Cigarette: సిగరెట్ కాల్చేవారు జాగ్రత్త, మీ నాలుక కూడా ఇలా మారిపోవచ్చు
ధూమపానం ఒక వ్యక్తి నాలుకను ఆకుపచ్చగా మార్చేసింది.
ధూమపానం ప్రమాదకరమని ఎంత చెబుతున్నా కూడా సిగరెట్ తాగే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. సిగరెట్ తాగడం వల్ల ఎన్నో రకాల వ్యాధులతో పాటు క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఎక్కువ. ఒక వ్యక్తి సిగరెట్ తాగడం వల్ల తన నాలుక రంగును కోల్పోయాడు. అతని నాలుక ఆకుపచ్చగా మారిపోయింది. అంతేకాదు ఆ నాలుకపై వెంట్రుకలులాంటివి కూడా మొలిచాయి. దీంతో అతను భయపడిపోయి వైద్యులను కలిశాడు. వైద్యులు అతనికి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణమేంటో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఆ వ్యక్తి సిగరెట్లు తాగడంతో పాటు, యాంటీబయోటిక్స్ ఒకే సమయంలో వాడుతున్నాడు. దీనివల్ల అతనిపై ఈ ప్రభావం పడినట్లు భావిస్తున్నారు వైద్యులు.
అతని వయసు 64 సంవత్సరాలు. అమెరికాలోని ఒహియోలో ఉంటున్నాడు. నాలుక మెల్లమెల్లగా రంగు మారుతూ కొన్ని వారాలకు ఆకుపచ్చగా అయిపోయింది. నాలుక పై పూత లాంటిది వచ్చింది. రుచి మొగ్గలు పొడుచుకు వచ్చినట్టు వెంట్రుకల్లా మారాయి. ఆ నాలుకపై ఎన్నో బ్యాక్టీరియాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ధూమపానం చేస్తూ యాంటిబయోటిక్స్ వాడుతూ, నోటి పరిశుభ్రతను పాటించకపోవడం వల్లే అతనికి ఇలాంటి సమస్య వచ్చిందని చెబుతున్నారు వైద్యులు. ధూమపానం ఈ పరిస్థితిని మరింత తీవ్రంగా మారుస్తుంది. బ్యాక్టీరియా, ఫలకాలు నాలుక పై పేరుకుపోయేలా చేస్తుంది. అలాగే అతను చిగుళ్ల ఇన్ఫెక్షన్ కోసం కొన్ని రోజులుగా యాంటీబయోటిక్ ను వాడుతున్నాడు. అది కూడా ఈ విధంగా సైడ్ ఎఫెక్ట్ ను ఇచ్చి ఉంటుందని భావిస్తున్నారు వైద్యులు.
ధూమపానం ఎంత ప్రమాదకరమైందంటే సిగరెట్ పొగలో ఏడు వేల కంటే ఎక్కువ రసాయనాలు ఉంటాయి. వీటిలో 69 క్యాన్సర్‌కు కారణం అయ్యేవే. రోజూ ధూమపానం చేసేవారు, ఆ పొగను పీల్చేవారు కూడా క్యాన్సర్ బారిన పడే అవకాశం పెరిగిపోతుంది. పొగాకు దాని వినియోగదారుల్లో దాదాపు సగం మందిని చంపుతుందని అంచనా. సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటే ఎదుటివారు ధూమపానం చేస్తూ ఉంటే పక్కన నిలుచుని ఆ పొగను పీల్చడం... ఇది కూడా చాలా ప్రమాదకరం. ఈ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ వల్ల కూడా ఎంతోమంది క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారు. ప్రతి ముగ్గురిలో ఒకరి కంటే ఎక్కువ మంది పొగాకును మన దేశంలో వినియోగిస్తున్నట్టు అంచనా. ఇది వ్యసనంగా మారిపోయాక చాలామంది వదల లేకపోతున్నారు.
ధూమపానం నుంచి బయటపడడానికి కొన్ని దారులు ఉన్నాయి. డైట్ థెరపీ, హైడ్రో థెరపి, యోగా, ధ్యానం వంటివి పాటిస్తే మంచిది. డైట్ థెరపీలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలను తినాలి. వీటిని తినడం వల్ల మెదడులో సెరటోనిన్ స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల ప్రశాంతంగా అనిపిస్తుంది. సిగరెట్ తాగాలన్న ఆసక్తి తగ్గుతుంది. హైడ్రో థెరపి అంటే శరీరానికి కాసేపు మసాజ్ చేసుకొని, శరీర ఉష్ణోగ్రతకు తగిన నీటితోనే స్నానం చేయాలి. అతి చల్లగా, కానీ వేడిగా ఉన్న నీటితో చేయకూడదు. ఇలా స్నానం చేయడం వల్ల విశ్రాంతి లభిస్తుంది. శరీరం ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే సమతుల్య శాఖాహార భోజనం తిని నిద్రపోయే ముందు గ్లాసుడు పాలు తాగి శరీరాన్ని మసాజ్ చేయించుకుంటే మంచిది. యోగా, ధ్యానం వంటివి కూడా వ్యసనాలకు దూరంగా ఉంచేందుకు సహాయపడతాయి. ప్రాణాయామం, శ్వాస వ్యాయామాలను చేయడం ద్వారా సిగరెట్ తాగాలన్న ఆసక్తిని చంపేయాలి.
Also read: వైరల్ అవుతున్న గ్రీన్ జిలేబి, దీన్ని దేనితో తయారు చేస్తారో తెలుసా?