Low Blood Pressure : లో బీపీతో కళ్లు తిరుగుతున్నాయా? కారణాలివే.. రక్తపోటు తక్కువగా ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
Low BP in Summer : శరీరంలో బీపీ తక్కువైతే వివిధ సమస్యలు వస్తాయి. అసలు లో బీపీకి కారణాలేంటో.. ఈ సమస్య ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం.

Summer Hypotension : రక్తపోటు ఎక్కువైతేనే కాదు.. తక్కువైనా కూడా ఆరోగ్యానికి సమస్యలే వస్తాయి. బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో.. బీపీ తక్కువైతే కూడా అలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. లో బీపీ ఉన్నవారికి కళ్లు ఎక్కువగా తిరుగుతాయి. మూర్ఛపోవడం, దృష్టి లోపం, అలసట, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అసలు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణాలు ఏంటి? ఎలాంటి నివారణాలు ఫాలో అవ్వాలి? తీసుకోవాల్సిన చికిత్స ఏంటో చూసేద్దాం.
బీపీ తగ్గడానికి కారణాలివే..
డీహైడ్రేషన్ వల్ల బీపీ తగ్గుతుంది. ముఖ్యంగా సమ్మర్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. డీహైడ్రేషన్ వల్ల రక్త ప్రసరణ తగ్గి.. లో ప్రెజర్‌కి దారితీస్తుంది. విటమిన్ బి 12, ఫోలేట్, ఐరన్ వంటి విటమిన్ల లోపం వల్ల కూడా బీపీ తగ్గుతుంది. గుండె సమస్యలు ఉంటే హై బీపీ ఉంటుందనుకుంటారు కానీ.. కొన్ని రకాల గుండె సమస్యలు కూడా లో బీపీకి దారితీస్తాయి. హార్ట్ రేట్ తగ్గిపోవడం, గుండె వాల్వ్స్‌లో సమస్యలు, గుండె ఫెయిల్ అయినప్పుడు లో బీపీ వచ్చే అవకాశం ఎక్కువ.
హైపో థైరాయిడిజం ఉన్నవారు కూడా లోబీపీ సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అడ్రినల్ కొరత దీనికి దారి తీస్తుంది. ఏదైనా గాయం తగిలి తీవ్రంగా రక్తస్రావం అయినప్పుడు కూడా బీపీ తగ్గిపోతుంది. కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు కూడా బీపీపై నెగిటివ్ ప్రభావం చూపి.. తగ్గించేస్తాయి. డయాబెటిస్ కోసం ఉపయోగించే మందులు, వివిధ రకాల డ్రగ్స్ కూడా లో బీపీకి కారణమవుతున్నాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
లో బీపీ సమస్యలను తగ్గించుకోవడానికి మీ లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేయాలి. హైడ్రేటెడ్‌గా ఉండాలి. శరీరానికి తగినంత నీటిని అందించాలి. తక్కువ తక్కువగా ఎక్కువ మీల్స్ తినాలి. అలా అని ఫుడ్ ఎక్కువగా తీసుకోకూడదు. ఎక్కువగా మీల్ తీసుకోవడం వల్ల కూడా బీపీ డ్రాప్ అయ్యే అవకాశుమంది. ఇది పెద్దలు ఫాలో అవ్వాలి. వంటల్లో ఉప్పు పరిమాణాన్ని పెంచుకోవాలి. ఆల్కహాల్‌కి దూరంగా ఉంటే బీపీ తగ్గడం వంటి సమస్యలు రావు. రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తే రక్తప్రసరణ మెరుగువుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. హీట్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉండకండి. కూల్‌గా ఉండే ప్రదేశాల్లో ఉంటే మంచిది.
వైద్యులను ఎప్పుడు సంప్రదించాలంటే..
బీపీతో ఊరికే కళ్లు తిరిగిపడిపోవడం, కన్ఫ్యూజన్, కంటిచూపు మందగించడం వంటివి గుర్తిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. బీపీ రెగ్యులర్‌గా 90/60 mmHg కంటే తక్కువ ఉంటే కూడా డాక్టర్ దగ్గరికి వెళ్లాలి. లక్షణాలు కూడా ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.
లో బీపీ చికిత్సలివే..
లో బీపీ ఉంటే వైద్యులు కొన్ని విషయాల్లో మార్పులు చేయాలని చెప్తారు. లో బీపీ మైల్డ్‌గా ఉంటే లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చెప్తారు. ఫ్లూయిడ్స్ తీసుకోవడం పెంచమని, ఉప్పు కాస్త ఎక్కువగా తినమని సూచిస్తారు. రక్తప్రసరణను మెరుగుపరిచేందుకు కొన్నిరకాల మందులు సూచిస్తారు. థెరాయిడ్ సమస్య, హార్మోనల్ సమస్య ఉన్నవారికి హార్మోన్ రిప్లెస్మెంట్ చేయవచ్చు.






















