COVID-19 Vaccine: గర్భిణీలు కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా? తీసుకుంటే ఏమౌతుంది?
ప్రదానంగా గర్భం దాల్సిన వారు వ్యాక్సిన్ వేయించుకోవచ్చా? వేయించుకుంటే ఏమౌతుంది? అన్న సందేహాలు ఇంకా ఎంతో మందిని కలవరపెడుతూనే ఉన్నాయి.
ప్రస్తుతం మనం ఎక్కడికి వెళ్లినా... ఎదుటి వారు అడిగే మొదటి ప్రశ్న కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారా అని? ఇది సర్వసాధారణం అయిపోయింది. అయితే, వ్యాక్సిన్ ఎవరు వేయించుకోవచ్చు? ఎవరు వేయించుకోకూడదు? అన్న ప్రశ్నలు మనం తరచూ వింటూనే ఉన్నాం. ప్రదానంగా గర్భం దాల్సిన వారు వ్యాక్సిన్ వేయించుకోవచ్చా? వేయించుకుంటే ఏమౌతుంది? అన్న సందేహాలు ఇంకా ఎంతో మందిని కలవరపెడుతూనే ఉన్నాయి. పిల్లల కోసం ప్లానింగ్ చేసుకుంటున్న వారికి కూడా ఇదే కన్ఫ్యూజన్.
భారత దేశంలో ప్రత్యేకంగా గర్భిణీల మీద వ్యాక్సిన్ ప్రభావం ఎలా ఉంటుందన్న దానిపై ప్రయోగం చేయలేదు. కానీ, విదేశాల్లో దీనిపై పరిశోధనలు జరిగాయి. వారు అయితే ఎలాంటి భయం లేకుండా గర్భిణీలు వ్యాక్సిన్ తీసుకోవచ్చని చెబుతున్నారు. గర్భిణీలు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డకి వైరస్ సోకుతుందేమో అన్న భయం ఉండదని అంటున్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా గర్భిణీతో పాటు పుట్టే బిడ్డలోనూ రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుందట. అంతేకాదు, పిల్లల కోసం ప్లాన్ చేసుకునే దంపతులు కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. కానీ, వీరు వాక్సిన్ తీసుకున్న 3 నెలల తర్వాత ప్లాన్ చేసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు.
గర్భిణీకి కరోనా వస్తే...
గర్భం దాల్చినప్పుడు వ్యాక్సినేషన్ చేయించుకోరాదనే మూఢనమ్మకంతో కొందరు వ్యాక్సిన్‌కు దూరంగా ఉంటున్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకుంటే గర్భంలో ఉన్న పిండం లేదా శిశువు చుట్టూ ఓ రక్షణ వలయంలా వ్యాక్సిన్ పనిచేస్తుందని గైనకాలజిస్టులు తెలిపారు. ఒకవేళ గర్భిణీకి కోవిడ్ లక్షణాలు కనిపించగానే ఫలితాలు వచ్చే వరకు ఆగకూడదు. వెంటనే హోంఅసోలేషన్‌లోకి వెళ్లిపోవాలి. సాధారణంగా గర్భిణీలలో రోగ నిరోధకశక్తి అధికంగా ఉంటుంది కాబట్టి, కరోనా తీవ్రత పెద్దగా ఉండదు. కరోనా మందులు వాడుతూనే నిత్యం వాడే మందులను కూడా వేసుకోవాలి.
గర్భిణీ ప్రసవం మొదటి గంట తర్వాత కూడా వ్యాక్సిన్ పొందవచ్చు. సిజేరియన్ అయిన మహిళలైతే మూడు నెలల తర్వాత వ్యాక్సిన్ తీసుకోవచ్చు. మొదటి డోస్ తీసుకున్న తర్వాత గర్భం దాల్చితే కరోనా రిస్క్ తగ్గుతుంది. ప్రపంచంలోని చాలా దేశాలు గర్భిణీలు, ప్రసవించిన తల్లులకు సకాలంలో వ్యాక్సినేషన్ అందిస్తున్నారు. కొంతమంది కరోనా పాజిటివ్ ఉన్న గర్భిణీలలో ప్రీమెర్చూర్ ప్రసవాలు జరుగుతున్నాయి. మొదటి దశతో పోలిస్తే, ఈ సెకండ్ వేవ్‌లో 30 నుంచి 40 శాతం కంటే ఎక్కువ గర్భిణీలు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. అదృష్టం కొద్ది మొదట్లోనే దీనిని గుర్తించి పరీక్షలు చేయించుకుని, తగిన చికిత్స తీసుకుంటే చాలా వరకు సురక్షితంగా బయట పడుతున్నారు. ఇక దీర్షకాల వ్యాధులు ఉన్న గర్భవతులు, అధిక వయసు, అధిక బరువు ఉన్న వారిలో కొంచెం వ్యాధి తీవ్రత ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి వీరు కొంచెం వ్యాధి తీవ్రతను బట్టి ఎక్కువగా జాగ్రత్తలు, ముందుగానే వ్యాక్సిన్‌ను తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.