ ఇది పదేపదే జరిగితే ప్రమాదానికి సంకేతం కావచ్చు.
డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలంటే..
ఎవరైనా పదేపదే స్పృహ కోల్పోవడం లేదా నిల్చొన్న వెంటనే మైకం వస్తే.. దానిని తేలిగ్గా తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. ఇది ఏదైనా తీవ్రమైన వైద్య సమస్యకు సంకేతం కావచ్చని చెప్తున్నారు. నాడీ వ్యవస్థలో లోపం, గుండె సంబంధిత వ్యాధులు లేదా న్యూరోలాజికల్ సమస్యల వల్ల ఇది సంభవించవచ్చు. కాబట్టి మీకు కూడా ఈ సమస్య పదేపదే వస్తుంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
నివారణ చర్యలు
ఈ సమస్యను నివారించడానికి.. ఎక్కువసేపు కూర్చున్న లేదా పడుకున్న తర్వాత లేచే ముందు నెమ్మదిగా లేవాలి. ముఖ్యంగా మంచం మీద నుంచి లేచేప్పుడు సడెన్‌గా లేవకూడదు. దీనితో పాటు డీహైడ్రేషన్ లేకుండా తగినంత నీరు తాగాలి. కాళ్లల్లో రక్తం పేరుకుపోకుండా ఉండటానికి కంప్రెషన్ స్టాకింగ్స్ ధరించాలి. ఈ సమస్యను నివారించడానికి, శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడటానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.






















