Diwali Food: దీపావళికి ఈ కూరగాయ వండుకుని తింటే సంపదే కాదు, ఆరోగ్యమూ కలిసొస్తుంది
దీపావళి రోజున కచ్చితంగా తినాల్సిన ఆహారంగా కందగడ్డను నమ్ముతారు చాలా మంది.
పండుగలను బట్టి తినాల్సిన ఆహారం కూడా సంప్రదాయంగా వస్తూ ఉంది. దీపావళి రోజు కచ్చితంగా స్వీట్లు తినాలని చెబుతారు. అలాగే సంక్రాంతికి అరిసెల్లాంటి కొన్ని రకాల ఆహారాలు కచ్చితంగా తింటాము. అట్లతద్దికి అట్లు తినాలని కూడా చెబుతారు. అలాగే దీపావళికి కంద దుంపతో వండిన వంటకాలు తినాలని చెబుతారు. ఇలా తినడం వల్ల వారికి సంపద కలిసొస్తుందని నమ్మకం. అలాగే కంద వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. వెలుగుల పండుగ రోజు స్వీట్లు తినడానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో కంద దుంపతో తినే వంటకాలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. వారణాసిలో కచ్చితంగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు. కంద దుంపతో కూర వండుకుని తింటారు. లేదా పులుసు పెట్టుకుంటారు. పూరీతోపాటూ ఈ కూరను తింటారు. వారణాసిలో కాయస్త్ అని పిలిచే తెగ వారు నివసిస్తారు. వారు కచ్చితంగా పాటించే నియమం ఇది. దీపావళి రోజున ఈ కూర చేయడం శుభప్రదమని చెబుతారు. అలాగే, ఈ కూరగాయను మీ ఇంట్లో పెంచడం వల్ల కుటుంబానికి సంపద, సంతోషం కలుగుతుందని అంటారు. ఇంట్లో పెంచిన కందను దీపావళి రోజున బయటకు తీసి వండాలని నమ్ముతారు.
ఏనుగు పాదంలా...
కంద దుంపను ‘ఎలిఫేంట్ ఫుట్’ అని పిలుస్తారు. ఆ దుంపను నిశితంగా పరిశీలిస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కంద దుంపలను నేల నుంచి బయటికి తీసేటప్పుడు చిన్న ముక్క భూమిలో ఉండిపోయినా అది మరో దుంపగా పెరుగుతుంది. ఈ దుంప ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది, దీన్ని లక్ష్మీ పూజలో ఉంచుతారు. ఇలా చేయడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయని అంటారు.
ఆరోగ్యానికి ఎంతో మేలు...
దీపావళి రోజు కచ్చితంగా తినమని చెప్పే కందదుంప తినమనడంలో ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి. ఇది తినడం వల్ల శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్ తగ్గుతుంది. ఈ కూరగాయలో యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. అలాగే దీన్ని తినడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. అనేక ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. కందలో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చాలా అవసరం. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా ఎంతో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ అధికంగా ఉంటాయి. ఇది తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలో పైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి తింటే శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది.
ఏం చేసుకోవాలి?
కంద చూడగానే నోరూరించేలా ఉండదు. అందుకే దీనితో ఏం వండుకోవాలో చాలా మందికి తెలియదు. కంద దుంపతో పులుసు కూర వండుకుని తినచ్చు. చాలా రుచిగా ఉంటుంది. చిన్న ముక్కలుగా తరుక్కుని వేపుడు చేసుకోవాలి. దీని రుచి అదిరిపోతుంది. అలాగే దీంతో కొన్ని ప్రాంతాల్లో పచ్చడి కూడా చేస్తారు. కందకు బెస్ట్ జోడీ పూరీ. బంగాళాదుంపకు బదులు కంద కూర తింటే చాలా బావుంటుంది.
Also read: దీపావళికి ఈ టేస్టీ హల్వాలు చేసి చూడండి, చాలా సులువు కూడా